తప్పంతా అధిష్టానానిదే: మంత్రి టీజీ
కర్నూలు: ‘రాష్ట్ర విభజన విషయంలో మాకెలాంటి సంబంధం లేదు. తప్పంతా అధిష్టానానిదే. రాష్ర్టం విడిపోకుండా ఉండేందుకు నేను ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతున్నాను. కొంత మంది పుడింగులకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. వచ్చి మాపై రాళ్లు వేస్తున్నారు. అలాంటి వారి మూతులు పగలగొట్టండి’ అని రాష్ట్ర చిన్ననీటి పారుదలశాఖ మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు.
కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) సమావేశంలో పాల్గొన్న మంత్రి అధికారిక కార్యక్ర మాన్ని రాజకీయ వేదికగా మార్చారు. సమైక్యవాదులపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు వారిపైకి మహిళలను ఉసిగొల్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా గతంలో తాగొచ్చిన భర్తను కొట్టొచ్చిన భార్యలకు రూ.10వేలు బహుమతి ఇస్తామని ప్రకటించానని, అయితే ఎవ్వరూ అలాంటి పనిచేయలేదెందుకని ప్రశ్నించారు. ‘మీ మొగుళ్లేమైనా బంగారమా.. ఎవ్వరూ తాగి రావటం లేదా?’ అని వ్యంగ్యంగా మహిళలను ప్రశ్నించారు.