Historic Temple
-
అరుదైన దేవాలయం.. ఆదరణేదీ?
సాక్షి, పెరవలి (పశ్చిమ గోదావరి): మండలంలోని అన్నవరప్పాడులో పరశురాముడి ఆలయం దేశంలోనే అరుదైనది. ఇలాంటి ఆలయం కోల్‌కతలో ఒకటి, ఆ తర్వాత మళ్లీ అన్నవరప్పాడులోనే ఉంది. ఈ ఆలయం 13వ శతాబ్దంలో వెలిసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఇక్కడ పరశురాముడు పాలరాతి విగ్రహంలో ఉండగా, విగ్రహం చూస్తే మాత్రం బుద్ధుడు స్ఫురించడం విశేషం. పెద్దపెద్ద చెవులతో ఈ విగ్రహం ఉంటుంది. ఈ ఆలయంలో వివాహాలు చేసుకున్నవారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, పిల్లాపాపలతో జీవిస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయంలో ప్రత్యేక ఉత్సవం అంటూ లేకున్నా ఏటా శ్రీరామనవమికి రథోత్సవం నిర్వహిస్తారు. అయితే ఈ ఆలయాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఆ దిశగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించాలి మా తాత ముత్తాతల నుంచి ఆలయంలో అర్చకులుగా సేవలు అందిస్తున్నాం. ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధిచెందింది. అయితే ప్రభుత్వ ఆదరణ లేక అభివృద్ధి చెందలేదు. ఇటువంటి అరుదైన దేవాలయాన్ని కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది. –వెలవలపల్లి విశ్వనాథం, అర్చకులు, అన్నవరప్పాడు -
రామప్పకు పొంచి ఉన్న ముప్పు
- పునాదులను తొలుస్తున్న చీమలు - శాండ్బాక్స్ టెక్నాలజీపై కాకతీయ కట్టడాలు - నిర్లక్ష్యపు నీడలో చారిత్రక ఆలయం సాక్షి, హన్మకొండ: విశిష్టమైన కాకతీయ కట్టడాలకు, అద్భుత శిల్పకళా సంపదకు నెలవైన రామప్ప ఆలయాన్ని నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. చాపకింద నీరులా చీమలు ఈ ఆల యానికి చేటు చేస్తున్నాయి. ఆదిలోనే చీమల దండుకు అడ్డుకట్ట వేయకపోతే ఆలయ పునాదులు కదిలే ప్రమాదం ఉంది. వరంగల్ కేం ద్రంగా తెలుగు ప్రాంతాలను ఎనిమిది వందల ఏళ్ల క్రితం కాకతీయులు పాలించారు. వీరి కాలంలో గొలుసుకట్టు చెరువులతోపాటు వేయిస్తంభాల గుడి, రామప్ప ఆలయం , కీర్తితోరణాలు వంటి అనేక రాతి కట్టడాలను అద్భుతంగా నిర్మించారు. స్థానికంగా ఉండే భౌగోళిక పరిస్థితుల్లో ఎక్కువ కాలం కట్టడాలు నిలిచి ఉండేలా నాటి నిర్మాతలు జాగ్రత్తలు పాటించారు. 8 వందల ఏళ్ల క్రితమే శాండ్బాక్స్ పద్ధతి ద్వారా నిర్మాణాలు చేపట్టారు. వరంగల్ జిల్లాలో విస్తారంగా ఉన్న నల్లరేగడి నేలలో భారీ రాతికట్టడాలు కుంగి పోకుండా ఉండేందుకు ఈ పద్ధతిని అవలంభించారు. సంప్రదాయ పద్ధతికి భిన్నంగా పునాదుల నుంచి బలమైన శిలలను కాకుండా ఇసుకతో నింపారు. ఈ ఇసుక పునాదిపై రాళ్లను పేర్చుకుంటూ పోయి వేయిస్తంభాలగుడి, రామప్ప ఆలయాలను నిర్మించారు. ఎనిమిది వందల ఏళ్ల తర్వాత నేటికీ ఈ ఆలయాలు నిలిచి ఉండటానికి ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీ ప్రధాన కారణం. చీమల కారణంగా ఈ కట్టడాలకు ప్రమాదం పొంచి ఉంది. రామప్పకు ముప్పు వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో రామప్పగుడిగా పిలవబడే రామలింగేశ్వరాలయం ఉంది. కాకతీయుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యానికి రామప్ప ఆలయం నిదర్శనం. ఈ ఆలయంలో వేలాది శిల్పాలు ఉన్నాయి. ముఖ్యంగా మదనికలు, నాగిని శిల్పాలు చూసేందుకు విదేశీ యూత్రికులు వస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఆలయానికి చీమల బెడద పట్టుకుంది. నిర్మాణంలో ఉపయోగించిన శిలల మధ్య చీమలు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఈ చీమల కారణంగా శాండ్ బాక్స్ టెక్నాలజీ ప్రకారం నిర్మించిన ఆలయ పునాదుల్లో ఉపయోగించిన ఇసుక బయటకు వచ్చి పేరుకుపోతుంది. ఇలా పేరుకుపోయిన ఇసుకను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు తప్పితే చీమల నివారణకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం లేదు. చీమల కారణంగా పునాదుల్లో ఇసుక బయటకు రావడం వల్ల ఆలయ పటిష్టతకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే.. రామప్ప ఆలయానికి ఇరువైపులా కాటేశ్వరాలయం, కామేశ్వరాలయం ఉన్నాయి. చీమల కారణంగా కామేశ్వరాలయం పునాదులు కుంగిపోవడంతో ఆలయం ఒకే వైపు నకు ఒరిగిపోయింది. ప్రమాదభరితంగా మారడంతో ఆలయాన్ని తొలగించారు. రామప్ప ఆలయంలో చీమల సంచారంపై నిర్లక్ష్యం వహిస్తే పునాదుల్లో ఉన్న ఇసుక నిల్వలు తగ్గిపోయేందుకు అవకాశముంది. దీని కారణంగా ఆలయం ప్రమాదంలో పడుతుందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆలయం పైకప్పు కురుస్తోంది. అయినా పురావస్తుశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.