
చీరాల: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు చుక్కెదురైంది. తాను చేసిందే శాసనం లాగా వ్యవహరించే ఆమంచికి హైకోర్టు అడ్డుకట్ట వేసింది. వాడరేవు తీరాన్ని అభివృద్ధి చేస్తానని చెబుతూ దశాబ్దాల నుంచి అక్కడ నివాసం ఉంటున్న మత్స్యకారుల పూరిగుడిసెలను తొలగించాలని ఆమంచి చేసిన ప్రయత్నాలకు హైకోర్టు స్టేతో ఎదురుదెబ్బ తగిలింది. వివరాల్లోకి వెళ్తే..మండలంలోని వాడరేవు గ్రామంలోని తీరం ఒడ్డున ఫిష్‌ల్యాండింగ్ సమీపంలో 6.73 ఎకరాల స్థలంలో మత్య్సకారులు పూరి గుడిసెలు వేసుకుని చేపలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. 80 ఏళ్లుగా 168 పూరి గుడిసెలు, 70 రేకుల ఇళ్లు, 4 మెకానిక్ షెడ్లు, 7 బంకులను ఏర్పాటు చేసుకుని మత్య్సకారులు నివాసం ఉంటున్నారు. అయితే ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో వాడరేవుకు వచ్చిన ఎమ్మెల్యే ఆమంచి వాడరేవును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఆ ప్రాంతంలో పూరిగుడిసెలను తొలగించి మత్య్సకారులను గ్రామంలోని వేరే ప్రదేశాలకు వెళ్లిపోవాలని ఆదేశాలిచ్చారు. ఎమ్మెల్యే ఆదేశాలతో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ అధికారులు తీరం ఒడ్డున ఉన్న పూరిగుడిసెలను తొలగించేందుకు పొక్లెయినర్లు, పోలీసులు, వాహనాల సాయంతో తీరానికి చేరుకున్నారు.
మత్య్సకారులు ఆమంచి నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో పాటుగా తమ ప్రాణాలైనా ఇస్తాం..పూరిగుసెలను తొలగిస్తే ఊరుకోమని హెచ్చరికలు సైతం జారీ చేశారు. వారం రోజుల పాటు మత్య్సకారులు టెంట్లు వేసుకుని గుడిసెల తొలగించకుండా అడ్డుకున్నారు. కానీ ఎమ్మెల్యే అండతో పోలీసులు, రెవెన్యూ అధికారులు గుడిసెల తొలగింపునకు యత్నించారు. అడ్డుకున్న మత్య్సకారులను బలవంతంగా, విచక్షణ లేకుండా అరెస్టు చేశారు. అయితే తీరం మా హక్కు నినాదంతో మత్య్సకారులు పోరాటాలు చేస్తుండటంతో వారికి వైఎస్సార్ సీపీ, ఇతర ప్రజాసంఘాల నాయకులు అండగా నిలిచారు. ఆమంచి మాత్రం వాడరేవు మత్య్సకారులు చీరాల మార్కెట్‌లో చేపలను అమ్ముకోనీయకుండా అధికారుల సాయంతో వారిని అడ్డుకున్నారు. మత్య్సకారులకు వైఎస్సార్ సీపీ చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి యడం బాలాజీ, బాపట్ల పార్లమెంట్ ఇన్‌చార్జి వి.అమృతపాణితో పాటుగా ప్రజాసంఘాలు, మత్య్సకార సంఘాలు అండగా నిలిచారు.
పదిరోజుల క్రితం వాడరేవు మత్య్సకారులు 321 మంది, రాష్ట్ర మత్య్సకార సంఘాల నాయకులు తమకు ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయం, అరాచకాలపై హైకోర్టులో వ్యాజ్యం వేయడంతో శుక్రవారం హైకోర్టు గుడిసెల తొలగింపు చేయవద్దని స్టే జారీ చేసింది. మత్య్సకారులకు అండగా హైకోర్టు స్టే ఇవ్వడంతో వైఎస్సార్ సీపీ నేతలు, మత్య్సకార సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘వాడరేవులో 80 ఏళ్లుగా ఉంటున్న మత్య్సకారుల పూరిగుడిసెల తొలగింపు అధికారం రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ శాఖలకు లేదు....ఎవ్వరైనా గుడిసెల తొలగింపునకు యత్నిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని’ స్టే ఆర్డర్‌లో హైకోర్టు పేర్కొంది. నియోజకవర్గంలో నేనేరాజు....నేనే మంత్రిగా వ్యవహరించే ఆమంచి అరాచకాలకు హైకోర్టు అడ్డుకట్ట వేసిందని, భవిష్యత్తులో మత్య్సకారుల జోలికి వస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వాడరేవు మత్య్సకారులు అంటున్నారు. తమను వేధించాలని చూస్తే ఊరుకోమని, తమకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ,ప్రజాసంఘాలు, మత్య్సకార సంఘా ల నాయకులకు వాడరేవు మత్య్సకారులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment