భారతీ సిమెంట్స్ దరఖాస్తును పరిగణనలోకి తీసుకోండి
♦ లీజుపై ఈ నెల 10లోపు నిర్ణయం తీసుకోండి
♦ కేంద్రం నోటిఫికేషన్‌కు అనుగుణంగా నిర్ణయం ఉండాలి
♦ ఏపీ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ జిల్లా, కమలాపురం మండలం, పందిళ్లపల్లి, తురకపల్లి, టి.చదిపిరాళ్ల, యర్రగుంట్ల మండలం, టి.సుంకేసుల, తిప్పలూరు గ్రామాల్లో సున్నపురాయి గనుల లీజు వ్యవహారంలో భారతీ సిమెంట్స్ పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు శుక్రవారం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారతీ సిమెంట్స్‌కు గతంలో జారీ చేసిన లెటర్ ఆఫ్ ఇండెంట్ (ఎల్‌ఓఐ) గడువు ఈ నెల 11తో ముగుస్తున్న నేపథ్యంలో లీజు కోసం ఆ సంస్థ పెట్టుకున్న దరఖాస్తుపై ఈ నెల 10లోపు నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.
గనులు, ఖనిజాభివృద్ధి చట్ట నిబంధనలు, ఈ నెల 4న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా నిర్ణయం ఉండాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మైనింగ్ లీజు నిర్ధారణకు సంబంధించి భారతీ సిమెంట్స్‌కు జారీ చేసిన నోటీసు విషయంలో ప్రభుత్వ హక్కులపై తాము వెలువరించిన ఈ ఉత్తర్వులు ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపబోవని ధర్మాసనం స్పష్టం చేసింది. కమలాపురం, యర్రగుంట్ల మండలాల పరిధిలోని గ్రామాల్లో సున్నపురాయి గనుల లీజు వ్యవహారంలో ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నాయంటూ భారతీ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఆ వ్యాజ్యంపై మరోసారి విచారణ జరిపింది. వాదనలు విన్న అనంతరం ఎల్‌ఓఐ గడువు ముగుస్తున్నందున ఈ నెల 10లోపు భారతీ సిమెంట్స్ దరఖాస్తుపై నిర్ణయం వెలువరించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.