స్వేచ్ఛకు సంకెళ్లా..? | high drama on political punch website owner Arrested | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛకు సంకెళ్లా..?

Published Sat, Apr 22 2017 10:00 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

high drama on political punch website owner Arrested

► రాజధానిలో పోలీసుల అత్యుత్సాహం
► అధికార పార్టీ నేతల అండతో హడావుడి
► సామాన్యుడికి అన్యాయం జరిగినా నోరెత్తని ఖాకీలు
► రవికిరణ్‌ను అరెస్టుచేసి హైడ్రామా
► సోషల్‌ మీడియాలో లోకేష్‌ను కించపరిచారనే.

సామాన్యుడు ఫిర్యాదుచేస్తే చూద్దాంలే అంటారు. చూసీచూడనట్టు పోతారు. భూములు కాజేస్తున్నారని, ప్రశ్నించినవారి పొలాలు నాశనం చేస్తున్నారని చెప్పినా స్పందించరు. కానీ, చినబాబు విషయంలో మాత్రం ఆగమేఘాలపై పరుగులు పెడతారు మన రాజధాని పోలీసులు. శుక్రవారం రాత్రి తుళ్లూరు పోలీస్‌స్టేషన్, మందడం ఏఎస్పీ కార్యాలయం వద్ద ఖాకీల అత్యుత్సాహం, హైడ్రామా స్వామిభక్తిని చాటింది.

సాక్షి, అమరావతి బ్యూరో/తుళ్లూరు రూరల్‌ : నవ్యాంధ్ర రాజధాని అమరావతి అధికారపార్టీ నేతల దౌర్జన్యాలకు అడ్డాగా మారింది. టీడీపీ నేతల ఆగడాలకు ఖాకీలే సాక్షిగా మిగిలారు. రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి నేడు సోషల్‌మీడియాకు సంకెళ్లు వేయడం వరకు జరిగిన అనేక సంఘటనలే ఇందుకు నిదర్శనం. అమరావతి నిర్మాణానికి వేల ఎకరాలు కావాలంటూ రాజధానివాసుల మెడపై కత్తిపెట్టి మరీ బంగారంలాంటి వ్యవసాయ భూములు లాక్కున్నారు. జీవనాధారమైన భూములు పోగొట్టుకుంటే మేమెలా బతకాలని వ్యతిరేకించినా.. టీడీపీ పెద్దలు ఒప్పుకోలేదు. భయపెట్టి.. అక్రమ కేసులు బనాయించి.. ప్రశాంతంగా జీవించే స్వేచ్ఛను కాలరాశారు.

భూములు తీసుకున్న వారికి పరిహారం పేరుతో ఇస్తామన్న ప్లాట్లలోనూ తీవ్ర అన్యాయం చేశారు. హామీలనూ తుంగలో తొక్కి విలువైన ప్లాట్లను టీడీపీ నేతలు కొట్టేశారు. ఊరికి దూరంగా, పొలిమేరల్లో విలువలేని ప్లాట్లను కట్టబెట్టారు. ఆన్‌లైన్‌ లాటరీ పేరుతో రాజధాని పరిధిలోని సామాన్యులను మోసం చేశారు. జరుగుతున్న మోసం గురించి మాట్లాడితే.. ప్రభుత్వ పెద్దల కనుసైగతో పోలీసులు రంగంలోకి దిగి తరిమేసే పరిస్థితి నెలకొంది.

తమకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడే స్వేచ్ఛను పోలీసుల సాక్షిగా కాలరాశారు. కోర్టు ద్వారా స్టే తెచ్చుకుని సాగు చేసుకుంటున్న రైతులపైనా టీడీపీ నేతలు ప్రతాపం చూపారు. దౌర్జన్యంగా భూముల్లోకి ప్రవేశించి యంత్రాలతో పంటలను నాశనం చేయడం, తగులబెట్టి భయభ్రాంతులకు గురిచేసిన సంఘటనలూ అనేకం.

బాధితులపైనే ఎదురు కేసులు
సెంట్ల రూపంలో భూములు మాయం చేశారని బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఫిర్యాదు చేసిన బాధితులపైనే పోలీస్‌స్టేషన్లకు పిలిపించి, భయపెట్టి నోరెత్తకుండా చేసిన ఘనత ప్రభుత్వ పెద్దలకే దక్కింది. ఎన్నో ఏళ్ల నుంచి అనుభవంలో ఉన్న లంక, అసైన్డ్‌ భూములను కొట్టేసేందుకు చట్టాలను సైతం అతిక్రమిస్తున్నారు. అందరితో సమాన ప్యాకేజీకి లంక, అసైన్డ్‌ రైతులకు అర్హత లేదని వారి హక్కులను కాలరాస్తున్నారు.

ఏడాదిలో ఐదు పంటలు పండే భూములను మెట్టగా మార్చి రైతులను మోసం చేస్తున్నా.. ఏ అధికారి, పోలీసులు పట్టించుకోరు. బాధిత రైతులు ఫిర్యాదు చేసినా న్యాయం చేయాల్సిన పోలీసులకు అవి కఠినంగా వినిపిస్తాయి. నదిలోని ఇసుకను యంత్రాలతో తవ్వరాదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా.. ఏపీ రాజధాని అమరావతిలో మాత్రం ప్రభుత్వ పెద్దలకు వినిపించవు, కనిపించవు. తమకు జరుగుతున్న అన్యాయాలపై రైతులంతా ఏకమై చర్చించుకోవాలని పలుమార్లు ప్రయత్నించినా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు ఉక్కుపాదంతో తొక్కేశారు.

కళ్లముందే అనేక అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నా పోలీసులకు కనిపించలేదు. అనేక పోరాటాల ఫలితంగా ఏర్పడిన 2013 భూ సేకరణ చట్టాన్నే టీడీపీ పెద్దలు సవరణలు చేశారు. రాజధాని పరిధిలో సేకరణకు అవకాశమే లేదని తెలిసినా వరుసగా భూ సేకరణకు నోటిఫికేషన్లు ఇచ్చి రైతులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు చేపట్టారు.

రవికిరణ్‌ అరెస్టులో హైడ్రామా
రకరకాలుగా తమ బాధలను చెప్పుకుంటున్నా కళ్లుండీ చూడని ప్రభుత్వ పెద్దలు, అధికారులు భావ ప్రకటనా స్వేచ్ఛపైనా ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సోషల్‌ మీడియాలో సీఎం చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేష్‌బాబును కించపరుస్తూ పోస్టు పెట్టారని ఫిర్యాదుపై రవికిరణ్‌ అనే వ్యక్తిని అరెస్టుచేసి శుక్రవారం అర్ధరాత్రి వరకు చూపించలేదు. రైతులు తమకు జరిగిన అన్యాయాలు, అక్రమాలపై ఎన్నో ఫిర్యాదులు ఇచ్చినా స్పందించని పోలీసులు సీఎం చంద్రబాబు కుమారుడిపై ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం వెంటనే స్పందించారు.

24 గంటలు కూడా గడవకముందే రవికిరణ్‌ను అరెస్ట్‌ చేశారు. సామాన్య జనం ఇచ్చిన ఫిర్యాదులపై ఇదే వేగంతో పోలీసులు స్పందించకపోవడం స్థానికులను ఆగ్రహానికి గురిచేస్తోంది. రవికిరణ్‌ను అరెస్టుచేసి తుళ్లూరు స్టేషన్‌కు తీసుకురావాల్సిఉన్నా.. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు హైడ్రామా నడిపించారు. ఒక వ్యక్తిని అరెస్టు చేసి మీడియాని, ప్రజలను తప్పుదోవ పట్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అక్రమాలు, అన్యాయాలు, మోసాలకు అడ్డాగా మారుస్తుండటంపై స్థానిక ప్రజలు ప్రభుత్వ పెద్దలు, అధికారులపై మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement