నరకయాతన | hell of pain | Sakshi
Sakshi News home page

నరకయాతన

Published Tue, Mar 10 2015 2:17 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

hell of pain

నరకం ఎలా ఉంటుందో ఈ సంఘటన చూస్తే తెలుస్తుంది.. నుజ్జు నుజ్జు అయిన కారులో ఇరుక్కు పోయిన ఓ యువకుడు.. అతని శరీరంలో నుంచి కారుతున్న రక్తపు ధారలు.. కారులో నుంచి బయటికి రావాలని అతని తపన.. కానీ రెండు కాళ్లు పూర్తిగా ఇరుక్కొని పోయి రాలేని నిస్సహాయత.. ఇలా ఆ యువకుడు రెండు గంటల పాటు నరకయాతన అనుభవించాడు. చివరకు పోలీసులు రంగంలోకి దిగి అతన్ని ప్రాణాలతో కాపాడగలిగారు.
 
 ప్రొద్దుటూరు క్రైం: స్థానిక ఎర్రగుంట్ల రోడ్డులోని పాలకేంద్రం సమీపంలో సోమవారం లారీ-కారు ఢీ కొన్న సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తుమ్మలూరు మల్లికార్జునరెడ్డితోపాటు జ్యోతిరామసుదర్శనరెడ్డి, కాకమాని శివకుమార్, యాకవల్లి జయమ్మ, మల్లికార్జునరెడ్డి భార్య దివ్యతేజలకు గాయాలయ్యాయి.  
 
పెళ్లి వేడుకలు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో..
ముద్దనూరు మండలం ఉమ్మారెడ్డిపల్లె గ్రామానికి చెందిన మల్లికార్జునరెడ్డి చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఇతని సోదరుడు ప్రమోద్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. కాగా ప్రమోద్‌రెడ్డి వివాహం సోమవారం ఉదయం 3 గంటల సమయంలో ప్రొద్దుటూరులోని వాసవీ కల్యాణ మంటపంలో జరిగింది. వివాహం అనంతరం నూతన దంపతులు తిరుమలలో కల్యాణం జరిపేందుకని ఉదయాన్నే కారులో బయలుదేరి వెళ్లారు. వారితో పాటు కొంత మంది ముఖ్యమైన బంధువులు కూడా కలిసి వెళ్లారు.  

మల్లికార్జునరెడ్డి దంపతులతో పాటు అతని స్నేహితుడు హైదరాబాద్‌కు చెందిన శివకుమార్, తాడిపత్రి సమీపంలోని పెద్ద పప్పూరుకు చెందిన బ్యాంక్ ఉద్యోగి  రామసుదర్శనరెడ్డి, పని మనిషి జయమ్మలు ఇన్నోవా కారులో ముద్దనూరుకు బయలుదేరారు. అయితే ప్రొద్దుటూరు శివారులోని పాలకేంద్రం వద్దకు రాగానే లారీ ఢీకొన్న సంఘటనలో ఐదు మంది గాయ పడ్డారు. ప్రమాదం జరగగానే కారులోని ఎయిర్ బెలూన్ బయటికి రావడంతో కారులో ఉన్న వారికి ప్రాణాపాయం తప్పినట్లైంది.
 
రెండు గంటల పాటు కారులోనే చిక్కుకుని..
ప్రమాద సంఘటలో శివకుమార్, దివ్యతేజలకు స్వల్ప గాయాలు కాగా రామసుదర్శన్‌రెడ్డి, జయమ్మలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయ పడిన వారిని వెంటనే 108 వాహనంలో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సంఘటనలో కారు నుజ్జు నుజ్జు కావడంతో డ్రైవింగ్ చేస్తున్న మల్లికార్జునరెడ్డి అందులోనే ఇరుక్కొని పోయాడు. అతని రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయిన కారు బాడి కింద ఉండిపోయాయి. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకొని మల్లికార్జునరెడ్డిని బయటికి తీసే ప్రయత్నం చేశారు. అయితే వారికి సాధ్యం కాలేదు.  అతనికి రక్తం కారుతుండటంతో నీరసం రాకుండా ఉండేందు కోసం 108 సిబ్బంది అక్కడికి చేరుకొని సెలైన్ బాటిళ్లు పెట్టారు.
 
శభాష్ పోలీస్..
సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐలు సత్యనారాయణ, మహేశ్వరరెడ్డిలు కారులో ఉన్న మల్లికార్జునరెడ్డిని కాపాడటానికి తీవ్రంగా శ్రమించారు. ముందుగా సీఐలు ఇద్దరూ అతన్ని బయటికి తీసే ప్రయత్నం చేశారు. అయితే సాధ్యం కాకపోవడంతో వెంటనే గ్యాస్ కట్టర్‌ను తెప్పించారు. అక్కడ సహాయక చర్యలు చేపడుతూనే  స్తంభించి పోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. వారితో పాటు ఎస్‌ఐలు లక్ష్మినారాయణ, మహేశ్, వెంకటేశ్వర్లు, ఏఎస్‌ఐ శంకర్‌లు సిబ్బంది సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.

కారులో చిక్కుకుపోయిన అతనికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీఐల సూచన మేరకు గ్యాస్ కట్టర్‌తో కారులోపలి భాగాలను తొలగించి మల్లికార్జునరెడ్డిని కాపాడగలిగారు.  తీవ్రంగా గాయపడిన అతన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు రెండు కాళ్లు విరిగినట్లు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం గాయ పడిన వారిని హైదరాబాద్‌కు తరలించారు.  సకాలంలో స్పందించి యువకుడి ప్రాణాలను కాపాడిన పోలీసు అధికారులు, సిబ్బందిని బాధితుల బంధువులు, స్థానికులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement