బొబ్బిలి, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులు ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నాయి. బుధ, గురువారాల్లో రహదారుల దిగ్బంధానికి ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఇందుకోసం జిల్లా నేతలు, కార్యకర్తలు భారీ స్థాయి లో సమాయత్తమవుతున్నారు. రాష్ర్ట విభజన ప్రక్రియ ప్రకటన వెలువడినప్పటి నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్న ఆ పార్టీ శ్రేణులు ఈ నెల 6, 7 తేదీల్లో జిల్లా సరిహద్దులతో పాటు, జాతీయ రహదారులు, ప్రధాన రహదారులను దిగ్బంధించేందుకు సిద్ధమవుతున్నాయి. పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో మంగళవారం బొబ్బిలి కోటలో సమావేశం నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు చర్చించారు. ఆందోళన కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, రెండు రోజుల కార్యక్రమం కాబట్టి సమన్వయంతో పక్కాగా చేయాలని సూచించారు.
విజయనగరం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 అమలులో ఉండడంతో ఈ ఆందోళన కార్యక్రమాలు ఎలా చేయాలి అన్న అంశంపై విజయనగరం, నెల్లిమర్ల, ఎస్.కోట నియోజకవర్గ సమన్వయకర్తలు గురాన అయ్యలు, సింగుబాబు, బోకం శ్రీనివాస్, డాక్టరు గేదెల తిరుపతిరావు, వేచలపు చిన రామునాయుడులతో చర్చించారు. విశాఖ జిల్లాల్లో ఉండే నియోజకవర్గాల సరిహద్దుల వద్ద వాహనాల రాకపోకలను నిలిపివేసి నిరసనలు తెలియజేయాలని సూచించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లంతా ఒకే దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ విజయవంతం చేయాలని సుజయ్ సూచించారు. ఇతర మార్గాల్లోంచి వాహనాలు రాకుండా చూడాలన్నారు. రహదారుల దిగ్బంధం సందర్భంగా వంటావార్పుల తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ జిల్లా సరిహద్దు తగరపువలస సమీపంలో ఆందోళన కార్యక్రమాన్ని చేస్తామని నెల్లిమర్ల నాయకులు తెలి పారు. బొబ్బిలి, పార్వతీపురం పోలీస్ సబ్ డివి జన్‌లకు సంబంధించి పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో జాతీయ, రాష్ర్ట రహదారులున్నందున పాచిపెంట మండలం పి కోనవలస, కోటిపాం, ఖడ్గవలస, చినమేరంగి జంక్షన్‌ల వద్ద రహదారులను దిగ్బంధిస్తామని ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల విజయరామరాజు, రాయల సుందరరావు, గరుడబిల్లి ప్రశాంత్‌లతో పాటు గ్రంథాలయ మాజీ చైర్మన్ దత్తి లక్ష్మణరావు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గుల్లిపల్లి సుదర్శనరావులు వివరించారు. పార్వతీపురం నియోజకవర్గంలో ఒడిశా నుంచి వచ్చిన వాహనాలు, శ్రీకాకుళం నుంచి వచ్చినవి అడ్డుకోవాలని నిర్ణయించారు.
వెంకంపేట గోళీలు, నవిరి కాలనీ, సీతానగరం వంతెనల వద్ద ఈ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. ఈ నియోజకవర్గం సమన్వయకర్తలు కొయ్యాన శ్రీవాణి, జమ్మాన ప్రసన్నకుమార్, గర్భాపు ఉదయభానులకు వీటిని ఎలా నిర్వహించాలో సుజయ్ సూచించారు. చీపురుపల్లి నియెజకవర్గానికిసంబంధించి రాజాం, శ్రీకాకుళం అనుసంధానమైన రహదారులపై ఆందోనళ నిర్వహించనున్నట్టు నియోజకవర్గ ఇన్‌చార్జ్ సిమ్మినాయుడు, తుమ్మగంటి సూరినాయుడు వివరించారు. సమావేశంలో ఎస్సీ విభాగం జిల్లా కన్వీనరు ఆదాడ మోహనరావు, బొబ్బిలి నాయకులు మాజీ జెడ్పీటీసీలు డాక్టరు బేతనపల్లి శివున్నాయుడు, తెంటు సత్యంనాయుడు తదితరులు పాల్గొన్నారు.
విజయమ్మ ఆరా...
రెండు రోజుల పాటు నిర్వహించినున్న రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి జిల్లా నాయకులు ఎలా సమాయత్తమవుతున్నారన్న విషయమై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం ఆరా తీశారు. ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావుతో ఫోన్‌లో మాట్లాడి ఏర్పాట్లు గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని అన్ని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు సూచించారు. మంత్రుల కమిటీ సమావేశాల జోరును పెంచి, విభజన ప్రక్రియను వేగవంతం చేస్తోందని, అందువల్ల సమెక్యం కోసం పోరాడే మనం ఆందోళనలను మరింత ఉధృతం చేయాలన్నారు. పండగైనా ఉద్యమాలు చేయడానికి ఎవరూ వెనుకంజ వేయకూడదని సూచించారు.
విభజన ప్రక్రియను అడ్డుకొని తీరుతాం
రాష్ట్ర విభజన ప్రక్రియను అన్ని విధాల అడ్డుకుంటామని, అందుకు శాయశక్తులా కృషి చేస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటులో శీతాకాల సమావేశాల్లో బిల్లును పెట్టి రాష్ట్రాన్ని విడగొట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామని తెలి పారు. మంత్రుల కమిటీలతో ప్రక్రియను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పావులను కదుపుతోందని, దానికి అడ్డుకట్టవేయడానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 48 గంటల పాటు రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చిందని తెలిపారు. ఆర్టీసీ డిపోల నుంచి బస్సులను తీసి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు. ఇతర ప్రాంతాల నుంచి వాహనాల రాకపోకలకు అంతరాయం ఉంటుంది కాబట్టి విద్యాసంస్థలు సహకరించాలన్నారు.