‘హీరో’ రివర్స్ గేర్!
సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో రూ. 6 వేల కోట్లతో ద్విచక్ర వాహనాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చిన హీరో మోటోకార్ప్ సంస్థ ఇప్పుడు రివర్స్ గేర్‌లో నడుస్తోందా? రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కకపోవడంతో పక్క చూపులు చూస్తోందా? అంటే అవునంటున్నాయి అధికారవర్గాలు. కేంద్రం ‘ప్రత్యేక హోదా’ ఇస్తే ఎలాంటి రాయితీలు వస్తాయో.. అలాంటి రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటూ తాజాగా ఆ సంస్థ షరతు పెట్టడం ఇందుకు బలం చేకూర్చుతోంది.
పారిశ్రామికాభివృద్ధిపై రోజూ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తూ ఉన్నా.. ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రంలో ఏర్పాటుకాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం తన సొంత జిల్లాలో హీరో పరిశ్రమకు శంకుస్థాపన చేయాలని పట్టుదలతో ఉన్నారు. కానీ, ఆ సంస్థ నుంచి ఉలుకూపలుకూ లేకపోవడం గమనార్హం. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం పేరుతో చంద్రబాబు దేశ విదేశాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. చిత్తూరు-నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో ఆటోమొబైల్ హబ్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హీరో పరిశ్రమ ఆటోమొబైల్ హబ్‌కు ఊతమిస్తుందంటూ ప్రభుత్వం పేర్కొంది.
ఆటోమొబైల్ విధానం ప్రకటించినా..
చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం దాసకుప్పం వద్ద హీరో సంస్థకు 650 ఎకరాల భూమిని గతేడాది సెప్టెంబరు 16న కేటాయించింది. ఈ పరిశ్రమకు రాయితీలు కల్పిం చాలన్న ప్రధాన లక్ష్యంతో ఆటోమొబైల్ విధానాన్ని డిసెంబర్ 1న ప్రభుత్వం విడుదల చేసింది. పరిశ్రమకు యూనిట్ విద్యుత్‌ను 75 పైసలు చొప్పున సరఫరా చేసేందుకు సర్కారు అంగీకరించింది.
20 ఏళ్ల పాటు పరిశ్రమకు వ్యాట్ నుంచి మినహాయింపును ఇచ్చింది. పదేళ్ల పాటు వంద శాతం సీఎస్‌టీని రీయింబర్స్ చేస్తామని హామీ ఇచ్చింది. పది శాతం రాయితీపై భూమి, పెట్టుబడి రాయితీ పది శాతం, ఐదు శాతం వడ్డీ రాయితీ, ఉచితంగా డబులైన్ రోడ్డు, 50 శాతం రాయితీపై నీటిని సరఫరా చేస్తామని ఆటోమొబైల్ విధానంలో పేర్కొంది. అధికారం చేపట్టి ఏడాది పూర్తయ్యే జూన్ 8లోగా కనీసం హీరో పరిశ్రమకైనా శంకుస్థాపన చేయాలని సీఎం భావించారు.
పక్క రాష్ట్రాల వైపు చూపు..
తొలి దశలో రూ. 2,200 కోట్లతో ఏడాదికి 1.8 మిలియన్ వాహనాల తయారీ సామర్థ్యంతో పరిశ్రమకు శంకుస్థాపన చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు హీరో సంస్థ అంగీకరించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక ఆటోమొబైల్ విధానాలు మెరుగ్గా ఉన్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కాకనే పరిశ్రమ పనులను ప్రారంభిస్తామని, లేదంటే అలాంటి రాయితీలు ఇప్పుడిచ్చినా పరిశ్రమ స్థాపిస్తామని హీరో ప్రతినిధులు ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఇదే అదనుగా తమిళనాడు ప్రభుత్వం హీరో సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడం ద్వారా చేకూరే లబ్ధిని తామే కల్పిస్తామంటూ ప్రతిపాదించింది. తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనపై ‘హీరో’సానుకూలంగా ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి.