
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బోగస్ ఓటర్ల తొలగింపునకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు వెల్లడించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సోమవారం హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో ఇంతవరకూ ఏం పురోగతి సాధించారో తెలపాలని సూచిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల జాబితా నుంచి బోగస్ ఓటర్లను, అనర్హులను, డూప్లికేట్ ఓటర్లను తొలగించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంపై సోమవారం విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, 50 లక్షలకు పైగా బోగస్ ఓటర్లున్నారని, వాటన్నింటినీ తొలగిస్తేనే ఓటర్ల జాబితాకు స్వచ్ఛత లభిస్తుందన్నారు. ఓటర్ల జాబితా తయారీలో అనేక అవకతవకలు జరిగాయని కోర్టుకు వివరించారు. ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు నిరంతరం సాగే ప్రక్రియని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకునేంత వరకు జాబితాలో చేర్పులు, తొలగింపులకు ఆస్కారం ఉంటుందని వివరించారు. పిటిషనర్ లేవనెత్తిన బోగస్ ఓటర్ల తొలగింపు కూడా ఆ ప్రక్రియలో భాగంగా జరుగుతుందని తెలిపారు.