అర్వపల్లి, న్యూస్‌లైన్: నకిరేకల్-మహబూబాబాద్ మధ్య రోడ్డు నిర్మాణ పనుల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. జిల్లా మీదుగా సిరోంచ-రేణిగుంట జాతీయ రహదారిని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర రహదారిగా ఉన్న ఈ రోడ్డును జాతీయ రహదారిగా మార్చేందుకు ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసింది. సిరోంచ నుంచి రేణిగుంట వరకు వెళ్లే 643 కి.మీ జాతీయ రహదారి జిల్లామీదుగా వెళుతుంది. సిరోంచ-మహదేవపురం-పరకాల- ఆత్మకూరు- మల్లంపల్లి- నర్సంపేట- మహబూబాబాద్ నుంచి జిల్లాలోని బిక్కుమళ్ల- ఎర్రపహడ్-మద్దిరాల క్రాస్‌రోడ్డు- కొత్తగూడెం- కర్విరాల- తుంగతుర్తి- వెలుగుపల్లి- అర్వపల్లి మీదుగా దారిని నిర్ణయించారు. అలాగే గతంలో అర్వపల్లి నుంచి అడివెంల ఎక్స్‌రోడ్డు, కుంచమర్తి, రామచంద్రాపురం, మూసీ ప్రాజెక్టు (పక్క నుంచి) వల్లభాపురం, పాలెం మీదుగా నకిరేకల్‌కు రహదారిని నిర్మించాలని నిర్ణయించారు.
మూసీ ప్రాజెక్టు నుంచి దారి అనుమానమే
సిరోంచ-రేణిగుంట జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా జిల్లాలోని మూసీ ప్రాజెక్టు పక్క నుంచి వంతెన నిర్మించి నకిరేకల్‌కు రోడ్డు వేయాలని నిర్ణయించగా వారం రోజుల కిందట జాతీయ రహదారులకు సంబంధించి ఢిల్లీ నుంచి ఇంజినీర్ల బృందం మూసీ ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించినట్టు తెలిసింది. అయితే మూసీ ప్రాజెక్టు సమీపంలో నుంచి వంతెన నిర్మిస్తే వరదతో భవిష్యత్‌లో ఇబ్బం దులు తలెత్తే అవకాశం ఉందని, దారిని మా ర్చాలని ఇంజినీర్ల బృందం సూచనప్రా యం గా ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అర్వపల్లి నుంచి అడివెంల, తిమ్మాపురం మీదుగా సూర్యాపేట నుంచి వెళ్తున్న హైదరాబాద్ - విజయవాడ హైవేకి కలపాలని సూచనప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ రోడ్డు ఎక్కడి నుంచి వెళ్లాలనే విషయమై త్వరలో ఒక నిర్ణయం వెలువడనుంది.
రోడ్డు మార్చాలని వినతి
సిరోంచ-రేణిగుంట జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి అర్వపల్లి నుంచి జాజిరెడ్డిగూడెం-వంగమర్తి మూసీ వాగు మీదుగా మాదారం, కొండారం, కడపర్తిల నుంచి నకిరేకల్‌కు జాతీయ రహదారి నిర్మించాలని తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాల ప్రజలు కోరుతున్నారు. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు జిల్లా కేంద్రమైన నల్లగొండకు వెళ్లాలంటే సూర్యాపేట మీదుగా నకిరేకల్ నుంచి వెళ్లాల్సి వస్తుంది. ఇలా అయితే 95కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే జాజిరెడ్డిగూడెం, వంగమర్తి మీదుగా నల్లగొండకు 65కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంది. ఇలా అయితే 30కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీనికితోడు జాతీయ రహదారి నిర్మాణంతో మారుమూల గ్రామాలు అభివృద్ధి చెందనున్నాయి.
దీనికి తోడు మూసీ వాగులో జాజిరెడ్డిగూడెం-వంగమర్తి మధ్య వంతెన నిర్మాణం జరిగితే తుంగతుర్తి, నకిరేకల్ రెండు నియోజకవర్గాలకు దగ్గర దారి ఏర్పడుతుంది. ప్రస్తుతం శాలిగౌరారం మండల ప్రజలు తుంగతుర్తికి రావాలంటే సూర్యాపేట మీదుగా వస్తూ ఇబ్బం దులు పడుతున్నారు. వంతెన నిర్మాణంతో రెండు నియోజకవర్గాల ప్రజల వ్యయ ప్రయాసలు తగ్గుతాయి. జాతీయ రహదారుల అధికారులు ఈరోడ్డు నిర్మాణంపై సర్వే జరిపి తగు నిర్ణయం తీసుకోవాలనిప్రజలు కోరుతున్నారు.