హైడ్రామా! | high drama | Sakshi
Sakshi News home page

హైడ్రామా!

Published Wed, Jun 18 2014 2:02 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

హైడ్రామా! - Sakshi

హైడ్రామా!

సాక్షి ప్రతినిధి, అనంతపురం : ‘‘అడ్మిషన్ కోసం వచ్చిన మా వాళ్లని ఎందుకు పట్టించుకోలేదు. నా మనుషులని తెలిసి కూడా ఎందుకు అడ్మిట్ చేసుకోలేదు. ఆస్పత్రిలో రాజకీయాలెందుకు చేస్తారు. వైద్యుల్లోనూ రాజకీయాలా’’ అంటూ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అనంతపురం సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వర రావుపై మండిపడుతూ హైడ్రామాకు తెరలేపారు.
 
 ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఆస్పత్రికి రాగానే అడ్మిట్ చేసుకున్న డాక్టర్లు, మా వర్గీయులను అడ్మిట్ చేసుకోవడంలో ఎందుకు తాత్సారం చేశారు? ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ ఎవరు?’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... సోమవారం రాత్రి కనగానపల్లి మండలం బద్దలాపురంలో పరిటాల వర్గీయులు వైఎస్‌ఆర్‌సీపీ సానుభూతిపరులపై దాడి చేశారు. ఈ దాడిలో తొమ్మిది మంది గాయాలపాలయ్యారు. వీరిలో తీవ్రంగా గాయపడిన సాలమ్మ, చంద్రప్ప, హరిలను మాత్రం ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుని మిగతా వారికి ప్రాథమిక చికిత్స చేసి పంపించారు.
 
 వైఎస్‌ఆర్‌సీపీ వారు అస్పత్రిలో చేరాక.. రాత్రి 11గంటల ప్రాంతంలో పరిటాల వర్గీయులు కూడా   తమపై కొందరు వైఎస్‌ఆర్ సీపీ వర్గీయులు దాడి చేశారంటూ ‘గీరుడు’గాయాలతో ఆస్పత్రికి వచ్చారు. గాయాల తీవ్రత లేకపోవడంతో డాక్టర్లు వారిని అడ్మిట్ చేసుకోకుండా ప్రాథమిక చికిత్స చేశారు. ఈ క్రమంలో తమ వర్గీయులను కూడా అడ్మిట్ చేసుకోవాల్సిందే అంటూ మంత్రి పరిటాల సునీత తరఫు నుంచి ఆస్పత్రి వర్గాలకు ఒత్తిళ్లు మొదలయినట్లు సమాచారం.
 
 దీంతో చివరకు మంగళవారం ఉదయం అడ్మిట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సునీత మంగళవారం సాయంత్రం ఆస్పత్రికి వచ్చి తన వర్గీయులను పరామర్శించారు. వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మంత్రి హోదాలో తొలిసారిగా ఆస్పత్రిని సందర్శించిన సునీత రోగుల సౌకర్యాలు, సాదకబాధకాల గురించి నామమాత్రంగా కూడా విచారించలేదు. కేవలం తమ వర్గం వారిని పరామర్శించి ఆస్పత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి వెళ్లిపోవడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘అస్పత్రికి వచ్చేవారిని మేం రోగులుగానే చూస్తాం. వారిదే కులం. ఏ వర్గం, ఏ పార్టీ అని చూడం. రోగి పరిస్థితి, తీవ్రతను బట్టే వారిని అడ్మిట్ చేసుకోవడమా లేదా అన్న విషయాన్ని నిర్ణయిస్తాం. అటుమంటిది నా మనుషులని తెలిసీ ఆడ్మిట్ చేసుకోరా అంటూ సాక్షాత్తు ఓ మంత్రే హూంకరించడం బాధాకరం’ అంటూ పేరు తెలపడానికి ఇష్టపడని ఓ డాక్టరు వ్యాఖ్యానించారు. ‘కేసుల కోసమో.. కౌంటర్ కేసుల కోసమో అస్పత్రిలో అడ్మిషన్ కోసం రాజకీయ వత్తిళ్లు చేస్తూ... పై పెచ్చు డాక్టర్లు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. అవసరం లేకపోయినా మంత్రి మనుషులని పది మందిని అడ్మిట్ చేసుకుంటే ఆ మేరకు నిజంగా వైద్యం అవసరమున్న పది మంది రోగులకు బెడ్లు కేటాయించలేమన్న విషయాన్ని బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు గమనిస్తే బాగుంటుం దంటూ ఆయన పేర్కొన్నారు.
 
 వారి గాయాలు తీవ్రతరం కాదు
 ఒత్తిడి తెచ్చి ఆస్పత్రిలో అడ్మిషన్ పొందిన వారి గాయాలు అంత తీవ్రమైనవి కాదు. ఎటువంటి ఫ్యాక్చర్స్ కన్పించలేదు. అయినా అనుమాన నివృత్తికోసం ఎక్స్‌రేకి పంపాం. బుధవారం రిపోర్టు వస్తుంది. వారందరికీ మెరుగైన వైద్యం అందించాం.
 - డాక్టర్ రామస్వామి నాయక్
 (హెచ్‌ఓడీ, సర్జికల్ విభాగం)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement