మయాజేశారు | higher education aims to set up all universities | Sakshi
Sakshi News home page

మయాజేశారు

Published Sun, Dec 1 2013 4:06 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

higher education aims to set up all universities

ఉద్యోగుల నియామకం విషయంలో పొరుగింటి పుల్లకూర రుచి అనే చందాన వ్యవహరిస్తున్నారు విక్రమసింహపురి యూనివర్సిటీ  పెద్దలు. జిల్లాలో ప్రతిభావంతులే లేనట్టుగా కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల వారికి ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతా నిబంధనల ప్రకారమే  అంటూ అధికారులు చెబుతున్నా.., వర్సిటీ అక్రమాలకు నిలయంగా మారిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూ ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి.
 
 సాక్షి, నెల్లూరు: ఉన్నత విద్యను అందరికీ చేరువ చేయాలనే మహోన్నతాశయంతో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతి జిల్లాలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నెల్లూరులో విక్రమసింహపురి పేరుతో యూనివర్సిటీ ఏర్పాటైంది. బాలారిష్టాలు దాటకముందే ఈ వర్సిటీలో అక్రమాలకు తెరలేచిందనే అప్పట్లోనే ఆరోపణలు వినిపించాయి. ఓ వైపు వసతుల లేమి, మరోవైపు తగినంతమంది విద్యార్థులు లేకున్నా పోస్టుల భర్తీ చకాచకా జరిగిపోతోంది.
 
 ఈ క్రమంలో రాజకీయ నాయకుల అండతో విశ్వవిద్యాలయ అధికారుల చేతివాటం ఎక్కువైనట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అన్నీ అర్హతలున్నప్పటికీ ఇంటర్వ్యూల సమయంలో కాల్ లెటర్లు అందలేదని కొందరు కోర్టును ఆశ్రయించిన సందర్భాలూ ఉన్నాయి. గతంలో పనిచేసిన వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్ జిల్లాలోని నిరుద్యోగులకు అవకాశం ఇవ్వలేదని ఉన్నత విద్యావంతులు సైతం బహిరంగ ఆరోపణలకు దిగారు. ప్రస్తుతం వర్సిటీలోని వివిధ విభాగాల్లో 20 మంది శాశ్వత ప్రాతిపదికపై పనిచేస్తున్నారు. వీరిలో నెల్లూరుకు చెందిన వారు నలుగురు, చిత్తూరుకు చెందిన వారు ఆరుగురు, ప్రకాశం జిల్లా వాసి ఒకరు, గుంటూరు వాసులు ముగ్గురు, అనంతపురానికి చెందినవారు నలుగురు ఉన్నారు.
 
 గతంలో కడప జి ల్లాకు చెందిన వ్యక్తి వర్సిటీ రిజిస్ట్రార్‌గా వ్యవహరించారు. అప్పట్లో జరిగిన నియామకాల్లో ఆయన కీలకపాత్ర పోషించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో స్టాటిస్టిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టును కడప వ్యక్తికి, కెమిస్ట్రీ ప్రొఫెసర్ పోస్టును అనంతపురం వాసికి కట్టబెట్టడంలో అక్రమాలు జరిగాయని వివాదం చెల రేగింది. కేవలం ఓపెన్ కేటగిరిలో ఉన్న పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నారని, రిజర్వేషన్ కేటగిరిలో ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడంపై విద్యార్థి సం ఘాల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ కేటగిరిలో ఉన్న పోస్టులకు పోటీ ఉండటంతో పాటు ఎంతైనా చెల్లించేందుకు అభ్యర్థులు ముందుకొస్తారనే భావనతో ఈ విధంగా ముందుకుసాగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
 
 మళ్లీ మళ్లీ నిరాశే
 వర్సిటీలో ఉద్యోగ అవకాశాల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న జిల్లా వాసులకు మళ్లీమళ్లీ నిరాశే ఎదురవుతోంది.  ప్రతిసారి పొరుగు జిల్లాల వా రికే ప్రాధాన్యం లభిస్తోంది. 2012లో వీసీ, రిజిస్ట్రార్  బాధ్యతలను జిల్లా వాసులు చేపట్టారు. ఇకనైనా మార్పు వస్తుందని అందరూ భావించారు. అయితే అక్టోబర్‌లో జరిగిన ఇంటర్వ్యూల్లో 3 అసిస్టెంట్ ప్రొఫెసర్, 2 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు మాత్రమే జిల్లా వాసికి దక్కింది. మిగిలిన వాటిలో 2 చిత్తూరు వాసులకు, 2 గుంటూరుకు చెందిన వారు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం వర్సిటీలోని వివిధ విభాగాల్లో 8 ప్రొఫెసర్, 13 అసోసియేట్ ప్రొఫెసర్, 13 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇంట ర్వ్యూలు జరుగుతున్నాయి.
 
 నవంబర్ 12వ తేదీన ప్రారంభమైన ఇంట ర్వ్యూల ప్రక్రియ 28వ తేదీ వరకు కొనసాగింది. యూజీసీ నిబంధనల ప్రకారమే ఇంటర్వ్యూలు కొనసాగా యని వర్సిటీ అధికారులు చెబుతున్నప్పటికీ, అంతా అబద్ధమని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వర్సిటీలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న వారికి కూడా ఇంటర్వ్యూ కాల్‌లెటర్లు పంపలేదని చెబుతున్నారు. ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు నిర్ణయించినట్లు, ఈ అక్రమాల్లో ఉన్నతాధికారులతో పాటు రాజకీయ నాయకులకు హైదరాబాద్ స్థాయిలో వాటాలున్నట్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. విశ్వవిద్యాలయం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ జరిగిన నియామకాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
 
 నిబంధనల ప్రకారమే : ప్రొఫెసర్ కె.నాగేంద్రప్రసాద్, రిజిస్ట్రార్
 యూజీసీ నిబంధనల మేరకే ఇంటర్వూలు నిర్వహిస్తున్నాం.అక్రమాలకు తావులేదు. మెరిట్ ప్రాతిపదికన ఎంపికలు జరుగుతాయి. తాత్కాలికంగా పనిచేస్తున్న అభ్యర్థులకు ఎటువంటి అన్యాయం జరగదని నా అభిప్రాయం.
 
 అధిక భాగం అక్రమ నియామకాలే : ఈశ్వర్, ఏబీవీపీ నెల్లూరు, ప్రకా శం జిల్లాల ఆర్గనైజింగ్ సెక్రటరీ
 వీఎస్‌యూ ఉద్యోగ నియామకాల్లో అధిక భాగం అక్రమాలు జరుగుతున్నా యి. స్థానికులకు సరైన స్థానం కల్పిం చడం లేదు. ఇతర జిల్లాల వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థుల పోస్టుల భర్తీ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇందుకు మూడేళ్లుగా వెలువడిన నోటిఫికేషన్లే సాక్ష్యం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement