పూర్తి వివరాలను కోర్టు ముందుంచండి
- ఎంపీ గీత కుల ధ్రువీకరణపై హైకోర్టు ఆదేశం..
సాక్షి, హైదరాబాద్: అరకు ఎంపీ కొత్తపల్లి గీత కుల ధ్రువీకరణ అంశంలో హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ కొత్తపల్లి గీతతోపాటు ఏపీ గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎన్నికల కమిషన్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గీత ఎస్టీ కాదని, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో అరకు నుంచి ఎంపీగా గెలుపొందారని, ఈ కారణంగా ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఈ.ఆంజనేయులు, మరొకరు గతేడాది నవంబర్‌లో హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బుధవారం విచారించింది. పిటీషినర్ల తరుఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ చేసిన వాదనలు విన్న ధర్మాసనం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది.