టెండర్లకు బ్రేక్ | high court stay on tenders | Sakshi
Sakshi News home page

టెండర్లకు బ్రేక్

Published Wed, Mar 26 2014 4:25 AM | Last Updated on Fri, Aug 31 2018 8:53 PM

high court stay on tenders

శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తి దేవస్థానంలో జరిగే రాహుకేతు పూజలకు వినియోగించే ఎర్రగుడ్డ, నల్లగుడ్డ, కండువాలతో పాటు 40రకాల వస్తువుల టెండర్ల ప్రక్రియను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టు మంగళవారం స్టే విధించింది. ఫలితంగా బుధవారం జరగాల్సిన టెండర్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గతంలో ఎర్రగుడ్డ, నల్లగుడ్డ, కండువాలతో పాటు ఆలయ స్టోర్స్‌కు చెందిన 40 రకాల నిత్యావసర సరుకులకు ఒక్కటిగా టెండర్లు నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది ఒక్కటిగా కాకుం డా ఏడు విభాగాలుగా విభజించి టెండర్లు నిర్వహించడానికి  ఈవో రామచంద్రారెడ్డి నిర్ణయించారు.

 ఈ మేరకు 10 రోజుల కిందట ప్రకటనలు ఇచ్చారు. అంతేకాకుండా ఎర్రగుడ్డ, నల్లగుడ్డ, కండువాలతోపాటు 40రకాల వస్తువులను ఒక్క యూనిట్‌గా టెండర్లు నిర్వహిం చే సమయంలో ఏడాదిలో 5 కోట్లు టర్నోవర్ చూపాలనే నిబంధనలు ఉండేవి. ఈ ఏడాది ఒక్క యూనిట్‌ను ఏడు యూనిట్‌లుగా విభజించి టెండర్లు నిర్వహించడంతోపాటు (7యూనిట్లు) ఏడాదిలో కేవలం రూ.2 కోట్లు టర్నోవర్ మాత్రమే చూపాలని ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో స్థానికుడు చంద్రశేఖర్‌రావు అనే వ్యక్తి రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు స్పందించింది. దేవాదాయశాఖ అనుమతులు తీసుకోకుండా ఒక యూనిట్‌ను ఏడు యూనిట్లుగా విభజించడం, 5కోట్ల టర్నోవర్‌ను  2 కోట్లకు తగ్గించడం సరికాదని హైకోర్టు పేర్కొంటూ స్టే విధించింది. మొదటిరోజు(సోమవారం) 27షాపులకు, రెండవరోజు(మంగళవారం)నాలుగు టెండర్లు యథావిధిగా జరిగినప్పటికీ మూడవరోజు బుధవారం జరగాల్సిన టెండర్ల ప్రక్రియ కోర్టు స్టేతో ఆగిపోనుంది.

 స్థానికులకు లబ్ధిచేకూర్చడానికే ఏడు టెండర్లు..
 స్థానికులకు లబ్ధి చేకూర్చడానికే ఒక్క యూనిట్‌ను ఏడు యూనిట్లు చేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. 40 వస్తువులకు పలువురుకి టెండర్లు అప్పగిస్తే గందరగోళంగా మారుతుందని, అంతేకాకుండా చిన్నచిన్న కాంట్రాక్టర్లు అయితే సక్రమంగా నిర్వహించలేరనే ఉద్దేశ్యంతో గతంలో ఏడాదికి రూ.5కోట్ల టర్నోవర్ చూపాలనే నిబంధనలు రూపొందించారు.అయితే అందుకు భిన్నంగా కొందరు నాయకుల ఒత్తిళ్లతో వారికి అనుకూలంగా ఇలా చేసినట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి.

 యథావిధిగా నాలుగు టెండర్లు
 మంగళవారం  నాలుగు టెండర్లను ఆలయ ఈవో రామచంద్రారెడ్డి యథావిధిగా పూర్తి చేశారు. రాహుకేతు పూజలకు వినియోగించే టెంకాయల టెండర్ గతేడాది రూ.65.50 లక్షలు ఉండగా, ఈ ఏడాది రూ.కోటి 11 లక్షల యాబైవేలు చెల్లించడానికి నరసింహారెడ్డి ముం దుకు వచ్చారు. కారు పార్కింగ్ గతేడాది రూ.కోటి 15 లక్షలు ఉండగా ఈ ఏడాది కోటి రూపాయిలకు ముత్యాల వెంకటకృష్ణ దక్కించుకున్నారు. అదేవిధంగా రాహుకేతు పూజలకు వినియోగించే ఉద్దులు, ఉలవలు గతేడాది రూ.9.50 లక్షలు ఉండగా,ఈఏడాది రూ. 12.70లక్షలు చెల్లించడానికి కె.పద్మావతి ముందుకు వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement