సమావేశం వాయిదా నోటీసులు అందుకున్న వార్డు సభ్యులు
పశ్చిమగోదావరి , ఏలూరు రూరల్: ఏలూరు మండలం వెంకటాపురం పం చాయతీలో మంగళవారం హైడ్రామా నడిచింది. మధ్యాహ్నం 2 గంటలకు పంచాయతీ కార్యాయలంలో పాలకవర్గ సమావేశం జరగాల్సి ఉంది. అయితే సమావేశానికి హాజరుకా వాల్సిన మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడుకు మద్దతు ఇచ్చిన వార్డు సభ్యులను టీడీపీ నాయకులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వదంతులు హల్‌చల్ చేశాయి. ఈ విషయాన్ని కొందరు వార్డు సభ్యులు స్వయంగా మీడియాకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో గ్రామంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో మధ్యాహ్నం 1 గంట సమయంలో సర్పంచ్ చెరుకూరి దీప్తిఉష స మావేశానికి హాజరుకావడం లేదంటూ ఇన్‌చార్జి కార్యదర్శి రత్నం సమావేశాన్ని వాయిదా వేశామని వెల్లడించారు. దీంతో అప్పటికే వచ్చిన అప్పలనాయుడు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేసి వెనుదిరిగారు. గంట ముందు వాయిదా నోటీసు అందిస్తారా అంటూ ప్రశ్నించారు.
పరువు కోసం పాకులాట
టీడీపీ నుంచి బహిష్కృతుడైన రెడ్డి అప్పలనాయుడుకు మద్దతుగా 9 మంది వార్డు సభ్యులు పార్టీకి రాజీనామా చేయడం ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జికి సవాల్‌గా మారింది. గ్రామంలో 3.27 ఎకరాల్లో ఏర్పాటుచేసే లే–అవుట్, కొత్తగా నిర్మించతలపెట్టిన మూడు అపార్ట్‌మెంట్లకు అనుమతి ఇస్తూ అజెం డాలో పేర్కొన్న అంశాలకు తీర్మానాలు ఇవ్వాలని గతంలో ఎమ్మెల్యే వార్డు సభ్యులకు సూచించినట్టుగా తెలిసింది. అయితే వీటిని పాలకవర్గ సమావేశంలో అప్పలనాయుడు వర్గం తిరస్కరించేందుకు సిద్ధమయ్యింది. దీనిని గుర్తించిన ఎమ్మెల్యే వర్గీయులు తీర్మానం వీగిపోతే పరువు పోతుందనే ఆలోచనతో సభ్యులను కిడ్నాప్ చేస్తామంటూ బెదిరించారని పలువురు చెబుతున్నారు.
చివరకు సర్పంచ్‌ను సమావేశానికి వెళ్లవద్దంటూ ఆదేశించి సమావేశాన్ని వాయిదా వేయించారని సభ్యులు అంటున్నారు. పాలకవర్గ సభ్యులు ప్రమేయం లేకుండా గ్రామంలో తీర్మానాలు, అభివృద్ధి పనులు తమ వర్గీయులకే ఎమ్మెల్యే బుజ్జి వర్గం కేటాయిస్తోందని అప్పలనాయుడు వర్గం ఆరోపిస్తోంది. మొత్తం 20 మంది వార్డు సభ్యుల్లో 9 మంది అప్పలనాయుడుకు మద్దతు ప్రకటించారు. 8 మంది ఎమ్మెల్యే వర్గం వైపు ఉన్నట్టుగా తెలుస్తోంది. మిగిలిన ముగ్గురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు.
Comments
Please login to add a commentAdd a comment