bharathi cements
-
భారతి సిమెంట్స్‌కు కేంద్ర గనుల శాఖ అవార్డు
న్యూఢిల్లీ: దేశంలో ప్రముఖ సిమెంట్ తయారీ సంస్థ భారతి భారతి సిమెంట్స్‌కు కేంద్ర గనుల శాఖ నుంచి ప్రతిష్టాత్మక అవార్డ్ లభించింది. సస్టైనబుల్ మైనింగ్ విభాగంలో ఫైవ్ స్టార్ రేటింగ్ అవార్డును కంపెనీ సొంతం చేసుకుంది. భారతి సిమెంట్స్‌కు ఈ అవార్డు రావడం వరుసగా ఐదోసారి గమనార్హం.పర్యావరణహితమైన మైనింగ్ పద్ధతులు అవలంభించినందుకు, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫ్రేమ్ వర్క్ అమలులో అద్భుతమైన పనితీరు కనబరిచినందుకు గానూ కేంద్ర మైనింగ్ శాఖ ఈ అవార్డును ప్రకటించింది. కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా భారతి సిమెంట్ సీఈవో అనూప్ కుమార్ సక్సేనా, మైన్స్ హెడ్ సుధాకర్ రాజు, సీఎస్ఆర్ హెడ్ నితేష్వర్లు ఈ అవార్డు అందుకున్నారు.భారతి సిమెంట్స్ కు వరుసగా ఐదోసారి అవార్డు రావడం గొప్ప విషయమని భారతి సిమెంట్స్ సీఈవో అనూప్ కుమార్ సక్సేనా తెలిపారు. పర్యావరణహితమైన మైనింగ్ నిర్వహించినందుకు గాను ఈ అవార్డు లభించిందని, భారతి సిమెంట్ టీం, మైనింగ్ కార్మికులు అద్భుతంగా పనిచేయడం వల్లే ఈ గుర్తింపు సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 1256 మైన్లు ఉంటే 68 మాత్రమే అవార్డుకు ఎంపికయ్యాయని వివరించారు. -
గనుల శాఖకు ఘన పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: రాష్ట్ర గనుల శాఖ అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ప్రధాన ఖనిజాల అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యకలాపాల పర్యవేక్షణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గనులశాఖ పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను ప్రశంసిస్తూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. రానున్న రెండేళ్లకుగానూ రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కారం కింద రూ.2.40 కోట్లు ప్రోత్సాహకంగా ప్రకటించింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మంగళవారం ఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో మైన్స్ అండ్ మినరల్స్‌పై జరిగిన సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా మైనింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గనులు శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి అవార్డు అందుకున్నారు. రెండేళ్లుగా పారదర్శకంగా లీజులు.. దేశంలో ప్రధాన ఖనిజాల మైనింగ్‌పై ఉత్తమ విధానాలను అనుసరిస్తున్న రాష్ట్రాలకు కేంద్ర గనుల శాఖ ఏటా అవార్డులను ప్రదానం చేస్తోంది. రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కారం కింద ప్రోత్సాహకాలు అందిస్తోంది. గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది రకాల ప్రధాన ఖనిజాలకు సంబంధించి అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యక్రమాల పర్యవేక్షణలో పారదర్శకంగా వ్యవహరిస్తూ అత్యంత వేగంగా లీజులు జారీ చేస్తోంది. వేగంగా మైనింగ్ కార్యక్రమాలను చేపట్టేలా అత్యుత్తమ విధానాలను అనుసరిస్తోంది. దీనికి గుర్తింపుగా కేంద్రం అవార్డులను ప్రకటించింది. మైనింగ్ బ్లాకుల నిర్వహణను సమర్థంగా చేపట్టినందుకు అభినందిస్తూ 2022–23లో బాక్సైట్, ఐరన్ ఓర్ ఐదు కొత్త మినరల్స్ బ్లాక్‌లకు సంబంధించి జియోలాజికల్ నివేదికలను రాష్ట్రానికి కేంద్రం అందజేసింది. సీఎం తెచ్చిన సంస్కరణల ఫలితం.. మైనింగ్ రంగంలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఆనందదాయకమని గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు మైనింగ్ రంగంలో సృజనాత్మక పనులతోపాటు పలు సంస్కరణలు తెచ్చినట్లు వెల్లడించారు. కొత్త మినరల్ బ్లాకులకు సంబంధించి త్వరలోనే ఖనిజ అన్వేషణ, వేలం, మైనింగ్ ఆపరేషన్ ప్రక్రియలను పూర్తి చేస్తామని వీజీ వెంకటరెడ్డి తెలిపారు. మైనింగ్ రంగంలో సీఎం జగన్ తెచ్చిన సంస్కరణలు, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకత్వంతో జాతీయ స్థాయి గుర్తింపు సాధించామన్నారు. భారతి సిమెంట్స్‌కు ఫైవ్ స్టార్ రేటింగ్ నేషనల్ కాంక్లేవ్‌లో భారతి సిమెంట్స్‌కు కేంద్ర గనుల శాఖ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వడం పట్ల సంస్థ యాజమాన్యాన్ని ద్వివేది, వెంకటరెడ్డి అభినందించారు. వరుసగా మూడేళ్లు సస్టెయినబుల్ మేనేజ్మెంట్ విధానాలను అవలంబించిన భారతి సిమెంట్స్‌కు ఈ గౌరవం దక్కడం అభినందనీయమన్నారు. -
భారతి సిమెంట్స్ రూ.5 కోట్ల విరాళం
-
కన్నుల పండువగా ఇండియా అవార్డ్స్
సాక్షి, హైదరాబాద్ : ‘సాక్షి’ మీడియా గ్రూప్, భారతీ సిమెంట్స్ సౌజన్యంతో ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా అవార్డ్స్–2018 కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. శుక్రవారం సాయంత్రం కొండాపూర్‌లోని సైబర్ కన్వెన్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సంస్థలకు సంబంధించిన అడ్వరై్టజింగ్ ఏజెన్సీలు సృజనాత్మకంగా రూపొందించిన వాణిజ్య ప్రకటనలకు అవార్డులను ప్రదానం చేశారు. మొత్తం 23 విభాగాల్లో ఇండియా అవార్డ్స్‌ను ఇచ్చారు. తొలిసారిగా ఏపీ, తెలంగాణకు చెందిన పలు సంస్థల వాణిజ్య ప్రకటనలకు రీజినల్ ఇండియా అవార్డ్స్ ప్రదానం చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక ఇండియా అవార్డ్స్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడం విశేషమన్నారు. డిజిటల్ ఎంటర్టైన్మెంట్ సాంకేతికతకు నగరంలో ఉజ్వల భవిష్యత్ ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగాన్ని ఎంతో ప్రోత్సహిస్తోందన్నారు. మీడియా తప్పుడు వార్తల విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. అత్యున్నత ప్రమాణాలతో వాణిజ్య ప్రకటనల రంగం పురోగమించాలని ఆకాంక్షించారు. ఇండియా చాప్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్ నారాయణ్ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక అవార్డులను తేటతెలుగు భాషలో వాణిజ్య ప్రకటనలు జారీ చేసిన సంస్థలకు అందజేయడం శుభపరిణామమన్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వరై్టజింగ్ రంగాన్ని మరింత ప్రోత్సహించినట్లయిందని అభిప్రాయపడ్డారు. రీజినల్ ఇండియా అవార్డ్స్ విభాగం ప్రతినిధి శ్రీనివాసన్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ‘సాక్షి’మీడియా, భారతీ సిమెంట్స్ అందించిన ప్రోత్సాహం ఎనలేనిదని కొనియాడారు. ఇండియా అవార్డ్స్ జ్యూరీ సభ్యుడు శివకుమార్ మాట్లాడుతూ.. ఇండియా అవార్డ్స్–2018కి మొత్తం 23 విభాగాలలో వివిధ సంస్థలకు చెందిన 332 ఎంట్రీలు (వాణిజ్య ప్రకటనలు) టీవీ, వార్తాపత్రికలు, డిజిటల్ మీడియాకు సంబంధించినవి ఉన్నాయన్నారు. వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి సృజనాత్మకత, సమాచారం, వినియోగదారులను ప్రభావితం చేయడంతోపాటు ఆలోచింపజేసేలా ఉన్నవి, ఉత్తమ సందేశం ఇచ్చిన వాణిజ్య ప్రకటనలను అవార్డులకు ఎంపికచేసినట్లు తెలిపారు. ఈ అవార్డులను ఆయా కంపెనీలకు యాడ్స్ సిద్ధం చేసిన యాడ్ ఏజెన్సీలతోపాటు కంపెనీల ప్రతినిధులు సంయుక్తంగా అందుకున్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా భాగ్యనగరంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని, అమెరికాలోని న్యూయార్క్ మహానగరంతో దాదాపు సమానంగా నగర పోలీసు వ్యవస్థ ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని భద్రత కల్పిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ‘సాక్షి’మీడియా గ్రూపు కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ కేఆర్పీ రెడ్డి, ఫైనాన్స్ విభాగం డైరెక్టర్ వైఈపీరెడ్డి, భారతీ సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సవాళ్ల మధ్య పురోగమనం: శ్యాం బర్సారా దేశంలో వాణిజ్య ప్రకటనల రంగం(అడ్వర్టైజ్మెంట్) తీవ్ర పోటీ, సవాళ్ల మధ్య పురోగమిస్తోందని మాడిసన్ వరల్డ్ చైర్మన్ శ్యాం బర్సారా చెప్పారు. ప్రస్తుతం డిజిటల్ మీడియా, చానల్స్ మధ్య పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వాణిజ్య ప్రకటనల విషయంలో ప్రయోగాలతో అద్భుతాలు సృష్టించాలని కోరారు. దేశంలో 1972లో కేవలం రూ.100 కోట్ల మేర ఉన్న వాణిజ్య ప్రకటనల వ్యాపారం ఇప్పుడు సుమారు రూ.60 వేల కోట్లకు చేరిందన్నారు. వినియోగదారులను ప్రభావితం చేయడంతోపాటు ఆలోచింపజేసేలా వాణిజ్య ప్రకటనలు ఉండాలని సూచించారు. ఈ రంగంలో అనుసరించాల్సిన మెళకువలను ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇండియా అవార్డ్స్–2018కి ఎంపికైన సంస్థలు.. వాటి యాడ్స్ వివరాలివీ.. ఆటో ఫోర్ వీలర్స్ టాటా మోటార్స్ న్యూ ఏస్ ఎక్స్ఎల్ ఆటో టూ వీలర్స్ రాయల్ ఎన్ఫీల్డ్ ఆటో అదర్స్ అపోలో టైర్స్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఐసీఐసీఐ బ్యాంక్ స్మార్ట్కీస్ ఫుడ్ అండ్ బేవరేజెస్ డాబర్ హనీ స్టే ఫిట్.. ఫీల్ యంగ్ హోమ్‌కేర్ లైజాల్ మాన్సూన్ న్యూప్యాక్ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా సోనిమ్యాక్స్ సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ మూవీ పర్సనల్ కేర్ కోల్గేట్ స్వర్ణ వేద్ శక్తి టూత్‌పేస్ట్ రిటైల్ లలిత జ్యూవెలరీస్.. లలిత చెక్ అండ్ బయ్ టెలికం అండ్ టెక్నాలజీ ఎయిర్టెల్– మై ప్లాన్ ఫ్యామిలీ ఫార్మా హైజిన్ అండ్ వెల్నెస్ మూవ్–సింధు డైరెక్టర్ హోమ్ డెకార్ ఫెవిక్విక్ జెల్–హెడ్‌స్టాండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కపిల్ చిట్ ఫండ్స్ యాడ్ ఫిల్మ్ బిల్డింగ్ మెటీరియల్ భారతీ సిమెంట్ ఫుల్ గ్యారంటీ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మింట్ ఈ మొబైల్స్లాంచ్ ఆఫ్ మింట్ ఈ ఓపెన్బాక్స్ మొబైల్స్ రియల్ ఎస్టేట్ అపర్ణ గేటెడ్ కమ్యూనిటీస్–ది పేపర్ ప్లేన్ సర్వీసెస్ గటి–అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫుడ్ అండ్ బేవరేజెస్ ఫ్రీడం రీఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ గవర్నమెంట్ ఏపీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్–సన్రైస్ ఏపీ ఇన్వెస్ట్మెంట్స్ రిటైల్ సెంట్రో–దసరా క్యాంపెయిన్ ట్రావెల్ అండ్ టూరిజం తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ జెండర్ సెన్సిటివ్ అడ్వరై్టజింగ్ ఫ్యూర్ అండ్ ష్యూర్–కన్యాకుమారి టు లడక్ ఇన్ 100 హవర్స్ కార్పొరేట్ జన్రైస్ అడ్వరై్టజింగ్–హ్యాపీ మదర్స్‌డే -
భారతీ సిమెంట్స్ దరఖాస్తును పరిగణనలోకి తీసుకోండి
♦ లీజుపై ఈ నెల 10లోపు నిర్ణయం తీసుకోండి ♦ కేంద్రం నోటిఫికేషన్‌కు అనుగుణంగా నిర్ణయం ఉండాలి ♦ ఏపీ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ జిల్లా, కమలాపురం మండలం, పందిళ్లపల్లి, తురకపల్లి, టి.చదిపిరాళ్ల, యర్రగుంట్ల మండలం, టి.సుంకేసుల, తిప్పలూరు గ్రామాల్లో సున్నపురాయి గనుల లీజు వ్యవహారంలో భారతీ సిమెంట్స్ పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు శుక్రవారం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారతీ సిమెంట్స్‌కు గతంలో జారీ చేసిన లెటర్ ఆఫ్ ఇండెంట్ (ఎల్ఓఐ) గడువు ఈ నెల 11తో ముగుస్తున్న నేపథ్యంలో లీజు కోసం ఆ సంస్థ పెట్టుకున్న దరఖాస్తుపై ఈ నెల 10లోపు నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. గనులు, ఖనిజాభివృద్ధి చట్ట నిబంధనలు, ఈ నెల 4న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా నిర్ణయం ఉండాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మైనింగ్ లీజు నిర్ధారణకు సంబంధించి భారతీ సిమెంట్స్‌కు జారీ చేసిన నోటీసు విషయంలో ప్రభుత్వ హక్కులపై తాము వెలువరించిన ఈ ఉత్తర్వులు ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపబోవని ధర్మాసనం స్పష్టం చేసింది. కమలాపురం, యర్రగుంట్ల మండలాల పరిధిలోని గ్రామాల్లో సున్నపురాయి గనుల లీజు వ్యవహారంలో ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నాయంటూ భారతీ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఆ వ్యాజ్యంపై మరోసారి విచారణ జరిపింది. వాదనలు విన్న అనంతరం ఎల్ఓఐ గడువు ముగుస్తున్నందున ఈ నెల 10లోపు భారతీ సిమెంట్స్ దరఖాస్తుపై నిర్ణయం వెలువరించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఈడీవి తొందరపాటు చర్యలు
- అప్పీల్‌కు 45 రోజుల గడువుంది - అయినప్పటికీ డిపాజిట్లను బదలాయించేసుకుంది - ఇది ఎంతమాత్రం సరికాదు - అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులపై తదుపరి చర్యలన్నీ నిలిపేయండి - హైకోర్టులో వై.ఎస్.జగన్, భారతి, పలు కంపెనీల పిటిషన్లు సాక్షి, హైదరాబాద్: భారతి సిమెంట్స్ కేసులో జప్తు చేసిన ఆస్తుల బదలాయింపు విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తొందరపాటు చర్యలను వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతితో పాటు, మరికొన్ని కంపెనీలు ఉమ్మడి హైకోర్టు ముందు సవాలు చేశాయి. ఈడీ అడ్జ్యుడికేటింగ్ అథారిటీ గత నెల 23న ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ నిలిపే యాలని కోరుతూ వారు సోమవారం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అంతేకాక బ్యాంకు ల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి ఆయా బ్యాంకులకు ఈడీ అసిస్టెంట్ మేనేజర్ జారీ చేసిన నోటీసుల అమలును నిలిపేయా లని వారు తమ పిటిషన్లలో కోర్టును కోరారు. అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులపై అప్పిలెట్ అథారిటీ ముందు అప్పీల్ దాఖలు చేసుకునేందుకు తమకు 45 రోజుల గడువు ఉందని, అయినప్పటికీ ఈడీ తమ డిపాజిట్లను బదలాయించేసుకుందని వారు తమ పిటిషన్లలో వివరించారు. అదే విధంగా పలు ఆస్తులను కూడా బదలాయించుకునేందుకు ఈడీ తొందరపడుతోందని పేర్కొన్నారు. ఈడీ తమ ప్రాథమిక జప్తు ఖరారు నిమిత్తం అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందు పిటిషన్ దాఖలు చేసి అందులో తమపై పలు ఆరోపణలు చేసిందని, వాటికి తాము పూర్తి ఆధారా లతో తగిన సమాధానం ఇచ్చామని తెలిపారు. అయితే అడ్జ్యుడికేటింగ్ అథారిటీ తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా ఈడీ ప్రాథమిక జప్తును ఖరారు చేస్తూ యాంత్రికంగా ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. కాగా, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ హోదాలో చట్టబద్ధంగా అందుకున్న జీతం, దాని తాలుకు డిపాజిట్లను కూడా ఈడీ అక్రమమని చెబుతోందని, ఇది ఎంత మాత్రం సరికాదని భారతి తన పిటిషన్లో పేర్కొన్నారు. -
‘భారతీ సిమెంట్స్’ ఆధ్వర్యంలో అన్నదానం
జోగిపేట(మెదక్): మెదక్ జిల్లా జోగిపేట లోని శ్రీజోగినాథ ఆలయ రథోత్సవాల్లో భాగంగా బుధవారం శివపార్వతుల కళ్యాణోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ‘భారతీ సిమెంట్స్’ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని భారతీ సిమెంట్స్ మార్కెటింగ్ మేనేజర్ పీఎస్.కరుణాకర్, డిప్యూటీ మేనేజర్ సతీష్‌కుమార్ ప్రారంభించారు. సుమారు మూడువేల మంది భక్తులు భోజనాలు చేశారు. ఈ సందర్భంగా భారతీ సిమెంట్స్‌కు ఆలయ రథోత్సవ కమిటీ అభినందనలు తెలిపింది. సంస్థ టెక్నికల్ మేనేజర్ నరేష్ కుమార్, ఇంజనీర్ గణేష్, జోగిపేట షిర్టీ సాయిబాబా ట్రేడర్స్ యాజమాని సీహెచ్.నర్సింలు, సంగారెడ్డికి చెందిన శ్రీ బాలాజీ సాయిరాం ట్రేడర్స్ యాజమాని కృష్ణకాంత్, నగర పంచాయతీ చైర్పర్సన్ ఎస్.కవిత సురేందర్‌గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.