ధిక్కరిస్తే జైలే..గంట టైమ్ ఇవ్వండి
హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై బుధవారం హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున సమ్మె విమరించాలని కోరినా పట్టించుకోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయినా కార్మికులు సమ్మె విరమించలేదని, చట్ట ప్రకారం చర్యలు తప్పవని హైకోర్టు ఈ సందర్భంగా హెచ్చిరించింది.
కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారిని జైలుకు పంపుతామని కార్మిక సంఘాలను హైకోర్టు హెచ్చరించింది. సమ్మె చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. అలాగే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా సమ్మెపై నిర్ణయం తీసుకునేందుకు తమకు ఒకరోజు సమయం కావాలని కార్మిక సంఘాల నేతలు కోరినా అందుకు న్యాయస్థానం నిరాకరించింది. దాంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు తమకు గంట సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరాయి. భవిష్యత్ కార్యాచరణపై కార్మిక సంఘాల నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇక హైకోర్టు వేసవి సెలవులు ముగిసే వరకూ విచారణ వాయిదా పడింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు ... ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరుపుతున్నారు. అలాగే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్తో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది.