రైలులో రాయితీల కూత | Here Complete List Of Railway Concessions | Sakshi
Sakshi News home page

రైలులో రాయితీల కూత

Published Tue, May 28 2019 12:15 PM | Last Updated on Tue, May 28 2019 12:17 PM

Here Complete List Of Railway Concessions - Sakshi

సాక్షి, ఏలూరు (టూటౌన్‌) : భారతీయ రైల్వేలో రాయితీల కూత కూస్తుంది. అన్ని వర్గాల ప్రజలకు రైల్వే శాఖ అనేక రాయితీలను ఇస్తుంది. తక్కువ ఛార్జీలతో ప్రయాణికులకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ గమ్యస్థానాలకు చేరుస్తోంది. దీనిలో విద్యార్థులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, జర్నలిస్టులు, కళాకారులు, వృద్దులు, జాతీయ పురస్కార గ్రహీతలు, అమరవీరుల కుటుంబ సభ్యులు, క్రీడాకారులు, స్వాతంత్ర సమరయోధులు.. ఇలా ఎన్నో వర్గాలకు వివిధ రుపాల్లో రైల్వే రాయితీ కల్పిస్తుంది. ఇవి ఎలా పొందాలో అవగాహన లేకపోవడం వల్ల రైల్వేలో రాయితీ ప్రయాణాలను చాలా మంది పొందలేకపోతున్నారు. ఆయా వర్గాల వారు  వారి శాఖలు అందించే అధికారిక గుర్తింపు కార్డులను రైల్వే అధికారులకు సమర్పిస్తే రాయితీలను పొందే అవకాశం ఉంటుంది. రైల్వేలో లభించే వివిధ రాయితీల వివరాలను మీకోసం ‘సాక్షి’ అందిస్తుంది.

గుర్తింపుకార్డులు..
రైల్వే శాఖ ప్రకటించిన రాయితీలు పొందేందుకు జర్నలిస్టులు, కళాకారులు, క్రీడాకారులు ముందుగా రైల్వే అధికారుల నుంచి గుర్తింపు కార్డులు పొందాలి. మిగిలిన వర్గాల వారు వారికి సంబంధించిన అర్హత సర్టిఫికెట్లను రైల్వే బుకింగ్‌ కౌంటర్‌ వద్ద చూపించి రాయితీ పొందవచ్చును. అలాగే ధ్రువీకరణ పత్రాలను ప్రయాణ సమయంలో తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాలి. రైల్వే అధికారులు అడిగినప్పుడు వారికి చూపించాల్సి ఉంటుంది.

విద్యార్థులకు ఉచిత పాస్‌లు..
పదో తరగతి వరకూ చదివే విద్యార్థులు, ఇంటర్‌ చదివే బాలికలకు మాత్రమే రైల్వేశాఖ ఉచిత ప్రయాణ పాసులను అందిస్తోంది. ఇందులో విద్యార్థి నివాస ప్రాంతం నుంచి స్కూల్, కాలేజీలకు వెళ్లి రావడానికి ఈ పాస్‌లను జారీ చేస్తారు. ఈ పాస్‌ల కోసం విద్యార్థులు రైల్వే కౌంటర్‌ నుంచి ప్రత్యేక దరఖాస్తులను తీసుకుని వాటిపై సంబంధిత ప్రధానోపాధ్యాయుల, కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ చేత అటెస్టేషన్‌ చేయించాల్సి ఉంది.

కాలేజీ విద్యార్థులకు సంబంధించి..
సగం చార్జీలకే కాలేజీ విద్యార్థులకు రైల్వే శాఖ సీజన్‌ టిక్కెట్లను జారీ చేస్తుంది. ఈ పాసులను మూడు నెలలకు ఒకేసారి తీసుకుంటే తగ్గింపు లభిస్తుంది. ఈ సీజన్‌ పాసులను రెండు ప్రాంతాల మధ్య 150 కిలోమీటర్లు లోపు ప్రయాణించే వారికి జారీ చేస్తారు. విద్యార్థి నివాసానికి, చదివే కాలేజీకి మధ్య ఈ దూరంను పరిగణలోనికి తీసుకుంటారు.

జర్నలిస్టులకు 50 శాతం రాయితీ..
దేశవ్యాప్తంగా వివిధ పత్రికలు, ఛానెల్స్‌లో పనిచేసే అక్రిడేటెడ్‌ జర్నలిస్టులకు ప్రయాణ ఛార్జీల్లో 50 శాతం రాయితీని రైల్వే శాఖ ఇస్తుంది. ఈ పాసు ద్వారా జర్నలిస్ట్‌ ఏడాది పొడవునా, భార్య, ఇద్దరు పిల్లలు ఏడాదిలో రెండు పర్యాయాలు సగం చార్జీలతో ప్రయాణం చేయవచ్చు.

15 రోజుల చార్జితో నెలంతా ప్రయాణం..
సీజన్‌ టిక్కెట్‌ ప్రయాణికులు తాము ప్రయాణించే రెండు ప్రాంతాల మధ్య ఉన్న చార్జీని 15 రోజులకు ఒకేసారి చెల్లించి దీన్ని పొందవచ్చును. ఈ సీజన్‌ టిక్కెట్‌ ద్వారా నెలంతా ప్రయాణం చేసే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తోంది. ప్రయాణ దూరం 150 కిలోమీటర్ల లోపు దీన్ని వర్తింప చేసేవారు. అయితే తాజాగా ఈ దూరాన్ని 180 కిలోమీటర్లకు పెంచారు.

