సాక్షి, అమరావతి బ్యూరో : అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్నీతిని అమలుచేశారు. రాజ ధాని ఎంపికలో రాజధర్మం మంటగలిపారు. అధికారం చేపట్టిన నెలరోజుల్లోనే రాజధానిగా గుంటూరు జిల్లా తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలను ఎంపిక చేశారు. ఆ విషయాన్ని చంద్రబాబు గోప్యంగా ఉంచారు. తన కుటుంబ సంస్థలు, సన్నిహితులు, బినామీలు వేల ఎకరాల భూములను ఆ ప్రాంతంలో కొనుగోలు చేసేలా చేసి లక్షల కోట్లు దోపిడీ చేసిన వైనాన్ని ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
ఈ బాగోతంలో చంద్రబాబు కుటుంబ ప్రమేయాన్నీ నిజం చేస్తూ హెరిటేజ్ కోసం కూడా ఆనాడే 14.22 ఎకరాలను తాను ముందే అనుకున్న రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేశారు. తర్వాత అదే ప్రాంతంలో రాజధానిని ప్రకటించారు. అంతేకాక, ఈ ప్రాంతాన్ని ల్యాండ్‌పూలింగ్ పరిధిలోకి రాకుండా జాగ్రత్తపడ్డారు. ఇన్నర్ రింగ్‌రోడ్డును కూడా హెరిటేజ్ భూముల ముందు నుంచి వెళ్లేలా ‘మాస్టర్‌ప్లాన్’ రూపొందించినట్లు ‘సాక్షి’ తాజా పరిశోధనలో వెలుగుచూసింది.
రాజధానిపై తప్పుదోవ పట్టించి మరీ..
చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే గుంటూరు జిల్లా తాడికొండ, మంగ ళగిరి నియోజకవర్గాల పరిధిలో రాజధానిని ఎంపిక చేయాలని నిర్ణయించి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు తెరతీశారు. అందులో భాగంగా.. ఉద్దేశపూర్వకంగా రాజధాని ప్రాంతంపై ఇతర ప్రాంతాల పేర్లను ప్రచారంలోకి తెచ్చారు. కృష్ణా జిల్లా నూజివీడు, గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వంటి పలు ప్రాంతాలను రాజధానిగా ఎంపిక చేయనున్నారని ప్రచారంలోకి తెచ్చారు. దాంతో రాష్ట్రంలో ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతరులు ఆ ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేశారు.
ఆ తర్వాత సీన్ పూర్తిగా మార్చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ, మంగళగిరి ప్రాంతాల్లో భూములు కొనుగోలు వ్యవహారం పూర్తయిన తరువాత చంద్రబాబు అసలు కథకు తెరతీశారు. ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసినట్లు 2014, డిసెంబర్ 28న ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఆ ప్రాంతంలో ఎకరా మార్కెట్ విలువ రూ.5లక్షలు ఉన్న భూముల ధరలు పెరిగిపోయాయి. ఎకరా మార్కెట్ ధర రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు చేరుకుంది. తద్వారా చంద్రబాబు, ఆయన బినామీలు, సన్నిహితులు వేలకోట్లు కొల్లగొట్టారు.
పూలింగ్ నుంచి మినహాయింపు
రాజధాని కోసం ప్రభుత్వం భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) ప్రక్రియ చేపడుతున్నట్లు 2015, జనవరి 1న నోటిఫికేషన్ జారీచేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని మొత్తం 29 గ్రామాలను ల్యాండ్ పూలింగ్ పరిధిలో చేర్చారు. కానీ, చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్, ఆయన సన్నిహితుడైన లింగమనేని సంస్థకు చెందిన భూములు ఉన్న తాడికొండ మండలం కంతేరు గ్రామాన్ని పూలింగ్ ప్రక్రియలో చేర్చనే లేదు.
మంగళగిరి మండలం నిడమర్రు గ్రామం వరకు ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకున్నారు. కానీ, నిడమర్రును ఆనుకునే ఉన్న కంతేరు ల్యాండ్ పూలింగ్‌లో లేకపోవడం గమనార్హం. చంద్రబాబు కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ పుడ్స్ కొనుగోలు చేసిన భూములతోపాటు, ఆయన సన్నిహిత సంస్థ లింగమనేని ఎస్టేట్స్‌కు చెందిన వందలాది ఎకరాలు కంతేరులోనే ఉన్నాయి. అమాంతం ధరలు పెరిగిన ఆ భూములన్నీ హెరిటేజ్, లింగమనేని ఎస్టేట్ గుప్పిట్లోనే ఉండేట్లుగా వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
ఆ అవినీతి బంధం డృఢమైంది..
లింగమనేని ఎస్టేట్స్ డైరెక్టర్ లింగమనేని రమేష్, ఆయన సోదరుడు వెంకట సూర్య రాజశేఖర్‌లు సీఎంకు అత్యంత సన్నిహితుడు, బినామీలే అన్న ఆరోపణలు ఉన్నాయి. కృష్ణా తీరంలో లింగమనేని ఎస్టేట్స్ అక్రమంగా నిర్మించిన భవనాన్నే సీఎం చంద్రబాబు తన అధికారిక నివాసంగా చేసుకున్నారు.
గుంటూరు జిల్లా తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో వందలాది ఎకరాలను లింగమనేని సంస్థ కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే.. రాజధాని కోసం సామాన్య రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం భూములు తీసుకోగా.. మరోవైపు సీఎం చంద్రబాబు మాత్రం తన బినామీలు, సన్నిహితుల భూముల ధరలు అమాంతంగా పెరిగేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడటం గమనార్హం.
ఇన్నర్ రింగ్‌రోడ్డూ మెలికలు తిరిగింది..
రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా 250 అడుగుల వెడల్పుతో అమరావతి చూట్టూ ఇన్నర్‌రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆ ఇన్నర్‌రింగ్ రోడ్డు కచ్చితంగా హెరిటేజ్ సంస్థ భూముల ముందు నుంచే వెళ్తుండటం గమనార్హం. కంతేరులో సర్వే నంబర్ 27/3ఎ ముందు నుంచే వెళ్తోంది.
అదే విధంగా హెరిటేజ్, లింగమనేని సంస్థల భూములన్నీ కూడా ఇన్నర్‌రింగ్‌కు రెండువైపులా ఉన్నాయి. అంతేగాక.. ఆ ఇన్నర్ రింగ్‌రోడ్డు కోసం భూసేకరణ పరిధిలో చేరకపోవడం గమనార్హం. ఈ రెండు సంస్థలకు ప్రయోజనం కలిగించేందుకే ఇన్నర్‌రింగ్ రోడ్డు మ్యాప్ రూపొందించారన్నది స్పష్టమవుతోంది.
సీఎం అయిన నెల రోజులకే..
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2014, జూన్ 8న ప్రమాణస్వీకారం చేశారు. అధికారిక రహస్యాలను కాపాడతానని కూడా ఆ ప్రమాణ స్వీకారంలో చెప్పారు. కానీ, అధికారిక రహస్యాలను తమ స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకున్నారు. రాజధాని ప్రాంత ఎంపిక వ్యవహారాన్ని తమ అక్రమ సంపాదనకు సాధనంగా చేసుకున్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెలరోజుల్లోనే ఈ అవినీతి వ్యూహానికి తెరతీశారు. అదెలాగంటే..
♦ 2014, జూలై 7న గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో పలుచోట్ల హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ భూములు కొనుగోలు చేసింది. సర్వే నంబర్లు 27/3బి, 22/2ఎ, 63/1, 62/2బి, 27/3ఎలలో 7.21 ఎకరాలు కొనుగోలు చేయడం గమనార్హం. ఆ 7.21 ఎకరాలను రూ.67.68లక్షలకు కొనుగోలు చేశారు. ఈ భూములన్నీ కూడా విజయవాడకు చెందిన మొవ్వా శ్రీలక్ష్మి అనే ఆమె నుంచి కొన్నారు. ఆ భూములను కూడా మొవ్వా శ్రీలక్ష్మీ గతంలో జీపీఏ ద్వారానే పొందడం గమనార్హం.
♦ 2014, సెప్టెంబరు 8న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ కంతేరు గ్రామంలోనే మరోసారి భూములు కొనుగోలు చేసింది. సర్వే నంబర్లు 56, 63/2బిలలో ఉన్న 2.46 ఎకరాలను రూ.19.68లక్షలకు కొనుగోలు చేశారు. ఆ భూములను విజయవాడకు చెందిన చిగురుపాటి వెంకటగిరిధర్ అనే వ్యక్తి అంతకుముందు కొంతకాలం క్రితమే జీపీఏ ద్వారా పొందారు. ఆయన ఆ భూములనే హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు విక్రయించారు.
♦ 2014, సెప్టెంబరు 8న హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ కంతేరులోనే మరికొన్ని భూములను కొనుగోలు చేసింది. సర్వే నంబర్లు 56, 63/1, 63/2బి లలో ఉన్న 4.55 ఎకరాలను కొన్నారు. ఆ 4.55 ఎకరాలను రూ.36.40లక్షలకు లింగమనేని ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్, లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేటు లిమిటెడ్ సంస్థల నుంచి కొనుగోలు చేయడం గమనార్హం.
ఇలా.. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ మొత్తం 14.22 ఎకరాలను రూ.1.23,76,000లకు కొనుగోలు చేసింది. ఆ భూములన్నీ గుంటూరు జిల్లా తాడికొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు పరిధిలో ఉన్నాయి. కానీ, ఆ భూములను పెదకాకాని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment