ఈడీవి తొందరపాటు చర్యలు
- అప్పీల్‌కు 45 రోజుల గడువుంది
- అయినప్పటికీ డిపాజిట్లను బదలాయించేసుకుంది
- ఇది ఎంతమాత్రం సరికాదు
- అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులపై తదుపరి చర్యలన్నీ నిలిపేయండి
- హైకోర్టులో వై.ఎస్.జగన్, భారతి, పలు కంపెనీల పిటిషన్లు
సాక్షి, హైదరాబాద్: భారతి సిమెంట్స్ కేసులో జప్తు చేసిన ఆస్తుల బదలాయింపు విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తొందరపాటు చర్యలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతితో పాటు, మరికొన్ని కంపెనీలు ఉమ్మడి హైకోర్టు ముందు సవాలు చేశాయి. ఈడీ అడ్జ్యుడికేటింగ్ అథారిటీ గత నెల 23న ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ నిలిపే యాలని కోరుతూ వారు సోమవారం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అంతేకాక బ్యాంకు ల్లో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సంబంధించి ఆయా బ్యాంకులకు ఈడీ అసిస్టెంట్ మేనేజర్ జారీ చేసిన నోటీసుల అమలును నిలిపేయా లని వారు తమ పిటిషన్‌లలో కోర్టును కోరారు.
అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులపై అప్పిలెట్ అథారిటీ ముందు అప్పీల్ దాఖలు చేసుకునేందుకు తమకు 45 రోజుల గడువు ఉందని, అయినప్పటికీ ఈడీ తమ డిపాజిట్లను బదలాయించేసుకుందని వారు తమ పిటిషన్లలో వివరించారు. అదే విధంగా పలు ఆస్తులను కూడా బదలాయించుకునేందుకు ఈడీ తొందరపడుతోందని పేర్కొన్నారు. ఈడీ తమ ప్రాథమిక జప్తు ఖరారు నిమిత్తం అడ్జ్యుడికేటింగ్ అథారిటీ ముందు పిటిషన్ దాఖలు చేసి అందులో తమపై పలు ఆరోపణలు చేసిందని, వాటికి తాము పూర్తి ఆధారా లతో తగిన సమాధానం ఇచ్చామని తెలిపారు. అయితే అడ్జ్యుడికేటింగ్ అథారిటీ తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా ఈడీ ప్రాథమిక జప్తును ఖరారు చేస్తూ యాంత్రికంగా ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. కాగా, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ హోదాలో చట్టబద్ధంగా అందుకున్న జీతం, దాని తాలుకు డిపాజిట్లను కూడా ఈడీ అక్రమమని చెబుతోందని, ఇది ఎంత మాత్రం సరికాదని భారతి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.