ఓవైపు సమైక్య సభ.. మరోవైపు ‘టి’ బంద్
ఒకవైపు ‘సమైక్య’ సభ... మరోవైపు ‘విభజన’ బంద్... రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో శనివారం ఏం జరుగుతుందోనని సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏపీఎన్‌జీవోలు తలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ జరగటానికి ముందు రోజు శుక్రవారం.. సీమాంధ్ర, తెలంగాణవాద న్యాయవాదుల మధ్య ఘర్షణతో రాష్ట్ర హైకోర్టు రణరంగంగా మారటంతో.. టెన్షన్ తారస్థాయికి చేరింది. రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా సీమాంధ్ర న్యాయవాదులు మానవహారం చేపట్టగా.. శాంతిర్యాలీకి అనుమతి నిరాకరించటానికి నిరసనగా తెలంగాణ న్యాయవాదులు చలో హైకోర్టు కార్యక్రమం చేపట్టటం సీమాంధ్ర న్యాయవాదులు, తెలంగాణ న్యాయవాదుల మధ్య ఘర్షణకు దారితీసింది.
ఈ ఘటనలో పలువురు సీమాంధ్ర న్యాయవాదులు గాయాలపాలయ్యారు. శనివారం ఎల్‌బీ స్టేడియంలో ఏపీఎన్‌జీవోల సభ జరగనుండటం.. అదే రోజు తెలంగాణ జేఏసీ హైదరాబాద్ సహా తెలంగాణ బంద్ పాటిస్తుండటంతో.. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసుశాఖ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానున్న ఏపీఎన్‌జీవోల సభను సాయంత్రం ఐదు గంటలకల్లా ముగించాలని స్పష్టంచేసింది. స్టేడియాన్ని పారా మిలటరీ బలగాలు అధీనంలోకి తీసుకోగా.. అక్కడికి రెండు కిలోమీటర్ల పరిధిలో పెద్ద ఎత్తున బారికేడ్లు, ముళ్లకంచెలతో నాలుగంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉద్యోగులను మాత్రమే వారి గుర్తింపు కార్డులను తనిఖీచేసి స్టేడియంలోకి అనుమతించనున్నారు. సమైక్య సభను వ్యతిరేకిస్తున్న తెలంగాణవాద సంఘాలు కొన్ని.. సీమాంధ్రులపై దాడులు చేసైనా సభను అడ్డుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో.. విజయవాడ, కర్నూలు, మహబూబ్‌నగర్ వైపు నుంచి హైదరాబాద్ వచ్చే జాతీయ రహదారుల్లో గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమైన కూడళ్లలో పోలీస్ పికెట్‌లు, రహదారులపై మొబైల్ పార్టీలతో నిరంతర పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్లలో కూడా బందోబస్తు పటిష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ప్రాంత ఉద్యోగులతో బయలుదేరిన బస్సుపై శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడిచేశారు. ఏపీఎన్‌జీవోల సభకు సీమాంధ్ర నుంచి ఉద్యోగులు భారీగా తరలివస్తున్నారు. రైలు, రోడ్డు మార్గాల్లో వేల సంఖ్యలో ప్రయాణమయ్యారు. సీమాంధ్ర నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ వచ్చే అన్ని రైళ్లూ శుక్రవారం ఆ ప్రాంత ఉద్యోగులతో నిండిపోయాయి.