శ్రీకాకుళం: జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఎన్నికలో హైడ్రామా నడిచింది. అధ్యక్ష ఎన్నిక కోసం శ్రీకాకుళంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఆదివారం జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అయితే ఇందులో పాల్గొన్న నేతలు అధికారికంగా కొత్త అధ్యక్షులు ఎవరనే విషయాన్ని ప్రకటించకుండానే దాటవేశారు. దీనికి తోడు ఐవీఆర్‌ఎస్ సర్వేలో లేని వ్యక్తికి పట్టం కట్టినట్టు తెలుసుకుని కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్యాడర్ అభిప్రాయానికి పార్టీ అధిష్టానం విలువ ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్ర టీడీపీ అధిష్టానం కేడర్ అభిప్రాయానికి విలువ నివ్వలేదని ఆదివారం జరిగిన జిల్లా టీడీపీ అధ్యక్ష ఎన్నికను ఉదాహరణగా పలువురు చెప్పుకుంటున్నారు.
అధ్యక్ష స్థానానికి ఎవరు అర్హులని కొద్ది రోజుల క్రితం అధిష్టానం ఐవీఆర్‌ఎస్ విధానం ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాన్ని సేకరించింది. ఇందులో టీడీపీ ప్రస్తుత అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి (బాబ్జీ), పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందరశివాజీ, పంచాయతీరాజ్ చాంబర్ ప్రధాన కార్యదర్శి కలిశెట్టి అప్పలనాయుడులలో ఎవరిని బలపరుస్తారని మాత్రమే ప్రశ్నించింది. ఈ మూడు పేర్లు కాకుండా గౌతు శిరీష పేరును పార్టీ పరిశీలకులు ఖరారు చేయడం చూస్తే కేడర్ అభిప్రాయానికి అధిష్టానం విలువనివ్వలేదని చెప్పవచ్చు. అధిష్టాం ఆదేశాల మేరకు, శివాజీ దగ్గర భయమో తెలియనప్పటికీ..
జిల్లా ఇన్‌చార్జి మంత్రి పరిటాల సునీత, ఎన్నికల పరిశీలకులు బొండా ఉమామహేశ్వరరావు, తోట నర్శింహంల ఎదుట శాసనసభ్యులంతా గౌతు శిరీషను బలపరిచినట్టు తెలిసింది. ఈ ఐవీఆర్‌ఎస్ విధానంలో మంత్రులు, శాసనసభ్యులు కూడా తమ అభిప్రాయాలను తెలియజెప్పారు. అప్పట్లో గౌతు శిరీష పేరు లేకపోవడంతో ఆమె పేరును సూచించే అవకాశాలే లేవు. అటువంటప్పుడు శిరీషను ఏ విధంగా బలపరిచారో అర్థం కావడం లేదు. వాస్తవానికి ఈ పదవికి శిరీష అర్హురాలే అయినప్పటికీ ఐవీఆర్‌ఎస్ సర్వేలో ఆమె పేరును పొందుపరచకుండా ప్రస్తుతం నేరుగా ఎంపిక చేయడం చూస్తే అధిష్టానం వద్ద శిరీష భర్తకు ఉన్న పలుకుబడి అర్థమవుతుంది. శాసనసభ్యులు, మంత్రులు శిరీషకు మద్దతు తెలిపినప్పటికీ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పరిశీలకులు అధికారికంగా ఆ పేరును ప్రకటించకుండా అధిష్టానానికి నివేదించి అక్కడే ప్రకటిస్తామని చెప్పడంపై టీడీపీ కేడర్ తప్పు పడుతోంది.
దీనివల్ల తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, జిల్లాలో పేరును ప్రకటిస్తే కొందరు నాయకులు, కార్యకర్తల నుంచి బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తమవ్వొచ్చునని భావించే ఇలా చేశారని పలువురు అభిప్రాయ పడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే అధికారంలోకి రాకముందు కేడర్‌పై అధిష్టానానికి పట్టు ఉండేదని, అధికారంలోకి వచ్చిన తరువాత కేడర్‌పై పట్టులేదని కూడా పలువురు నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. అందువల్లనే పేరును ప్రకటించ లేకపోయారని వారంటున్నారు. ఇన్‌చార్జి మంత్రి సునీత, జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఇద్దర పరిశీలకులు, ఐదుగురు శాసనసభ్యులు ఉండి కూడా కేడర్‌కు భయపడి పేరును ప్రకటించక పోవడాన్ని పలువురు ఆక్షేపిస్తూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
గౌతు కుటుంబానికే పదవి అని ముందే చెప్పిన ‘సాక్షి’
జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి గౌతు కుటుంబానికే వచ్చే అవకాశం ఉందని సాక్షి మొట్టమొదటిగా కథనాన్ని ప్రచురించింది. అది వాస్తవమని నేడు రుజువైంది. శివాజీ కాకుంటే శిరీషకే ఆ పదవిని ఇస్తారని మొదటి నుంచి సాక్షిలో కథనాలు ప్రచురితమయ్యాయి. శివాజీ అనారోగ్యాన్ని భావించో, వృద్ధాప్యంలో ఉన్న కారణంగానో అధిష్టానం ఆయనకు కాకుండా అతని కుమార్తెకు అధ్యక్ష పదవి కట్టబెట్టిందని టీడీపీలోని ఓ వర్గం చె బుతోంది. అధిష్టానం వద్ద శివాజీ అల్లుడికి ఉన్న పలుకుబడితోనే శిరీషకు ఆ పదవి వరించిందని మరో వర్గం చెబుతోంది. ఏదిఏమైనా చౌదరి బాబ్జీ, కలిశెట్టి అప్పలనాయుడు వంటి ఆశావహులు మాత్రం కొంతమేర అసంతృప్తి చెందినట్టు కొట్టచ్చినట్టు కన్పించింది. తాము నమ్ముకున్న ఏ నాయకుడు తమకు సహకరించ లేదన్న నిరాశ వారిలో కన్పించింది.
అధ్యక్ష ఎన్నికలో హైడ్రామా !
Published Mon, May 18 2015 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM
Advertisement
Advertisement