సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు రాజీనామా చేసినా... ద్రవిడ, ఎస్కేయూ వీసీలు మాత్రం ఆ పదవుల్లో కొనసాగుతుండడంపై హైకోర్టు వారి వివరణ కోరుతూ నోటీసులు జారీచేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసిం ది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమ వారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను నియమించే విషయంలో ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలను రద్దు చేసి, యూజీసీ నిబంధనల మేర తాజాగా సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన ప్రొఫెసర్ పి.మునిరత్నంరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేశామని చెప్పారు. తర్వాత పిటిషనర్ తరఫు న్యాయవాది ఉగ్రనరసింహ వాదనలు వినిపిస్తూ, పలు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేసినా, ద్రవిడ, శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయాల వీసీలు మాత్రం ఆ పదవుల్లో కొనసాగుతున్నారని, అందువల్ల వారిని ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చామన్నారు. దీంతో ధర్మాసనం ఆ ఇద్దరు వీసీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment