పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు చేయండి | High Court Order Case Filed Against Paritala Sriram | Sakshi
Sakshi News home page

పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు చేయండి

Published Thu, Sep 6 2018 9:02 AM | Last Updated on Thu, Sep 6 2018 9:06 AM

High Court Order Case Filed Against Paritala Sriram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త బోయ లెక్కన్నగారి నారాయణపై దాడి చేసి గాయపరిచిన రాష్ట్ర మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తూ వస్తున్న అనంతపురం పోలీసులకు హైకోర్టు ఝలక్‌ ఇచ్చింది. శ్రీరామ్‌పై కేసు నమోదు చేసి నిష్ఫక్షపాతంగా దర్యాప్తు చేయాలని హైకోర్టు బుధవారం అనంతపురం పోలీసులను ఆదేశించింది. లలితకుమారి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఈ ఏడాది ఫిబ్రవరి 7న రామగిరి మండలం, నసనకోట గ్రామానికి వచ్చారు. అక్కడి నుంచి పార్టీ కార్యకర్త బోయ లెక్కన్నగారి నారాయణ తదితరులు కలిపి పేరూరు వెళ్లి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమాలు అయిపోయిన తరువాత నారాయణ తన గ్రామానికి తిరిగి వచ్చారు. గ్రామంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంలో నారాయణ చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు తెలుసుకున్న పరిటాల శ్రీరాం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యర్రప్ప, మాదాపురం శంకర్, కె.పరందామ యాదవ్‌ తదితరులు అతనిపై దాడికి దిగారు. నారాయణ ఇంటికి వెళ్లి అతనిపై మారణాయుధాలతో దాడి చేసి అతన్ని జీపులో వేసుకుని వెంకటాపురానికి తీసుకెళ్లారు. అక్కడ పరిటాల శ్రీరాం తదితరులు నారాయణను తీవ్రంగా కొట్టడంతో అతని భుజం ఎముకలు విరిగాయి. అక్కడి నుంచి రామగిరి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి నారాయణ నుంచి బలవంతరంగా తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారు.

అనంతరం ధర్మవరం పోలీస్‌స్టేషన్‌కు, ఆ తరువాత కర్ణాటకలోని తూముకూర్‌కు తీసుకెళ్లి తరువాత తెచ్చి గ్రామంలో విడిచిపెట్టారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు చంద్రశేఖర్‌రెడ్డి మరికొందరిపై రామగిరి పోలీస్‌ స్టేషన్‌లో దాడి, కిడ్నాప్‌ కేసు నమోదు అయింది. వాస్తవానికి నారాయణ నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్న పరిటాల శ్రీరాం తదితరులే వైఎస్సార్‌సీపీ నేతలపై నారాయణ పేరుతో ఫిర్యాదు ఇచ్చారు. ఇది తెలుసుకున్న నారాయణ రామగిరి పోలీసుల చర్యలను తప్పుబడుతూ పరిటాల శ్రీరాం తదితరులు వ్యవహరించిన తీరును వివరించారు. తాను ఎటువంటి ఫిర్యాదు చేయలేదని చెప్పినా పట్టించుకోకుండా వైఎస్సార్‌సీపీ నేతలు చంద్రశేఖర్‌రెడ్డి తదితరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

నారాయణ ఫిర్యాదులను పట్టించుకోని పోలీసులు
తనపై దాడి చేశారని పరిటాల శ్రీరాం, ఇతర టీడీపీ నేతలపై నారాయణ లిఖితపూర్వకంగా చేసిన ఫిర్యాదును పోలీసులు నిరాకరించారు. దీంతో నారాయణ పోస్టు ద్వారా తన ఫిర్యాదును జిల్లా ఎస్‌పీకి పంపారు. అయినా శ్రీరాంపై కేసు నమోదు చేయలేదు. దీంతో నారాయణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదుదారు నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరిటాల శ్రీరాం తదితరులపై కేసు నమోదు చేసి నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని అనంతపురం పోలీసులను ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement