health assistant jobs
-
గుడ్‌న్యూస్! తెలంగాణలో 1,520 ఉద్యోగాలకు నోటిఫికేషన్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కార్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 1,520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల నియామకానికి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 25 ఉదయం 10.30 గంటల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించనున్నట్టు నియామక బోర్డు నోటిఫికేషన్లో పేర్కొంది. సెప్టెంబర్ 19 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నోటిఫికేషన్‌లోని ముఖ్యమైన వివరాలు.. ► అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర నర్సెస్, మిడ్వైఫ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన సంస్థలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) ట్రైనింగ్ కోర్సు పాసై ఉండాలి. లేదంటే ఇంటర్ ఒకేషనల్ మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సును అభ్యసించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాది పాటు క్లినికల్ ట్రైనింగ్ చేసి ఉండాలి. ► అభ్యర్థుల వయసు 2023 జులై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి మూడేళ్లు చొప్పున వయో పరిమితిలో సడలింపు. ► హెల్త్ అసెస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి వేతన స్కేలు నెలకు రూ.31,040- 92,050 అప్లికేషన్ ఫీజు వివరాలు.. ► ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు రూ.500. దానికి అదనంగా ప్రాసెసింగ్ ఫీజు రూ.200ల చొప్పున చెల్లించాలి. ► ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లతో పాటు 18-44 ఏళ్లు కలిగిన నిరుద్యోగ కేటగిరీ అభ్యర్థులకు ప్రాసిసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ► హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లను ప్రాథమికంగా పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు. -
ఆరోగ్యశాఖలో టెన్షన్..టెన్షన్!
► నేడు ఎంపీహెచ్‌ఏలకు కౌన్సెలింగ్ ► ఎస్ఎంఎస్లతో అభ్యర్థులకు సమాచారం ► బీసీ–ఈపై స్పష్టత ఇవ్వని అధికారులు ► న్యాయం చేయాలంటున్న ‘మెరిట్ అభ్యర్థులు’ అనంతపురం మెడికల్ : వైద్య ఆరోగ్యశాఖలో 24 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల నియామకాలకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం డీఎంహెచ్ఓ కార్యాలయం సమావేశం హాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అభ్యర్థులకు ఎస్ఎంఎస్లు పంపారు. అయితే ఇది విమర్శలకు తావిస్తోంది. ఏ శాఖలోనైనా పోస్టుల భర్తీ విషయంలో అధికారులు తప్పనిసరిగా పత్రికా ప్రకటనలు ఇస్తారు. కానీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం దీనికి తిలోదకాలిచ్చారు. ప్రభుత్వం సూచన, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో 24 మంది ఎంపీహెచ్ఏలను తొలగించి వారి స్థానంలో 24 మందికి గత ఏడాది డిసెంబర్లో పోస్టింగులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రతిభకు పాతరపై వరుస కథనాలు ఇందులో ప్రతిభకు పాతరేశారు. కనీసం కౌన్సెలింగ్ కూడా చేపట్టలేదు. కార్యాలయంలోని కొందరు అధికారులు ‘ముడుపులు’ తీసుకొని వారికి ఇష్టం వచ్చిన ప్రాంతానికి ఆర్డర్స్ ఇచ్చేశారు. దీనిపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. కలెక్టర్ కోన శశిధర్ స్పందించి కౌన్సెలింగ్ ద్వారా నియామకాలు చేపట్టాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణను ఆదేశించారు. ఇదే సమయంలో 14 ఏళ్ల పాటు పని చేసిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం వివాదాస్పదంగా మారింది. తొలగించబడిన ఉద్యోగులు ఆందోళన చేయడంతో జనవరి 10న జరగాల్సిన కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సిదేనని తొలగించబడిన ఉద్యోగులు ఆందోళన చేశారు. దీంతో ఇటీవల వారందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. తాజాగా కౌన్సెలింగ్ వాయిదా పడిన వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. నేడు కౌన్సెలింగ్ కలెక్టర్ కోన శశిధర్ నుంచి ఇప్పటికే ఆదేశాలు రావడంతో సోమవారం కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఈ 24 మంది జాబితాలో ఒక నాన్ లోకల్ అభ్యర్థి ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకు నాన్ లోకల్‌కు పోస్టులు ఇవ్వరాదు. పైగా 2003 నోటిఫికేషన్‌కు సంబంధించిన ఈ పోస్టుల విషయంలో బీసీ–ఈ రిజర్వేషన్ వర్తించదు. కానీ గతంలో జేసీ–2 ఖాజామొహిద్దీన్ వద్దకు ఫైల్ వెళ్లిన సమయంలో బీసీ–ఈకి చెందిన ఇద్దరు అభ్యర్థులను సైతం జాబితాలో ఉంచారు. ఈ విషయంలో కూడా కలెక్టర్ సీరియస్ కావడంతో వారిద్దరినీ విధుల్లోకి తీసుకునే విషయంలో వెనకడుగు వేశారు. కౌన్సెలింగ్‌కు వచ్చిన రోజే వారిద్దరినీ ‘మళ్లీ చూద్దాం’ అని వెనక్కు పంపారు. ఈ క్రమంలో తాజాగా చేపడుతున్న నియామకాల్లో బీసీ–ఈ అభ్యర్థులను అలాగే ఉంచారా? లేదా? అన్నది బయటకు తెలియకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగానే కౌన్సెలింగ్ తేదీకి సంబంధించి పత్రికా ప్రకటన కూడా ఇవ్వలేదని స్పష్టమవుతోంది. న్యాయం చేయండి ఇటీవల 24 మంది ఎంపీహెచ్ఏలు విధుల్లో చేరిన విషయం తెలిసిందే. వీరి కంటే మెరిట్లో కొందరు అభ్యర్థులు ముందున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రజాప్రతినిధులను కలిశారు. కలెక్టర్ కోన శశిధర్‌ను సైతం గ్రీవెన్స్‌లో కలిసి విన్నవించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణను పలుమార్లు కలిసి తమకు న్యాయం చేయాలని కోరినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో తమ పరిస్థితి ఏంటంటూ వారు ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యలపై గతంలో జేసీ–2 ఖాజామొహిద్దీన్ దృష్టికి తీసుకెళ్తే ‘మీ కంటే మెరిట్ తక్కువగా ఉన్నవాళ్లు ఉంటే చెప్పండి. మీకు న్యాయం చేస్తా’మని చెప్పారని వారు గుర్తు చేస్తున్నారు. జిల్లాలో ఎంపీహెచ్ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అందులో మెరిట్ ప్రకారమే తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో సోమవారం జరిగే కౌన్సెలింగ్ వద్దకు రావడానికి కొందరు అభ్యర్థులు సిద్ధమయ్యారు. దీంతో ఏం జరుగుతుందన్న టెన్షన్ అధికారుల్లో నెలకొంది.