సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే నోట్ పుస్తకాల సరఫరాలో భారీగా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. 40 ఏళ్లుగా నోట్ పుస్తకాలను సరఫరా చేస్తున్న ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్‌ను ప్రభుత్వ పెద్దలు పక్కన పెట్టారు. తమకు బాగా కావాల్సిన ప్రైవేట్ సంస్థకు ఈ కాంట్రాక్టు కట్టబెట్టేలా టెండర్ నిబంధనలు రూపొందించారు. కమీషన్ల కోసమే ప్రైవేట్ సంస్థపై మమకారం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో రూ.40 కోట్లు కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలుపథకం వేసినట్లు సమాచారం.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 1,37,943 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో 1,72,849 మంది, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో 52,454 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 3,63,246 మంది ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అంతేకాకుండా కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయాలు, ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లోనూ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 4 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వివిధ హాస్టళ్లలో ఉంటూ చదువు కొనసాగిస్తున్నారు. వీరికోసం 2018–19 విద్యా సంవత్సరానికి 70,69,287 నోట్ పుస్తకాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏప్రిల్ 10న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 25లోగా టెండర్లు దాఖలు చేయొచ్చని సూచించింది. తరువాత ఈ గడువును ఏప్రిల్ 30 వరకూ పొడిగించింది. ఫైనాన్షియల్ బిడ్‌ను అదేరోజు నిర్ణయిస్తామని ప్రకటించింది.
హైకోర్టు ఆదేశం
నోట్ పుస్తకాల సరఫరా టెండర్‌ను ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన బాలా ఎంటర్‌ప్రైజెస్ ప్రొప్రైటర్ సీహెచ్ బాలయ్య హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. టెండర్ ప్రక్రియను కొనసాగించినా తాము ఆదేశించే వరకూ టెండర్లను ఖరారు చేయొద్దని హైకోర్టు ఏప్రిల్ 24న ఆదేశాలు జారీ చేసింది.
గ్రాఫిక్ కంపెనీకే టెండర్!
పేరుకు టెండర్లు పిలిచినప్పటికీ తమకు కావాల్సిన వారికే కాంట్రాక్టు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ఏర్పాట్లు చేశారు. చిన్నచిన్న ట్రేడింగ్ కంపెనీలు టెండర్లలో పాల్గొనేందుకు వీల్లేకుండా కఠిన నిబంధన విధించారు. ఈ టెండర్లలో పాల్గొనాలంటే గత ఐదేళ్లలో రూ.20 కోట్ల విలువైన లావాదేవీలు జరిపి ఉండాలని పేర్కొన్నారు. చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇలాంటి నిబంధన విధించడం ఏమిటని పలువురు ట్రేడర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ సమీపంలోని పునాదిపాడు వద్ద ఉన్న ఒక గ్రాఫిక్ కంపెనీకి ఈ టెండర్లు కట్టబెట్టాలని ముందే నిర్ణయించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నోట్ పుస్తకాల్లోనూ నొక్కుడే!
Published Tue, May 8 2018 3:40 AM | Last Updated on Fri, Aug 31 2018 8:42 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment