ఏం జరిగినా ఏపీఎన్జీవోల సభా నిర్వాహకులదే బాధ్యత: అనురాగ్‌శర్మ
ఏం జరిగినా ఏపీఎన్జీవోల సభా నిర్వాహకులదే బాధ్యత: అనురాగ్‌శర్మ
Published Fri, Sep 6 2013 3:11 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో ఏపీఎన్జీవోలు సభ నిర్వహించుకోవటానికి అనేక కోణాల్లో పరిశీలించిన మీదటే 19 షరతులతో అనుమతిచ్చామని.. సభ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా నిర్వాహకులదే బాధ్యతని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ స్పష్టం చేశారు. మిగిలినవారు తమ ర్యాలీ తేదీ మార్చుకుంటే పరిశీలించి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఏపీఎన్జీవో సభకు అనుమతి ఇవ్వటం వెనుక ముఖ్యమంత్రి, ఉన్నతాధికారుల ప్రమేయం ఉందన్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు.
ఎవరికైనా ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఆవేదన, నిరసన వ్యక్తం చేయటానికి హక్కు ఉందని, రాజధానిలో వారి గళం వినిపిస్తామంటే అంగీకరించాలని సీపీ పేర్కొన్నారు. అనురాగ్‌శర్మ గురువారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎల్‌బీ స్టేడియంలో ఈ నెల 7న సభ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి కోరుతూ ఏపీఎన్జీవోలు గత నెల 28న దరఖాస్తు చేసుకున్నారని, మధ్య మండల డీసీపీ అనేక కోణాల్లో పరిశీలించిన తర్వాతే అనుమతి ఇచ్చారని చెప్పారు. ‘ఇప్పుడు మరికొంత మంది శనివారమే వేర్వేరు కార్యక్రమాల నిర్వహణకు అనుమతి కోరుతూ దరఖాస్తులు ఇచ్చారు. కానీ శాంతిభద్రతలను పరిగణనలోకి తీసుకుని, తొలుత దరఖాస్తు చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యం లెక్కన ఏపీఎన్జీవోలకు అనుమతి ఇచ్చాం’ అని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నగరంలో ఎటువంటి ర్యాలీలకూ అనుమతి ఇవ్వట్లేదని సీపీ తెలిపారు.
ఏపీఎన్జీవోలకు కూడా సభ నిర్వహణకే 19 షరతులతో అనుమతిచ్చామని స్పష్టంచేశారు. ‘ఈ సభను అడ్డుకుంటామని, జరగనివ్వబోమని అనేక ప్రకటనలు వెలుడుతున్నాయి. వారిని మీడియా ద్వారా కోరేది ఒక్కటే... ఎవ్వరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు’ అని ఆయన పేర్కొన్నారు. ఇతరులు ఏవైనా కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే 8వ తేదీ తర్వాత ఎప్పుడైనా, ఎక్కడైనా అనుమతి కోరవచ్చని.. పరిశీలించి అనుమతిస్తామని చెప్పారు. ‘ఈ నెల 6న ఎల్‌బీ స్టేడియంలో సభకు అనుమతించాలంటూ మంద కృష్ణ గత నెల 31న దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ తర్వాతి రోజు ఏపీఎన్జీవోల సభ అంటే ముందు రోజునే అనేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 6న సభకు అనుమతి ఇవ్వలేదు. తేదీ మార్చుకుంటే మాకు అభ్యంతరం లేదు’ అని సీపీ పేర్కొన్నారు. ఏపీఎన్జీవోల సభకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ‘ఇప్పటికే నగర పోలీసులతో పాటు 11 కంపెనీల పారా మిలటరీ బలగాలు, 45 ప్లటూన్ల ఏపీఎస్‌పీ, ఏఆర్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఏదైనా పరిణా మం జరిగితే దాని తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయా సినిమా ప్రదర్శనలకూ పటిష్ట బందోబస్తు కల్పిస్తామన్నారు. కొన్ని సభలకు ముందు, మరికొన్ని సభలకు ఆలస్యంగా అనుమతి ఇచ్చామనటం సరికాదన్న సీపీ గతంలో జరిగిన కార్యక్రమాలు, అనుమతిచ్చిన తేదీల్ని వెల్లడించారు.
Advertisement
Advertisement