
గుంతకల్లు రూరల్: వ్యాపారరీత్యా ఊళ్లు తిరుగుతున్న నా భర్త హెచ్‌ఐవీకి గురయ్యారు. ఆయన ద్వారా ఆ జబ్బు నాకూ సోకింది. విషయం బయటపడిన తర్వాత తప్పంతా నాదేనన్నట్లు మాట్లాడారు. నన్ను ఇంటి నుంచి గెంటేశారు. అప్పటికే మాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. ఏడాది పాటు పుట్టింటిలో తలదాచుకున్నా. తన చివరి క్షణాల్లో జరిగిన వాస్తవాన్ని కుటుంబసభ్యులకు చెప్పి ఇందులో భార్య తప్పేమీ లేదని నా భర్త నోరు విప్పాడు. దీంతో మళ్లీ నన్ను అత్తింటివారు ఆదరించారు. ఆ తర్వాత నెలలోనే నా భర్త కన్నుమూశాడు.
వృద్ధులైన అత్తామామలతో పాటు పిల్లల పోషణ భారం నాపై పడింది. ఇంట్లో నుంచి బయటకు వస్తే ఇరుగుపొరుగు వారు అంటున్న మాటలు ఎంతో బాధించాయి. చివరకు నా కూతుళ్ల పెళ్లిళ్లనూ చెడగొట్టారు. ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది. అయితే సమస్యకు ఇది పరిష్కారం కాదని భావించాను. ఎవరు ఎన్ని మాటలు అన్నా పట్టించుకోకుండా బతకడం నేర్చుకున్నా. గ్రామైక్య సంఘం ద్వారా పొందిన రుణాలతో చిన్నపాటి వ్యాపారం మొదలు పెట్టాను. అప్పులు తీర్చేశాను. నా ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేశాను. కొడుకును ఎంబీఏ వరకు చదివించాను. - కామాక్షమ్మ (పేరుమార్పు)