గమ్మత్తు | Hoax | Sakshi
Sakshi News home page

గమ్మత్తు

Published Sat, Nov 22 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

గమ్మత్తు

గమ్మత్తు

అనంతపురం క్రైం : జిల్లాలో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లు ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారు. కొంత మంది సిబ్బందితో పనులు చక్కబెట్టిస్తూ జిల్లా కేంద్రాన్ని వీడటం లేదు. సొంత వ్యాపారాలు, ఆట పాటల్లో మునిగి తేలుతూ నిర్లక్ష్యపు మత్తులో జోగుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వానికి మంచి ఆదాయం చేకూర్చే వాటిలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ఒకటి. ప్రభుత్వం ఈ శాఖపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మద్యం అమ్మకాలను పెంచాలని ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తోంది.

ఈ మేరకు అధికారులు బ్రాందీ షాపుల యాజమాన్యాలకు లక్ష్యాలు పెట్టి మరీ అమ్మకాలు చేయిస్తున్నారు. బెల్టుషాపులు ఎత్తేశామని బయటకు చెబుతూనే.. లోలోన అమ్మిస్తున్నారు. ఇంత చేస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో లక్ష్యాలు చేరడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం నాటుసారా, అక్రమ మద్యమే. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పల్లెల్లో నాటుసారా, కర్ణాటక మద్యం ఏరులై పారుతోంది.

కొందరు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ల తీరు వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్లు విమర్శలున్నాయి. వీరు వివిధ వ్యాపకాలతో స్టేషన్లకు రెగ్యులర్‌గా వెళ్లడం మానేశారు. చుట్టపుచూపుగా వారానికోసారో, రెండుసార్లో వెళ్తున్నారు. దీంతో వారి సిబ్బంది కూడా ‘ఆడిందే ఆట పాడిందే పాట’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.

 జిల్లా కేంద్రంలోనే మకాం
 జిల్లా వ్యాప్తంగా 18 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. అనంతపురం ఈఎస్ పరిధిలో అనంతపురం, శింగనమల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ, కణేకల్, రాయదుర్గం. పెనుకొండ ఈఎస్ పరిధిలో పెనుకొండ, హిందూపురం, కదిరి, తనకల్లు, పుట్టపర్తి, చెన్నేకొత్తపల్లి, మడకశిర, కళ్యాణదుర్గం, కంబదూరు, ధర్మవరంలో స్టేషన్లు ఉన్నాయి. వీరిలో కనేకల్లు, రాయదుర్గం, తాడిపత్రి, శింగనమల, గుత్తి, మడకశిర, పుట్టపర్తి, కదిరి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లు జిల్లా కేంద్రంలోనే నివాసం ఉంటున్నారు.

రాయదుర్గం, మడకశిర, కదిరి తదితర ప్రాంతాలకు పోయి రావాలంటే దాదాపు సాయంత్రం అవుతుంది. అక్కడికి వెళ్లి వారి పరిధిలోని అక్రమ మద్యం, నాటుసారా తయారి తదితర వాటిని అరికట్టే చర్యలు ఎప్పుడు చేపడతారని కింది స్థాయి ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు వీరు పని చేస్తున్న ప్రాంతాలకు వెళ్లే ముందుగా కొందరు సమాచారం చేరవేస్తే.. ఆ సమయానికి సిబ్బంది అక్కడికి వెళ్లి సిద్ధంగా ఉంటారు తప్ప మామూలుగా ఆవైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఇన్‌స్పెక్టర్లు రాకపోవడంతో సిబ్బంది కూడా స్టేషన్ దాటి బయటకు వెళ్లరు. ఇటీవల రాయదుర్గం, కంబదూరు, మడకశిర ప్రాంతాల్లో ఎక్సైజ్ ఉన్నతాధికారుల దాడుల్లో కర్ణాటక నుంచి మన జిల్లాకు తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. అక్రమ మద్యం వ్యాపారానికి ఈ ఘటన ముచ్చుతునక. ఎక్సైజ్ అధికారుల తనిఖీలు లేకపోవడంతో అక్రమ మద్యం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.
    
 రియల్ ఎస్టేట్  వ్యాపారం, బ్రాంది షాపుల్లో భాగస్వామ్యం
 కొందరు సీఐలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మరిగినట్లు తెలుస్తోంది. మరి కొందరు కొన్ని బ్రాంది షాపుల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. లక్షలాది రూపాయల సంపాదన ఉండడంతో ఉద్యోగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరి కొందరు పేకాటకు బానిసలవుతున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట లాడ్జిలో పేకాట ఆడుతూ అనంతపురంలో రెండు స్టేషన్లలో పోలీసులకు పట్టుబడ్డారు. కొందరిని డ్రాయర్లతో నిలబెట్టడం అప్పట్లో కలకలం రేకిత్తించింది.

 అమ్మకాలు జరపాలంటూ వ్యాపారుల మెడపై కత్తి    
 గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ మద్యం ఏరులై పారుతుంటే ప్రభుత్వం మాత్రం బ్రాందీ షాపుల యాజమాన్యాల మెడపై కత్తి పెట్టి మరీ అమ్మకాలు చేయాలని చెబుతోంది. నాటుసారా, అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేస్తే అమ్మకాలు పెంచొచ్చని, వాటిపై చర్యలు తీసుకోకుండా అమ్మండంటూ తమపై ఒత్తిడి తెస్తే ఏం చేయాలంటూ యాజమానులు వాపోతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులే చేతులు కట్టుకుని కూర్చుంటే తామేమి చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 స్టేషన్లకే పరిమితమవుతున్న వాహనాలు
 ప్రతి స్టేషన్‌కు తనిఖీల కోసం ప్రభుత్వం వాహనం ఏర్పాటు చేసింది. సీఐలు సక్రమంగా వెళ్లని కారణంగా కొన్ని జీపులు ఆయా స్టేషన్లకే పరిమితమవుతున్నాయి. దీనికితోడు విడపనకల్లు, డొనేకల్లు, ఓబుళాపురం, కొడికొండ, తూముకుంటలో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌పోస్టుల పనితీరు అంతంత మాత్రంగానే ఉందనే విమర్శలు ఉన్నాయి. ఇక బార్డర్ మొబైల్ పార్టీలు దాదాపు పని చేయడం లేదు.

కళ్యాణదుర్గం, మడకశిర, ఉరవకొండలో ఈ బార్డర్ మొబైల్ పార్టీలు పని చేస్తున్నాయి. ఈ పార్టీలు తనిఖీలు చేసేందుకు ప్రస్తుతం వాహనాలు కూడా లేవని తెలిసింది. మొత్తం మీద కొందరు సీఐల పనితీరు ప్రశ్నార్థకంగా మారడం జిల్లాలో ఆ శాఖ ఉన్నతికి అడ్డంకిగా మారిందనడంలో సందేహం లేదని ఆ శాఖ ఉద్యోగులు వాపోతున్నారు.

 విధులకు డుమ్మా వాస్తవమే :
 కొందరు సీఐలు స్టేషన్లకు సరిగా వెళ్లడం లేదనేది వాస్తవమే. ఖచ్చితంగా అంగీకరించాల్సిన అంశమే. యూనిట్ ఆఫీసర్లు (సూపరింటెండెంట్లు) పట్టించుకోవడం లేదు. వారు తరచూ తనిఖీలు చేసి లేని వారిపై రిపోర్టులు ఇస్తే ఎందుకు చర్యలు తీసుకోం? ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం.

ఖచ్చితంగా స్థానికంగా ఉంటూ అక్రమ మద్యం, నాటుసారా తయారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. యూనిట్ ఆఫీసర్లు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి అందుబాటులో ఉండని అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిఫార్సులు చేసేలా సూచిస్తాం.
 - జీవన్‌సింగ్, ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement