APNGO Meeting
-
కలిసుండడం ఎలా సాధ్యం?
కరీంనగర్, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రజలపై దాడులు చేస్తూనే సమైక్యంగా ఉందామంటున్నారని, ఇది ఎలా సాధ్యమవుతుందని భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి అన్నారు. కరీంనగర్లో సహచర మంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలసి ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘జై తెలంగాణ’ అంటూ నినదించిన పోలీస్ కానిస్టేబుల్‌పైన, విద్యార్థులపైన సీమాంధ్ర నేతల, ప్రజలు దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. వందలమంది ఒక్కరినే కిందపడేసి దారుణంగా దాడి చేయడం అమానుషమన్నారు. తెలంగాణ ప్రజలు శాంతియుతంగా ఉండడం వల్లనే హైదరాబాద్‌లో నిర్వహించిన సమైక్యాంధ్ర సభ విజయవంతం అయిందన్నారు. దీన్ని సాకుగా చూపి మిలియన్ మార్చ్ పేరుతో మరో సభ పెట్టాలనుకోవడం తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడమే అవుతుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేస్తామని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ఇచ్చిన మాటకు తిరుగులేదని, ఎవరెన్ని కుట్రలు చేసినా హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పాటు కావడం ఖాయమన్నారు. -
పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు
-
ఓవైపు సమైక్య సభ.. మరోవైపు ‘టి’ బంద్
-
హైదరాబాద్‌కు భారీగా తరలిన ఉద్యోగులు
-
హైదరాబాద్‌కు భారీగా తరలిన ఉద్యోగులు
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : ఏపీ ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహించనున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు జిల్లా నుంచి సమైక్యాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఎన్జీవోలు సుమారు 3 వేల మంది, ఇతర ఉద్యోగులు సుమారు 2 వేల మంది హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం. సభలో పాల్గొనేందుకు ఒక్క ఒంగోలు నుంచే 2 వేల మందికిపైగా ఉద్యోగులు బస్సులు, కార్లు, సుమోల్లో వెళ్లారు. కందుకూరు, మార్కాపురం, చీరాల, అద్దంకి, కనిగిరి, గిద్దలూరు, పొదిలి తదితర ప్రాంతాల నుంచి కూడా ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కూడా వెళ్లారు. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు కేశవరపు జాలిరెడ్డి వాహనాలు ఏర్పాటు చేశారు. సగం విజయం సాధించాం : బషీర్ హైదరాబాద్‌లో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడం ద్వారానే తాము అనుకున్న కార్యంలో సగం విజయం సాధించినట్లయిందని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ షేక్ అబ్దుల్ బషీర్ అన్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను అడ్డుకునేందుకు తెలంగాణ వాదులు చేసిన కుట్రలు పటాపంచలయ్యాయన్నారు. సభ నిర్వహించుకునేందుకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వటం దురదృష్టకరమన్నారు.రాష్ట్ర రాజ ధానిలో తమ భావాలను స్వేచ్ఛగా చెప్పుకునేందుకు కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించటాన్ని ఆయన తప్పుపట్టారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు సీమాంధ్ర జిల్లాల నుంచి వచ్చే ఉద్యోగులపై భౌతికదాడులకు పూనుకుంటామని, సభను అడ్డుకుంటామని, పెట్రోలు పోసి తగలబెడతామంటూ తెలంగాణ వాదులు చేస్తున్న బెదిరింపులకు బెదిరేది లేదని బషీర్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానిలో సభ నిర్వహించి తమ సత్తా చాటుతామన్నారు. -
ఓవైపు సమైక్య సభ.. మరోవైపు ‘టి’ బంద్
ఒకవైపు ‘సమైక్య’ సభ... మరోవైపు ‘విభజన’ బంద్... రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో శనివారం ఏం జరుగుతుందోనని సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏపీఎన్జీవోలు తలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ జరగటానికి ముందు రోజు శుక్రవారం.. సీమాంధ్ర, తెలంగాణవాద న్యాయవాదుల మధ్య ఘర్షణతో రాష్ట్ర హైకోర్టు రణరంగంగా మారటంతో.. టెన్షన్ తారస్థాయికి చేరింది. రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా సీమాంధ్ర న్యాయవాదులు మానవహారం చేపట్టగా.. శాంతిర్యాలీకి అనుమతి నిరాకరించటానికి నిరసనగా తెలంగాణ న్యాయవాదులు చలో హైకోర్టు కార్యక్రమం చేపట్టటం సీమాంధ్ర న్యాయవాదులు, తెలంగాణ న్యాయవాదుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో పలువురు సీమాంధ్ర న్యాయవాదులు గాయాలపాలయ్యారు. శనివారం ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోల సభ జరగనుండటం.. అదే రోజు తెలంగాణ జేఏసీ హైదరాబాద్ సహా తెలంగాణ బంద్ పాటిస్తుండటంతో.. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసుశాఖ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానున్న ఏపీఎన్జీవోల సభను సాయంత్రం ఐదు గంటలకల్లా ముగించాలని స్పష్టంచేసింది. స్టేడియాన్ని పారా మిలటరీ బలగాలు అధీనంలోకి తీసుకోగా.. అక్కడికి రెండు కిలోమీటర్ల పరిధిలో పెద్ద ఎత్తున బారికేడ్లు, ముళ్లకంచెలతో నాలుగంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యోగులను మాత్రమే వారి గుర్తింపు కార్డులను తనిఖీచేసి స్టేడియంలోకి అనుమతించనున్నారు. సమైక్య సభను వ్యతిరేకిస్తున్న తెలంగాణవాద సంఘాలు కొన్ని.. సీమాంధ్రులపై దాడులు చేసైనా సభను అడ్డుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో.. విజయవాడ, కర్నూలు, మహబూబ్‌నగర్ వైపు నుంచి హైదరాబాద్ వచ్చే జాతీయ రహదారుల్లో గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమైన కూడళ్లలో పోలీస్ పికెట్లు, రహదారులపై మొబైల్ పార్టీలతో నిరంతర పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్లలో కూడా బందోబస్తు పటిష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ప్రాంత ఉద్యోగులతో బయలుదేరిన బస్సుపై శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడిచేశారు. ఏపీఎన్జీవోల సభకు సీమాంధ్ర నుంచి ఉద్యోగులు భారీగా తరలివస్తున్నారు. రైలు, రోడ్డు మార్గాల్లో వేల సంఖ్యలో ప్రయాణమయ్యారు. సీమాంధ్ర నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ వచ్చే అన్ని రైళ్లూ శుక్రవారం ఆ ప్రాంత ఉద్యోగులతో నిండిపోయాయి. -
ఏం జరిగినా ఏపీఎన్జీవోల సభా నిర్వాహకులదే బాధ్యత: అనురాగ్‌శర్మ
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోలు సభ నిర్వహించుకోవటానికి అనేక కోణాల్లో పరిశీలించిన మీదటే 19 షరతులతో అనుమతిచ్చామని.. సభ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా నిర్వాహకులదే బాధ్యతని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ స్పష్టం చేశారు. మిగిలినవారు తమ ర్యాలీ తేదీ మార్చుకుంటే పరిశీలించి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఏపీఎన్జీవో సభకు అనుమతి ఇవ్వటం వెనుక ముఖ్యమంత్రి, ఉన్నతాధికారుల ప్రమేయం ఉందన్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. ఎవరికైనా ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఆవేదన, నిరసన వ్యక్తం చేయటానికి హక్కు ఉందని, రాజధానిలో వారి గళం వినిపిస్తామంటే అంగీకరించాలని సీపీ పేర్కొన్నారు. అనురాగ్‌శర్మ గురువారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎల్బీ స్టేడియంలో ఈ నెల 7న సభ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి కోరుతూ ఏపీఎన్జీవోలు గత నెల 28న దరఖాస్తు చేసుకున్నారని, మధ్య మండల డీసీపీ అనేక కోణాల్లో పరిశీలించిన తర్వాతే అనుమతి ఇచ్చారని చెప్పారు. ‘ఇప్పుడు మరికొంత మంది శనివారమే వేర్వేరు కార్యక్రమాల నిర్వహణకు అనుమతి కోరుతూ దరఖాస్తులు ఇచ్చారు. కానీ శాంతిభద్రతలను పరిగణనలోకి తీసుకుని, తొలుత దరఖాస్తు చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యం లెక్కన ఏపీఎన్జీవోలకు అనుమతి ఇచ్చాం’ అని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నగరంలో ఎటువంటి ర్యాలీలకూ అనుమతి ఇవ్వట్లేదని సీపీ తెలిపారు. ఏపీఎన్జీవోలకు కూడా సభ నిర్వహణకే 19 షరతులతో అనుమతిచ్చామని స్పష్టంచేశారు. ‘ఈ సభను అడ్డుకుంటామని, జరగనివ్వబోమని అనేక ప్రకటనలు వెలుడుతున్నాయి. వారిని మీడియా ద్వారా కోరేది ఒక్కటే... ఎవ్వరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు’ అని ఆయన పేర్కొన్నారు. ఇతరులు ఏవైనా కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే 8వ తేదీ తర్వాత ఎప్పుడైనా, ఎక్కడైనా అనుమతి కోరవచ్చని.. పరిశీలించి అనుమతిస్తామని చెప్పారు. ‘ఈ నెల 6న ఎల్బీ స్టేడియంలో సభకు అనుమతించాలంటూ మంద కృష్ణ గత నెల 31న దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ తర్వాతి రోజు ఏపీఎన్జీవోల సభ అంటే ముందు రోజునే అనేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 6న సభకు అనుమతి ఇవ్వలేదు. తేదీ మార్చుకుంటే మాకు అభ్యంతరం లేదు’ అని సీపీ పేర్కొన్నారు. ఏపీఎన్జీవోల సభకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ‘ఇప్పటికే నగర పోలీసులతో పాటు 11 కంపెనీల పారా మిలటరీ బలగాలు, 45 ప్లటూన్ల ఏపీఎస్పీ, ఏఆర్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఏదైనా పరిణా మం జరిగితే దాని తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయా సినిమా ప్రదర్శనలకూ పటిష్ట బందోబస్తు కల్పిస్తామన్నారు. కొన్ని సభలకు ముందు, మరికొన్ని సభలకు ఆలస్యంగా అనుమతి ఇచ్చామనటం సరికాదన్న సీపీ గతంలో జరిగిన కార్యక్రమాలు, అనుమతిచ్చిన తేదీల్ని వెల్లడించారు. -
సెప్టెంబర్ 7 తేదిన ఏపీఎన్జీవోల సభకు పోలీసుల అనుమతి!
హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు తలపెట్టిన సభకు పోలీసుల అనుమతి లభించింది. ఏపీఎన్జీవోల సభకు షరతులతో కూడిన అనుమతిని సీపీ అనురాగ్ శర్మ ఇచ్చారు. ఎల్బీస్టేడియంలో సెప్టెంబర్ 7న ఏపీఎన్జీవోలు సమావేశం నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఏడవ తేది మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకే సభ నిర్వహించాలని పోలీసులు సూచించారు. సభకు వచ్చే ఉద్యోగులంతా ఐడీ కార్డులు తప్పనిసరిగా తీసుకురావాలి అని పోలీసులు తెలిపారు. కొన్ని పరిస్థితులు, భద్రతా కారణాల దృష్ట్యా ఇతరులకు అనుమతి లేదు అని పోలీసులు స్పష్టం చేశారు.