తిరుపతి రుయా ఆస్పత్రి ఆవరణలో ప్లకార్డులతో నినాదాలు చేస్తున్న జూనియర్ డాక్టర్లు
కొనసాగుతున్న సమ్మె
సాక్షి, విజయవాడ బ్యూరో: సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లతో ఏపీ వైద్య విద్య డెరైక్టర్ (అకడమిక్) డాక్టర్ వెంకటేశ్ సోమవారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఒక ఏడాది గ్రామీణ సర్వీసు తప్పనిసరి నిబంధనను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో జూడాలు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం హైదరాబాద్ నుంచి వచ్చిన వెంకటేశ్ సిద్ధార్థ వైద్య కళాశాల ఆడిటోరియంలో జూడాలతో సమావేశమయ్యారు. చర్చలు ముగిసిన తర్వాత డీఎంఈ విలేకరులతో మాట్లాడారు. సమ్మె వ్యవహారం హైకోర్టులో ఉందని, తీర్పు వచ్చేవరకూ వేచి చూడాలని జూడాలను కోరినట్లు చెప్పారు.
జూడాలు కోరుతున్నట్లుగా వాలంటరీ సర్వీసుకు అవకాశం కల్పిస్తే ఒంగోలు, శ్రీకాకుళం వంటి కాలేజీలకు వెళ్లరని, తద్వారా అక్కడి ఆస్పత్రుల్లో ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించకపోవడంతో సమ్మె కొనసాగిస్తున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం నేతలు కార్తీక్, క్రాంతికుమార్ విలేకరులకు తెలిపారు. మరోవైపు విజయవాడ సిద్ధార్థ, కాకినాడ రంగరాయ, కర్నూలు, తిరుపతి వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో జూడాలు విధుల బహిష్కరణను కొనసాగించారు. విజయవాడ సిద్ధార్థ, తిరుపతి రుయా ఆస్పత్రుల వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు.