కోడెల మరో హైడ్రామా !
సాక్షి, గుంటూరు: ప్రతి విషయంలో తనకేదో తీవ్ర అన్యాయం జరిగిపోతోందనే భావన కల్పిండం.. తద్వారా వచ్చే సానుభూతితో రాజకీయంగా ఎదగాలని ప్రయత్నించడంలో మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల శివప్రసాదరావు దిట్ట. ఆయన చెప్పేదొకటి చేసేదొకటి అన్న సంగతి నరసరావుపేట నియోజకవర్గంలో అందరికీ తెలిసిందే. గతంలో జరిగిన పలు ఘటనలు ఇందుకు నిదర్శనం. సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తే గెలుపు సాధ్యం కాదని గ్రహించిన కోడెల సత్తెనపల్లి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
అక్కడి నాయకుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఏం చేయాలో పాలుపోక పార్టీ అధినేత చ ంద్రబాబు చుట్టూ చక్కర్లు కొట్టారు. అనంతరం తమ పార్టీ బీజేపీతో పొత్తుపెట్టుకునే యోచనలో ఉందని గ్రహించి, నరసరావుపేటను ఆ పార్టీకి కేటాయించాలని, తనను సత్తెనపల్లి పంపాలని చంద్రబాబుకు విన్నవించినట్లు సమాచారం. నరసరావుపేటను బీజేపీకి కేటాయించడం వల్ల తనకు అన్యాయం జరిగిపోతోందని కార్యకర్తల్లో సానుభూతి పొంది చివరకు పార్టీ ఆదేశాలంటూ సత్తెనపల్లికి వెళ్లేందుకు కోడెల పథక రచన చేశారు. బీజేపీ టికెట్ ఆశ చూపి... పొత్తులో సీటు కోల్పోయి సత్తెనపల్లికి వస్తున్న తనకు ఆ నియోజకవర్గంలో సైతం సానుభూతి పెరుగుతుందనేది కోడెల ఆలోచన. ఆలోచన వచ్చిందే త డవుగా నరసరావుపేటలోని తిరుమల డైరీ యజమానుల్లో ఒకరిని బీజేపీ టిక్కెట్టు ఇప్పిస్తానంటూ వారం రోజుల క్రితం
వారితో చర్చలు జరిపారు. వెంటనే అధిష్టానం వద్దకు వె ళ్లి నరసరావుపేట అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించాల్సిందిగా సూచించారు. దీని ద్వారా నరసరావుపేటలో గెలిచినా, ఓడినా తన చేతిలోనే ఉంటుందనేది ఒక భావన. పొత్తులో సీటు కోల్పోయి పార్టీ ఆదేశాల మేరకు సత్తెనపల్లికి వస్తున్న కోడెలకు అక్కడ కూడా ఆదరణ లభిస్తుందనేది ఆయన రాజకీయ ఎత్తుగడ. ఇటీవల తనను అధినేత చంద్రబాబు సత్తెనపల్లి వెళ్లమన్నారంటూ కార్యకర్తల సమావేశంలో మొసలి కన్నీరు కార్చి కార్యకర్తల వద్ద సానుభూతి పొందారు. అంతటితో ఆగకుండా తన అనుయాయులతో ఆత్మహత్యాయత్నాలు చేయించి రాష్ట్రవ్యాప్తంగా పార్టీలో కోడెలకు తీవ్ర అన్యాయం జరిగిపోతుందనే భావాన్ని కల్పించే యత్నం చేశారు. ఈ హైడ్రామాను గమనించిన చంద్రబాబు కోడెలను పిలిచి మందలించడంతో డ్రామాకు తెరపడింది.
ఇలాంటి చౌకబారు రాజకీయాలకు దిగినప్పుడల్లా దురదృష్టవశాత్తు పాపం కోడెల దొరికి పోతున్నారు. ఆయన సూచన మేరకు నరసరావుపేట అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తూ అధిష్టానం ప్రకటించగానే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తనకు అన్యాయం జరుగుతుందంటూ గగ్గోలు పెట్టారు. పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడేలా చేశారు. తాను అధిష్టానం వద్ద తేల్చుకుంటానంటూ హడావుడిగా హైదరాబాదు బయలుదేరి వెళ్లారు. ఈ విషయం కూడా ఆనోటా, ఈనోటా నాని బహిర్గతం కావడంతో కోడెల అటు నరసరావుపేట, ఇటు సత్తెనపల్లి నియోజకవర్గాల ప్రజలకు చులకనయ్యారు. ప్రస్తుతం కోడెల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది.