జూనియర్ డాక్టర్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్ : సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే సమ్మె విరమించి విధుల్లోకి చేరాలని న్యాయస్థానం వైద్య విద్యార్థులను ఆదేశించింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దంటూ జూనియర్ డాక్టర్లకు శుక్రవారం హైకోర్టు సూచించింది. డిమాండ్ల పరిష్కారంపై సర్కారు మొండి వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ వైద్యులు గత నెల 29 నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద చేరినా 9లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని... ఆ వసూళ్లను తక్షణమే నిలిపివేసి జీఓ నెంబరు 93ను రద్దు చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వాస్పత్రుల్లో శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించాలని... ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రభుత్వాస్పత్రిలోనే వైద్యం చేయించుకోవాలనేది వీరి మరో డిమాండ్. వీటిని పరిష్కరించాలని కోరుతూ గతనెల 16న వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి, వైద్య విద్య మంత్రికి లేఖ ఇచ్చారు. అయితే వారు స్పందించకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోవటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.