ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు
హైదరాబాద్: సదావర్తి భూముల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. సదావర్తి భూములకు గతంలో నిర్వహించిన వేలం చెల్లదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మళ్లీ వేలం నిర్వహించాలని, 6 వారాల్లో వేలం ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) చెల్లించిన రూ.27.44 కోట్లను బేస్ ప్రైస్‌గా నిర్ణయించి వేలం నిర్వహించాలని సూచించింది. వేలంలో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాకపోతే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి సదావర్తి భూములు చెందుతాయని హైకోర్టు తేల్చిచెప్పింది.
ఎంతో విలువైన సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీడీపీ నేతలకు కేవలం రూ.22 కోట్లకు ధారాదత్తం చేసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసి ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టులో విజయం సాధించారు. రూ. 22 కోట్లకు అదనంగా మరో రూ.5 కోట్లు ఇస్తే మీకే భూములు ఇస్తామని హైకోర్టు అనడంతో రెండు విడతల్లో పూర్తిస్థాయి నగదు రూ.27.44 కోట్లను దేవాదాయశాఖ ఖాతాకు ఆయన జమచేశారు. చెప్పిన మాట ప్రకారం ఆయన డబ్బులు చెల్లించడంతో చంద్రబాబు సర్కారు ఇరకాటంలో పడింది. తాము అమ్మిన ధర కంటే ఎక్కువ డబ్బులు రావని ఇప్పటివరకు ప్రచారం చేసుకుంటూ వచ్చిన అధికార పార్టీ నాయకులు హైకోర్టు ఆదేశాలతో మూగనోము పట్టారు.