
టీటీడీ చైర్మన్ పదవిపై హీరో కన్ను!
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధ్యక్ష పదవిపై టాలీవుడ్ హీరో కన్నేశాడు. టీటీడీ చైర్మన పదవి తనకు దక్కుతుందని అతడు నమ్మకంగా చెబుతున్నాడు. అయితే పదవి కోసం తాను పైరవీలు చేయనని, పదవే తనను వెతుక్కుంటూ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. టీటీడీ చైర్మన్ గిరి రేసులో తానున్నాంటూ శివాజీ ప్రకటించడంతో ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న టీడీపీ నాయకులు ఉలిక్కి పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పదవిపై సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, నగరి మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాగంటి మురళీమోహన్‌లు పేర్లు వెలుగులోకి వచ్చాయి. అధికారంలోకి వస్తూనే చదలవాడకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.
ఆగస్టు నెలలో టీటీడీ పాలకమండలిని టీడీపీ సర్కారు రద్దు చేసింది. పాత పాలక మండలి గడువుకు 11 రోజులకు ముందే ఈ నిర్ణయం తీసుకుంది. పాలక మండలిని రద్దు నెలన్నర కావొస్తున్నా ఇంతవరకు నూతన పాలక మండలిని నియమించలేదు. ఈ నేపథ్యంలో హీరో శివాజీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఉద్దేశం లేదన్న శివాజీ- టీటీడీ చైర్మన్ పదవిలో కూర్చొవాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. అయితే బీజేపీ అతడికి హామీయిచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అతడికి ఈ పదవి దక్కుతుందో, లేదో చూడాలి.