ప్రిన్స్‌ మహేష్‌తో కలిసి సినిమా చేస్తా.. | Hero Sudheer Babu In Arasavilli | Sakshi
Sakshi News home page

ప్రిన్స్‌ మహేష్‌తో కలిసి సినిమా చేస్తా..

Published Mon, Aug 27 2018 1:35 PM | Last Updated on Sun, Sep 2 2018 4:56 PM

Hero Sudheer Babu In Arasavilli - Sakshi

సుధీర్‌బాబుకు రాఖీ కడుతున్న బాలిక

అరసవల్లి శ్రీకాకుళం : ‘మా బావ ప్రిన్స్‌ మహేష్‌బాబుతో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే అదృష్టం కోసం ఎప్పటి నుంచో వేచిచూస్తున్నాను. త్వరలోనే మంచి కథతో ఆయనతో కలిసి సినిమా చేస్తా..’’ అని వర్ధమాన సినీ హీరో పోసాని సుధీర్‌బాబు అన్నారు. ‘నన్ను దోచుకుందువటే..’ చిత్ర యూనిట్‌ సభ్యులతో కలిసి ఆయన ఆదివారం ఉదయం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి దర్శనానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారి ఆశీర్వచనాన్ని అందజేశారు. అనంతరం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.  

సాక్షి : ఆదిత్యుని దర్శనంపై మీ అనుభూతి...!    
సుధీర్‌బాబు: దేశంలోనే ఖ్యాతి గల అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవాలని ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్నాను.. ఇప్పటికి స్వామి దయ కలిగింది. 

సాక్షి : ఇంతవరకు సినీ ప్రస్థానం ఎలా ఉంది?    
సుధీర్‌బాబు: ప్రస్థానం అంటే పెద్ద మాట. ఇప్పటి వరకు నేను కేవలం 8 సినిమాలే చేశాను. కానీ సూపర్‌ స్టార్‌ కృష్ణ అల్లుడిగా, ప్రిన్స్‌ మహేష్‌బాబు బావగా ప్రత్యేకత ఉండడం కూడా ప్రస్తుత ఇమేజ్‌కు కారణమని భావిస్తున్నాను. నాకంటూ గుర్తింపు తెచ్చుకునేలా మంచి కథలనే ఎంచుకుని సినిమాలను చేయడానికి కృషి చేస్తున్నాను. చిన్న సినిమాలైనా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

సాక్షి : డ్రీమ్‌ రోల్‌ ఏదైనా..!    
సుధీర్‌బాబు : డ్రీం అని ఏమీ లేదు. కానీ నాకు ఎంతో ఇష్టమైన బ్యాడ్మింటన్‌ గేమ్‌ బ్యాక్‌డ్రాప్‌గా సినిమా చేయాలని అనుకున్నాను. ఊహించని విధంగా జాతీయ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌ బయోపిక్‌లో నటించే అవకాశం నాకు వచ్చింది. 

సాక్షి : మీరు కూడా చాంపియన్‌ కదా... 
సుధీర్‌బాబు :  నిజమే..బ్యాడ్మింటన్‌ జూనిర్‌ వరల్డ్‌ కప్‌ చాంపియన్‌షిప్‌కు ప్రోపబుల్స్‌లో చోటుదక్కింది. పూర్వపు చాంపియన్‌ ప్రకాష్‌ పదుకొనే వద్ద శిక్షణ తీసుకున్నాను. ఇదే తరుణంలో ఒక గేమ్‌లో డబుల్స్‌లో పార్టనర్‌గా గోపిచంద్‌తో కలిసి ఆడాను కూడా.. సినిమాల్లో బిజీ అయ్యాక రూటు మారింది.  నా కుమారుడు ఛరిత్‌ను మాత్రం బ్యాడ్మింటన్‌లో మంచి క్రీడాకారునిగా తయారుచేయాలనేది నా కోరిక.

సాక్షి : ఛరిత్‌ బాలనటుడిగా అరంగ్రేటంపై ఎలా ఫీలవుతున్నారు..?   
సుధీర్‌బాబు : నిజంగా సంతోషంగా ఉంది.  భలేభలే మగాడివోయ్‌లో చిన్నతనంలో నాని, విన్నర్‌లో చిన్నప్పుడు సాయిధరమ్‌తేజ్‌ పాత్రలో నటించాడు. మహేష్‌బాబు కూడా బాల నటుడిగా ఎదిగి ఈ రోజు స్టార్‌ అయ్యాడు. ఆయన కుమారుడు గౌతమ్‌ కూడా బాల నటుడిగా ఆరంగ్రేటం చేసేశాడు. 

సాక్షి : ఇక మీ సినిమాల సంగతేంటి..?        
సుధీర్‌బాబు: ‘శివ మనసులో శృతి’ (ఎస్‌ఎంఎస్‌) చిత్రంతో హీరోగా పరిచయమయ్యాను.‘ ప్రేమ కథా చిత్రమ్‌’ చిత్రంతోనే మంచి గుర్తింపు వచ్చింది.  ఇటీవల సమ్మోహనం భారీ హిట్‌ అయ్యింది. మంచి కథలతో, చిన్న బడ్జెట్‌తో మంచి విజయాలు సాధించవచ్చునని నిరూపించిన చిత్రాలివి.  త్వరలోనే ‘నన్ను దోచుకుందువటే..’ సినిమా రిలీజ్‌ కానుంది. విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. 

సాక్షి : శ్రీకాకుళంలో ఘట్టమనేని ఫ్యాన్స్‌ మీ పేరిట సేవాకార్యక్రమాలను చేపడుతున్నారు. దీనిపై మీ స్పందన?
సుధీర్‌బాబు: నిజంగా మంచి ఫ్యాన్స్‌ నాకు ఉండటం నా అదృష్టం. సేవా కార్యక్రమాలే సామాజికంగా మనకు స్థానం కల్పిస్తాయి.  శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్‌ జిల్లాలోనే నా సినిమాలు బాగా ఆడుతాయి. ఇక్కడి ప్రేక్షకులకు నిజంగా రుణపడిఉన్నాం.

అభిమానం పేరుతో డబ్బులు వృథా చేయవద్దు, ఫ్యాన్స్‌తో సుధీర్‌బాబు
అభిమానం పేరుతో డబ్బులు వృథాగా ఖర్చు పెట్టవద్దని సినీ నటుడు సుధీర్‌బాబు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరానికి వచ్చిన ఆయన స్థానిక హోటల్లో  ఫ్యాన్స్‌తో మాట్లాడారు. తన పుట్టినరోజు నాడు ఇచ్చిన మాట ప్రకారం శ్రీకాకుళం నగరానికి వచ్చినట్లు తెలిపారు.శ్రీకాకుళం ప్రేక్షకులు కథతో కూడిన చిత్రాలను ఆదరించడం అభినందనీయమన్నారు. త్వరలో రానున్న తన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’ను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. అనంతరం మహేష్‌బాబు సేవాసమితి అధ్యక్షుడు ఉంకిలి శ్రీనువాసరావు కుమార్తె ఉంకిలి ప్రవళికా      సుధీర్‌బాబుకు రాఖీ కట్టింది. కార్యక్రమంలో పలువురు అభిమానులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement