ఆరోగ్యశాఖలో టెన్షన్‌..టెన్షన్‌! | high tension in health department | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశాఖలో టెన్షన్‌..టెన్షన్‌!

Published Mon, Mar 13 2017 9:53 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

high tension in health department

► నేడు ఎంపీహెచ్‌ఏలకు కౌన్సెలింగ్‌
► ఎస్‌ఎంఎస్‌లతో అభ్యర్థులకు సమాచారం
► బీసీ–ఈపై స్పష్టత ఇవ్వని అధికారులు 
► న్యాయం చేయాలంటున్న ‘మెరిట్‌ అభ్యర్థులు’
అనంతపురం మెడికల్‌ : 
వైద్య ఆరోగ్యశాఖలో 24 మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టుల నియామకాలకు సంబంధించి కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం డీఎంహెచ్‌ఓ కార్యాలయం సమావేశం హాల్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్‌లు పంపారు. అయితే ఇది విమర్శలకు తావిస్తోంది. ఏ శాఖలోనైనా పోస్టుల భర్తీ విషయంలో అధికారులు తప్పనిసరిగా పత్రికా ప్రకటనలు ఇస్తారు. కానీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం దీనికి తిలోదకాలిచ్చారు. ప్రభుత్వం సూచన, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో 24 మంది ఎంపీహెచ్‌ఏలను తొలగించి వారి స్థానంలో 24 మందికి గత ఏడాది డిసెంబర్‌లో పోస్టింగులు ఇచ్చిన విషయం తెలిసిందే. 
 
ప్రతిభకు పాతరపై వరుస కథనాలు
ఇందులో ప్రతిభకు పాతరేశారు. కనీసం కౌన్సెలింగ్‌ కూడా చేపట్టలేదు. కార్యాలయంలోని కొందరు అధికారులు ‘ముడుపులు’ తీసుకొని వారికి ఇష్టం వచ్చిన ప్రాంతానికి ఆర్డర్స్‌ ఇచ్చేశారు. దీనిపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. కలెక్టర్‌ కోన శశిధర్‌ స్పందించి కౌన్సెలింగ్‌ ద్వారా నియామకాలు చేపట్టాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణను ఆదేశించారు. ఇదే సమయంలో 14 ఏళ్ల పాటు పని చేసిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం వివాదాస్పదంగా మారింది. తొలగించబడిన ఉద్యోగులు ఆందోళన చేయడంతో జనవరి 10న జరగాల్సిన కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. ఆ తర్వాత తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సిదేనని తొలగించబడిన ఉద్యోగులు ఆందోళన చేశారు. దీంతో ఇటీవల వారందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. తాజాగా కౌన్సెలింగ్‌ వాయిదా పడిన వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది.  
 
నేడు కౌన్సెలింగ్‌ 

 

కలెక్టర్‌ కోన శశిధర్‌ నుంచి ఇప్పటికే ఆదేశాలు రావడంతో సోమవారం కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. ఈ 24 మంది జాబితాలో ఒక నాన్‌ లోకల్‌ అభ్యర్థి ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకు నాన్‌ లోకల్‌కు పోస్టులు ఇవ్వరాదు. పైగా 2003 నోటిఫికేషన్‌కు సంబంధించిన ఈ పోస్టుల విషయంలో బీసీ–ఈ రిజర్వేషన్‌ వర్తించదు. కానీ గతంలో జేసీ–2 ఖాజామొహిద్దీన్‌ వద్దకు ఫైల్‌ వెళ్లిన సమయంలో బీసీ–ఈకి చెందిన ఇద్దరు అభ్యర్థులను సైతం జాబితాలో ఉంచారు. ఈ విషయంలో కూడా కలెక్టర్‌ సీరియస్‌ కావడంతో వారిద్దరినీ విధుల్లోకి తీసుకునే విషయంలో వెనకడుగు వేశారు. కౌన్సెలింగ్‌కు వచ్చిన రోజే వారిద్దరినీ ‘మళ్లీ చూద్దాం’ అని వెనక్కు పంపారు. ఈ క్రమంలో తాజాగా చేపడుతున్న నియామకాల్లో బీసీ–ఈ అభ్యర్థులను అలాగే ఉంచారా? లేదా? అన్నది బయటకు తెలియకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగానే కౌన్సెలింగ్‌ తేదీకి సంబంధించి పత్రికా ప్రకటన కూడా ఇవ్వలేదని స్పష్టమవుతోంది. 
 
న్యాయం చేయండి
ఇటీవల 24 మంది ఎంపీహెచ్‌ఏలు విధుల్లో చేరిన విషయం తెలిసిందే. వీరి కంటే మెరిట్‌లో కొందరు అభ్యర్థులు ముందున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రజాప్రతినిధులను కలిశారు. కలెక్టర్‌ కోన శశిధర్‌ను సైతం గ్రీవెన్స్‌లో కలిసి విన్నవించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణను పలుమార్లు కలిసి తమకు న్యాయం చేయాలని కోరినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో తమ పరిస్థితి ఏంటంటూ వారు ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యలపై గతంలో జేసీ–2 ఖాజామొహిద్దీన్‌ దృష్టికి తీసుకెళ్తే ‘మీ కంటే మెరిట్‌ తక్కువగా ఉన్నవాళ్లు ఉంటే చెప్పండి. మీకు న్యాయం చేస్తా’మని చెప్పారని వారు గుర్తు చేస్తున్నారు. జిల్లాలో ఎంపీహెచ్‌ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అందులో మెరిట్‌ ప్రకారమే తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో సోమవారం జరిగే కౌన్సెలింగ్‌ వద్దకు రావడానికి కొందరు అభ్యర్థులు సిద్ధమయ్యారు. దీంతో ఏం జరుగుతుందన్న టెన్షన్‌ అధికారుల్లో నెలకొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement