జూడాల సమ్మె చట్ట విరుద్ధం
తీర్పు వెలువరించిన హైకోర్టు
* సమ్మెతో రోగులను ఇబ్బందిపెట్టడం తగదు
* 48 గంటల్లోగా వారు విధుల్లో చేరాలి
* లేకపోతే ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టవచ్చు
* జూడాల డిమాండ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు
* ఇప్పటికైనా వాటిని పరిష్కరించాలని సూచన
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమ్మె చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజలకు సేవ చేసే వృత్తిలో ఉన్న వైద్యులకు ఈ విధంగా సమ్మె చేసి.. రోగులను ఇబ్బంది పెట్టడం ఎంత మాత్రం తగదని ఆక్షేపించింది. సమ్మె విరమించి 48 గంటల్లోగా విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లను ఆదేశించింది. ఆ లోగా వారు విధుల్లో చేరకపోతే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది. అయితే దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు నిబంధన మినహా మిగతా డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటిం చాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన రవి కిరణ్‌స్వామి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యా జ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై జూనియర్ వైద్యులు, పిటిషనర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం తమ తరఫున వాదనలు వినిపించగా... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది.
జూనియర్ వైద్యుల సమ్మె చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ.. 48 గంటల్లోగా విధుల్లో చేరాలని వారిని ఆదేశించింది. విద్యార్థుల భవి ష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారిపై చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, ఒకవేళ తామిచ్చిన గడువులోపు సమ్మె విరమించకపోతే చట్ట ప్రకారం తగిన చర్యలకు ఉపక్రమించవచ్చునని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇక ఏటా డిమాం డ్ల పరిష్కారం కోసం జూడాలు సమ్మె చేస్తున్నారని, వారి న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఇకనైనా న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తీర్పును స్వాగతిస్తున్నాం..
జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించి, విధుల్లో చేరాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని వైద్య విద్యా డెరైక్టర్ పుట్టా శ్రీనివాస్ పేర్కొన్నారు. అయితే ఈ తీర్పులో కోర్టు ప్రభుత్వానికి చేసిన సూచనలపై ఏం చేయనున్నారని విలేకరులు ప్రశ్నించగా... తీర్పు ప్రతి అందిన తర్వాత, ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కోర్టు తీర్పు మేరకైనా జూనియర్ డాక్టర్లు విధుల్లో చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మరోసారి చర్చలు జరుపుదాం: జూడాలు
ప్రభుత్వం తమను ఆహ్వానించి మరోసారి చర్చలు జరిపితే.. సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో జూడాల సం ఘం ప్రతినిధులు శ్రీనివాస్, స్వప్నిక, భవ్య, రాఘవేంద్ర, అనిల్ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. జూడాల ఐదు డిమాండ్లలో నాలుగింటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. మరో డిమాండ్ అయిన ‘ఏడాది రూరల్ సర్వీసు’ అంశంపై హైకోర్టు బుధవారం నాటి తీర్పులో స్పష్టత ఇవ్వకపోవడంతో.. జూనియర్ డాక్టర్లు సందిగ్ధంలో పడ్డారు.