హైకోర్టులో టీడీపీకి చుక్కెదురు
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీకి హైకోర్టులో చుక్కెదురు అయింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జమ్మలమడుగులో పదిమంది ఓటర్లుకు సహాయకుల కోసం (కంపానియన్ ఓటు) టీడీపీ కోర్టును ఆశ్రయించింది. అయితే టీడీపీ అభ్యర్థనను హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. గడువులోపుగా దరఖాస్తు చేసుకోలేనందున పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. కాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మ్యాజిక్ ఫిగర్‌కు సరిపడా ఓట్లు లేవు అన్నది జగమెరిగిన సత్యం. అయినా సరే అధికారాన్ని అడ్డంపెట్టుకుని విజయం సాధించాలనే దిశగా టీడీపీ ఐదంచెల వ్యూహం పన్నింది.
వివిధ దశల్లో ఆ వ్యూహాన్ని తెర తీసింది. ప్రధానంగా ప్రలోభాలకు గురిచేయడం, అప్పటికీ సాధ్యం కాకపోతే బెదిరింపులకు పాల్పడింది. అయినా కుదరకపోతే దౌర్జన్యాలకు దిగారు. ప్రత్యక్షంగా ఇలా తెరపై కన్పిస్తూనే ఇంకోవైపు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఆపై చట్టంలో లొసుగులు ఆధారం చేసుకొని లబ్ధిపొందాలనే దిశగా ఎత్తుగడలు వేసింది. దశలవారీగా వ్యూహాలను అమలు చేసింది. దాంతో తెలుగు తమ్ముళ్లు దృష్టి కంపానియన్ ఓటుపై పడింది. (ఫారం 14ఏ ప్రకారం నిరక్షరాస్యులు, తీవ్ర అనారోగ్యవంతులు, అంధులు కంపానియన్ ఓటు పొందే అవకాశం ఉంది)
ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం లేకపోవడంతో పాటు, అభద్రతా అధికం కావడంతో టీడీపీ కంపానియన్ ఓటు కోసం విస్తృతంగా ప్రయత్నాలు చేసింది. దాదాపు 47మంది ఓటర్లకు కంపానియన్ ఓటు కావాలంటూ టీడీపీ నేతలు దరఖాస్తులు చేసింది. వ్యక్తగతంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, గడువు ముగిసిన అనంతరం ఈమెయిల్ ద్వారా పంపించారు. ఓటర్ల పట్ల వ్యవహరించిన తీరు కారణంగా పోలింగ్ బూత్‌లోకి వెళితే ఓటు వేయరనే ఏకైక కారణంతోనే ఇలాంటి చీప్ ట్రిక్స్‌కు పాల్పడింది.
అయితే టీడీపీ ఎత్తుగడలకు ఈసీ చెక్ పెట్టింది. వారు ఈ-మెయిల్ ద్వారా సమర్పించిన 47 దరఖాస్తులను తిరస్కరించింది. అయినప్పటికీ టీడీపీ నేతలు గురువారం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన 10మందికి అయినా కంపానియన్ ఓటు సౌకర్యం కల్పించాలని కోరారు. అయితే ఈసీ నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థిస్తూ టీడీపీ పిటిషన్ కొట్టేసింది. కాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో 841 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో కేవలం పదిమంది మాత్రమే నిరక్షరాస్యులు.