ప్రభుత్వ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు వెళ్లే వారికి..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరడానికి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు జనరల్‌ విభాగంలో ఉచిత ప్రయాణ సౌకర్య కల్పిస్తారు. స్లీపర్‌ క్లాసులో అయితే 50 శాతం రాయితీని అందిస్తారు.

అవార్డు గ్రహీతలకు..
రాష్ట్రపతి నుంచి పోలీస్‌ మెడల్, ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌ సాధించిన పురుషులకు అన్ని రైళ్లలో 50 శాతం రాయితీని, మహిళలకు 60 శాతం రాయితీని ఇస్తారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులకు 50 శాతం రాయితీతో సెకండ్‌ క్లాస్‌ స్లీపర్‌ క్లాసులో ప్రయాణించే వెసులుబాటును కల్పిస్తున్నారు.

అమరవీరుల కుటుంబాలకు..
విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరులకు, ఉగ్ర దాడుల్లో మరణించిన మిలటరీ దళాలు, పోలీసు కుటుంబాల సభ్యులకు జనరల్, స్లీపర్‌ ఛార్జీల్లో రాయితీని కల్పిస్తున్నారు.

క్రీడాకారులకు...
జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొనే వారికి జనరల్, స్లీపర్‌ క్లాసుల్లో 75 శాతం ఫస్ట్‌ క్లాసుల్లో రాయితీని పొందవచ్చును. పర్వతారోహణల్లో పాల్గొనే వారికి కూడా ఇదే తరహాలో రాయితీలు వర్తిస్తాయి.

వైద్యులకు, సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగులకు..
అంతర్జాతీయ స్థాయిలో సివిల్‌ సర్వీస్‌ సేవలు అందిస్తున్న వారికి, సామాజిక, సాంస్కృతిక, విద్యారంగాల్లో అఖిల భారత సదస్సులకు హాజరయ్యే వైద్యులకు జనరల్, స్లీపర్‌ క్లాస్‌లలో 25 శాతం రాయితీని రైల్వే అందిస్తుంది. వి«ధులకు వెళ్లే నర్సులకు కూడా ఈ రాయితీ వర్తింస్తుంది.

దివ్యాంగులకు..
శారీరక వైకల్యం, మానసిక రుగ్మతలతో బాధపడే వారు, అంధులకు జనరల్, స్లీపర్, థర్డ్‌ ఏసీలతో పాటు ఏసీ చైర్‌ కార్‌లో 75 శాతం రాయితీతో ప్రయాణించవచ్చు. ఫస్ట్‌క్లాస్, సెకండ్‌ క్లాస్‌ ఏసీల్లో 50 శాతం రాయితీ వస్తుంది. రాజధాని, శతాబ్ది రైళ్లల్లో 25 శాతం మినహాయింపు ఉంటుంది. వీరితో పాటు వెంట వెళ్లే సహాయకులకు కూడా టికెట్‌ ఛార్జీల్లో అంతే రాయితీ లభిస్తుంది. చెవిటి, మూగ (బధిరులకు) సెకంట్‌ క్లాస్, స్లీపర్‌ క్లాస్, ఫస్ట్‌ క్లాసు ఏసీల్లో 50 శాతం రాయితీ కల్పిస్తున్నారు.

వృద్ధులకు..
సీనియర్‌ సిటిజన్లకు రైల్వే శాఖ రాయితీలను అందిస్తోంది. 60 సంవత్సరాలు నిండిన పురుషులకు 40 శాతం, 58 ఏళ్లు నిండిన మహిళలకు 50 శాతం చొప్పున రాయితీని కల్పిస్తున్నారు. ఈ రాయితీ అన్ని తరగతుల ప్రయాణ ఛార్జీలకు వర్తిస్తాయి.

దీర్ఘకాలిక వ్యాధులతో భాధపడే వారికి
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు అనగా క్యాన్సర్‌ రోగులు తరచూ రైలులో ప్రయాణించాలంటే తరగతులను బట్టి 50 శాతం నుంచి 100 శాతం రాయితీని అమలు చేస్తున్నారు. వీరితో పాటు వీరికి సహాయకులుగా వెళ్లే వారికి ఇదే రాయితీ వర్తిస్తుంది. తలసేమియా, గుండె, కిడ్నీ, శస్త్ర చికిత్సలకు వెళ్లే వారికి 50 శాతం రాయితీని అందిస్తున్నారు. కుష్టు, హెచ్‌ఐవీ, అనీమియా, టీబీ రోగులకు 50 నుంచి 75 శాతం వరకూ రాయితీని ఇస్తున్నారు.

కళాకారులు, కార్మికులకు..
కూరగాయలు అమ్ముకునే వారు, ఇళ్లల్లో పనిచేసేవారు, వ్యవసాయ కార్మికులు, నిర్మాణ రంగ కార్మికులకు 100 కిలోమీటర్ల పరిధిలో అత తక్కువ ధరకే సీజన్‌ టిక్కెట్లు అందిస్తోంది. ఈ రాయితీలు పొందాలంటూ టిక్కెట్‌కు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేశారు. కళాకారులకు జనరల్, స్లీపర్‌ క్లాసుల్లో 75 శాతం, ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ చైర్‌ కార్‌ 50 శాతం, సినీ సాంకేతిక నిపుణులకు విధుల్లో  ప్రయాణించాలంటే స్లీపర్‌ క్లాసులో 75 శాతం, ఫ్లస్ట్‌ క్లాస్‌ ఏసీలో 50 శాతం రాయితీని రైల్వే శాఖ కల్పిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement