దేవాలయం ముందు భాగంలో 1860లో నిర్మించిన ధ్వజస్తంభం
సాక్షి, పెరవలి (పశ్చిమ గోదావరి): మండలంలోని అన్నవరప్పాడులో పరశురాముడి ఆలయం దేశంలోనే అరుదైనది. ఇలాంటి ఆలయం కోల్‌కతలో ఒకటి, ఆ తర్వాత మళ్లీ అన్నవరప్పాడులోనే ఉంది. ఈ ఆలయం 13వ శతాబ్దంలో వెలిసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఇక్కడ పరశురాముడు పాలరాతి విగ్రహంలో ఉండగా, విగ్రహం చూస్తే మాత్రం బుద్ధుడు స్ఫురించడం విశేషం. పెద్దపెద్ద చెవులతో ఈ విగ్రహం ఉంటుంది. ఈ ఆలయంలో వివాహాలు చేసుకున్నవారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, పిల్లాపాపలతో జీవిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయంలో ప్రత్యేక ఉత్సవం అంటూ లేకున్నా ఏటా శ్రీరామనవమికి రథోత్సవం నిర్వహిస్తారు. అయితే ఈ ఆలయాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఆ దిశగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వం స్పందించాలి
మా తాత ముత్తాతల నుంచి ఆలయంలో అర్చకులుగా సేవలు అందిస్తున్నాం. ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధిచెందింది. అయితే ప్రభుత్వ ఆదరణ లేక అభివృద్ధి చెందలేదు. ఇటువంటి అరుదైన దేవాలయాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది.
–వెలవలపల్లి విశ్వనాథం, అర్చకులు, అన్నవరప్పాడు
Comments
Please login to add a commentAdd a comment