
వ్యభిచారం కేసులో పోలీసులకు పట్టుబడిన మహిళ, విటుడు(ఫైల్)
రాజమహేంద్రవరం క్రైం: అర్బన్ జిల్లా పరిధిలో హైటెక్ వ్యభిచారం జోరుగా సాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను నగరానికి తీసుకు వచ్చి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఉన్నత శ్రేణి వర్గాలకు చెందిన యువకులు, వ్యాపారులకు వలలు వేసి ఆన్‌లైన్, వాట్సప్‌ల ద్వారా అమ్మాయిల చిత్రాలు చూపించి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారం అంతా ఫోన్‌ల ద్వారా సాగుతుండడంతో పోలీసులు రైడింగ్‌కు వచ్చే సరికి మొత్తం వ్యవహారం ముగుస్తుంది.
నగరంలో కొన్ని ఖరీదైన హోటళ్లలో, శివారు ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకొని ఈ వ్యవహారం సాగిస్తున్నారు. ఈ ముఠాలు సంపన్న వర్గాల వ్యక్తులను ఫోన్ ద్వారా కంట్రాక్ట్ చేస్తారు. ఏదో ఒక రాష్ట్రం నుంచి అమ్మాయిలు వచ్చారని, వారి చిత్రాలను ఫోన్ ద్వారా పంపిస్తారు. డీల్ కుదిరితే ఒక గంటలో తాము చెప్పిన ప్రాంతానికి రావాలని చూసిస్తారు. గుట్టుచప్పుడు కాకుండా ఆ ప్రాంతానికి చేరుకొని నిర్ణీత సమయంలో వ్యవహారం ముగించుకొని బయటపడుతున్నారు. కొన్ని సమయాల్లో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించినా.. వారు వచ్చేసరికి మొత్తం సీను మారిపోతుంది. పోలీసులు వచ్చినా ఆ ప్రాంతంలో ఏవిధమైన ఆధారాలు లేకుండా చేస్తున్నారు. దీంతో పోలీసులకు చిక్కకుండా వ్యభిచార ముఠాలు వ్యవహారం నడిపిస్తున్నాయి.
ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలు
రాజమహేంద్రవరానికి ఎయిర్ పోర్టు సౌకర్యం ఉండడంతో విమానం ద్వారా ముంబయి, ఢిల్లీ, కోల్‌కత్తా, ఈశాన్య రాష్ట్రాలు, గోవా తదితర ప్రాంతాల నుంచి నగరానికి అమ్మాయిలను తీసుకు వస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అమ్మాయిలకు నెలకు, 15 రోజులకు వారం రోజులకు కొంత సొమ్ము చెల్లిస్తామని చెప్పి మాట్లాడుకొని ఇక్కడికి తీసుకువస్తున్నారు. నిర్ణీత సమయం వరకూ శివారు ప్రాంతాలలో అద్దె ఇళ్లలో ఉంచి రాత్రి సమయాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. కొన్ని సందర్భాలలో అమ్మాయిలకు చెల్లిస్తామని చెప్పిన సొమ్ములు మొత్తం కూడా ఎగ్గొట్టిన సందర్భాలున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన అమ్మాయిలు విషయం బయటకు చెప్పలేకపోతున్నారు. ఈ హైటెక్ వ్యభిచారం కొందరి రాజకీయ నాయకుల ప్రమేయంతోనే నడుస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా శివారు ప్రాంతాల్లో పోలీసులు దృష్టి సారించి నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment