own businesses
-
వీల్‌చైర్‌కి పరిమితమైన వెనక్కి తగ్గలేదు..వ్యాపారవేత్తగా..!
పెద్ద చదువులు చదువుకుని ఏ ఉద్యోగం లేక ఇంకా తల్లిదండ్రులపై ఆధారపడే యువత ఎంతోమంది ఉన్నారు. కనీసం తమ వ్యక్తిగత ఖర్చులకు కూడా తమ పెద్దవాళ్ల ముందు చేయిచాపనిదే పని అవ్వదు. కనీసం అవయవాల్ని సక్రమంగా ఉన్నాయి కదా అని ఏదోక పనిచేసే యత్నం కానీ ఆలోచన కానీ అస్సలు చెయ్యరు. పైగా అనుకున్నది కాలేదని నిరాశనిస్పృహలకు లోనై అక్కడితో ఆగిపోతారు. కానీ అ మహిళ చిన్నతనంలో వచ్చిన వ్యాధి నడవకుండా చేసి వీల్‌చైర్‌కే పరిమితం చేసినా..భయపడలేదు. ఒక కష్టం మీద మరో కష్టం వస్తూనే ఉన్నా వెనక్కి తగ్గలేదు. పైగా సమర్థవంతమైన వ్యాపారవేత్తగా విజయాలను సాధిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆమె ఎవరంటే..కాశ్మీర్‌లోని విశాలమైన వ్యాలీ లోయల్లో పుట్టి పెరిగిన సదాఫ్‌కి పదేళ్ల వయసులో తీవ్ర జ్వరం వచ్చింది. డాక్టర్ వద్దకు వెళ్లగా ఆమె ఇక ఎప్పటికి మళ్లీ నడవలేదని తేల్చి చెప్పేశారు. దీంతో చదువుకి దూరమవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ ఏదో ఆశతో తల్లిదండ్రులు ఆమెను అనేకమంది వైద్యుల వద్దకు తిప్పేవారు. ఆమెకు శస్త చికిత్స చేసి ప్రత్యేకంగా నడిచే బూట్లను పెట్టించాలని ప్రయాసపడ్డారు ఆమె తల్లిదండ్రులు. కానీ బరువు ఎక్కువగా ఉండటంతో అది సాధ్యం కాదని చెప్పేశారు. పొరుగున ఉన్న పిల్లలు పాఠశాలకు వెళ్తుంటే తానెందుకు వెళ్లలేకపోతున్నాను అనేది కూడా తెలియని స్థితిలో ఉంది సదాఫ్. అయినపటికీ.. ఆమెలో మనోబలం తగ్గకుండా ఉండేలా ధైర్యాన్ని నూరిపోసేవాడు తండ్రి. ఆ తండ్రినే విధి సదాఫ్ నుంచి దూరం చేసింది. దీంతో ఆయన మరణం కారణంగా సదాఫ్‌పై కుటంబ బాధ్యత పడ్డాయి. ఆమె తండ్రి మాత్రమే తనలోని శక్తి సామర్థ్యాను నమ్మేవారు, మిగతావారందరూ కించపరుస్తూనే ఉండేవారు. తన కాళ్ల మీద నిలబడే క్రమంలో అడగడున అవమానాలే ఎదుర్కొంది. వాటన్నింటిని తన తండ్రి ఇచ్చిన ధైర్యాన్ని స్ఫూరణకు తెచ్చుకుని అధిగమించే యత్నం చేసింది. అలా మసాలా వ్యాపారాన్ని పెట్టకునే స్థాయికి ఎదిగింది. అలా అంచెలంచెలుగా ఎదగుతూ సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా విజయాలను అందుకుంది. అక్కటితో ఆగలేదు బొటిక్ లాంటి పెద్ద వ్యాపారాన్ని కూడా సొంత చేసుకుని సమర్థవంతంగా రన్ చేస్తోంది. ఈ క్రమంలో తాను ఎన్నో రోజులు ఒంటరిగా కూర్చొని ఏడ్చిన రోజులు లెక్కలేనన్నీ ఉన్నాయని అంటోంది సదాఫ్. వీల్ చైర్లో ఉండే తాను ఏం చేయగలను, కుటుంబానికి ఏ విధంగా తోడ్పడగలననేది ఆమెలో తలెత్తిన సందేహాలు, భయాలు. ఇలా ఆలోచించి..ఒక్కోక్కసారి డిప్రెషన్లోకి వెళ్లిపోయేది. అయినప్పటికీ వాటన్నింటిని తన చేతులతో ఎందుకు చేయలేనన్న మొండి తెగింపు లోలోపల ఎక్కువగా ఉండేది. అదే ఈ రోజు సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీ ముందు నిలబడేలా చేసిందని చెబుతోంది సదాఫ్. ఆమె విజయపరంపర అక్కడితో ఆగిపోలేదు సదాప్ మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా. జమ్మూ కాశ్మీర్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ద్వారా ఎన్నో అవార్డులను అందుకుంది. నాడు హేళన చేసి బాధ పెట్టిన వ్యక్తులే ఈ రోజు తన విజయగాథను తమ పిల్లలకు చెబుతూ స్ఫూర్తిగా తీసుకోమనడం తనకు ఎంతో గర్వంగా ఉంటుందని ఆనందంగా చెబుతోంది సదాఫ్. చివరిగా ఆమె వీల్చైర్లపై ఉన్న వ్యక్తులు లేదా దివ్యాంగులను ఎప్పుడూ అనుమానించొద్దని చెబుతోంది. వీలైతే నమ్మకాన్ని, దైర్యాన్ని అందివ్వండి గానీ జాలీ మాత్రం చూపించి శాపగ్రస్తులుగా నిలబెట్టొదని కోరుతోంది సదాఫ్.(చదవండి: పూర్వకాలంలో అరటిపండ్లను అలా ముగ్గబెట్టేవారా!నెటిజన్లు ఫిదా) -
ఖాళీ ప్రిజ్జు ... కోటీశ్వరుడిని చేసింది!
ఖాళీ రిఫ్రిజిరేటర్‌ను చూస్తే ఏమొస్తుంది? అదృష్టం బాగుంటే అద్భుతమైన ఐడియా వస్తుంది. అపూర్వ మెహతా తన ఇంట్లో ఖాళీగా ఉన్న రిఫ్రిజిరేటర్‌ను చూడడంతో గ్రాసరీ డెలివరీ స్టార్టప్ ‘ఇన్‌స్టాకార్ట్’ ఐడియా వచ్చి 37 సంవత్సరాల వయసులోనే కోటీశ్వరుడిగా మారాడు. తన ఇన్స్పిరేషన్ గురించి అపూర్వ మెహతా లింక్డ్ ఇన్‌లో షేర్ చేశాడు. అమెజాన్‌లో సప్లై చైన్ ఇంజనీర్‌గా పని చేçస్తున్న మెహతాకు సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే కలలు ఉండేవి. అయితే ఒకటి రెండు వ్యాపారాలు స్టార్ట్ చేసి విఫలం అయ్యాడు. శాన్ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో కూర్చున్న మెహతాకు ఎదురుగా ఖాళీ రెఫ్రిజిరేటర్ కనిపించింది. తాను తినడానికి అందులో ఏమీ లేవు. అలా ఖాళీ రిఫ్రిజిరేటర్‌ను చూస్తున్నప్పుడు ‘ఇన్‌స్టాకార్ట్’ స్టార్టప్‌కు ఐడియా పుట్టింది. -
స్వయంకృషి: ఇష్టమైన పనులతో కొత్తమార్గం...
పడుతున్న కష్టమే మనకు బతుకుదెరువును నేర్పుతుంది. కొత్తగా ఆలోచించమంటుంది. ఒంటరి గడపను దాటుకొని నలుగురిలో కలవమంటుంది నేనుగా ఉన్న ఆలోచనల నుంచి మనంగా మూటగట్టుకొని సమష్టిగా పయనం సాగించమంటుంది. శ్రీకాకుళం, తిరుపతి నుంచి హైదరాబాద్ లోని ఒక ఎన్జీవో ప్రోగ్రామ్‌కి ఎవరికి వారుగా వచ్చారు శోభారాణి, ప్రమీల, దేవి, అరుణ, పద్మ, చైతన్య... గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఈ మహిళలు తమ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే ఒక్కరుగా ఎదగడానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు కలిసికట్టుగా పనిచేద్దాం అని తమకై తాముగా కొత్త మార్గం వేసుకుంటున్నారు. సైదాబాద్‌లోని యాక్సెస్ లైవ్లీ హుడ్‌లో మహిళా సాధికారత కోసం అక్కడి వారు చేస్తున్న పనుల గురించి తెలుసుకోవడానికి వెళ్లినప్పుడు ఓ ఆసక్తికరమైన సంభాషణ మమ్మల్ని ఆకర్షించింది. ‘నేను మళ్లీ హైదరాబాద్‌కు వచ్చే టైమ్‌కి నా మిల్లెట్ లడ్డూలను ప్లాస్టిక్ బాక్స్‌ల్లో కాకుండా ఆర్గానిక్ స్టైల్ బాక్స్‌ల్లో తీసుకువచ్చి మార్కెటింగ్ చేస్తా..’ అని తన పక్కనున్నవారితో చెబుతోంది ఓ అమ్మాయి. ‘‘నేను కూడా శానిటరీ ప్యాడ్స్‌ను అలాగే తయారుచేసి తీసుకువస్తా’’ అంది మరో మహిళ. ‘మీ బనానా చిప్స్... మాకు పంపించండి. మా దగ్గర మార్కెట్ చేస్తా!’ అని ఇంకో మహిళ మాట్లాడుతోంది. వారితో మేం మాటలు కలిపినప్పుడు వారి గ్రూప్‌లోకి మమ్మల్నీ అంతే సాదరంగా కలుపుకున్నారు. ‘ఇల్లు నడుపుకోవాలన్నా, పిల్లలను చదివించుకోవాలన్నా మేమూ ఏదో పని చేసుకోవాలనుకున్నవాళ్లమే..’ అంటూ తమ గురించీ, తాము చేస్తున్న పనుల గురించి ఆనందంగా వివరించారు. మిల్లెట్ లడ్డూలను తయారుచేస్తున్నది మీనా. శానిటరీ న్యాప్కిన్ల గురించి, మిల్లెట్ మిక్స్‌ల గురించి వివరించింది ప్రమీల. వీరిద్దరూ తిరుపతి నుంచి వచ్చినవాళ్లు. ‘నేను బనానా చిప్స్ చేస్తాను’ అని శ్రీకాకుళంలోని సీతం పేట నుంచి వచ్చిన శోభారాణి చెబితే, రాగి బిస్కెట్లను, రాగులకు సంబంధించిన ఉత్పత్తులను తయారుచేస్తుంటాను’ అని చెప్పింది బ్రాహ్మణ మండలం నుంచి వచ్చిన అరుణ. ‘హోమ్మేడ్ స్నాక్స్ చేసి అమ్ముతుంటాను’ అని వివరించింది దేవి. తిరుపతిలో న్యూట్రిషనిస్ట్‌గా డిప్లమా చేసిన చైతన్య మల్టీ మిల్లెట్స్ ప్రొడక్ట్స్‌ని మార్కెటింగ్ చేస్తోంది. కరోనా సమయంలో... ప్రమీల మాట్లాడుతూ –‘మా ఆయనది ప్రైవేటు ఉద్యోగం. కరోనా కారణంగా పోయింది. పిల్లల చదువు, కుటుంబ పోషణకు ఏం చేయాలో అర్ధం కాలేదు. దీంతో ఉదయాన్నే రాగి జావ చేసి, దగ్గరలో ఉన్న పార్క్ దగ్గరకు వెళ్లి కూర్చోనేదాన్ని. మొదట్లో ఎవరు కొంటారో.. అనుకునేదాన్ని. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ నేను చేసే రాగి జావకు డిమాండ్ పెరిగింది. దీంతో పాటు మొలకెత్తిన గింజలు కూడా పెట్టి అమ్మేదాన్ని. తెల్లవారుజామున మూడు గంటల నుంచి నా పని మొదలవుతుంది. మా చుట్టుపక్కల ఉన్న ఇద్దరు ఆడవాళ్లు కూడా మాకూ పని ఇప్పించమంటే, ఇదే పని నేర్పాను. తయారుచేసుకున్నది పార్క్‌ల వద్దకు తీసుకెళ్లి అమ్మడం, అలా వచ్చిన ఆదాయాన్ని వాళ్లకూ పంచడం.. కరోనా సమయం నుంచి చేస్తున్న. దీంతో పాటు రకరకాల మల్టీగ్రెయిన్ మిక్స్‌లు, డ్రింక్స్ స్వయంగా చేసి అమ్ముతున్నాను. ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ కూడా సొంతంగా తయారుచేస్తున్నాను. దీని వల్ల నాకే కాదు, మా దగ్గర ఉన్న కొంత మంది ఆడవాళ్లకైనా పని ఇప్పించగలుగుతాను’ అని వివరిస్తుంటే కష్టం నేర్పిన పనిలో ఉన్న తృప్తి ఆమె మోములో కనిపించింది. కూలీ పనుల నుంచి... శ్రీకాకుళం నుంచి వచ్చిన శోభారాణి మాట్లాడుతూ ‘మా దగ్గర అటవీ ఉత్పత్తులు ఎక్కువ. కానీ, వాటికి మా దగ్గర పెద్దగా మార్కెట్ లేదు. వాటి మీద మంచి ఆదాయం వస్తుందన్న విషయం కూడా నాకు అంతగా తెలియదు. కూలీ పనులకు వెళ్లేదాన్ని. ఏడాదిగా అరటికాయలతో చిప్స్ తయారీ చేసి అమ్ముతున్నాను. వేరే రాష్ట్రాల్లో ఉన్నవారికి ఆర్డర్ల మీద పంపిస్తున్నాను. ఎగ్జిబిషన్లలోనూ పాల్గొంటున్నాను. మా ఊళ్లో జరిగిన మహిళా సంఘాల కార్యక్రమాల్లో ‘మీ దగ్గర దొరికే ఉత్పత్తులతో ఏమైనా తయారుచేయచ్చు’ అంటే నేనిది ఎంచుకున్నాను. ఎక్కడా దొరకని స్పెషల్ అరటికాయలు మా ప్రాంతంలో లభిస్తాయి. వాటితోనే ఈ మార్గంలోకి వచ్చాను. మా ఇంటి దగ్గర ఉన్న ఇద్దరు వికలాంగులు నాకు ప్యాకింగ్‌లో సాయపడతారు. వారికి రోజుకు 200 రూపాయలు ఇస్తాను’ అని ఆనందంగా వివరించింది. కుటుంబ పోషణే ప్రధానంగా... ‘స్కూల్ ఏజ్‌లోనే పెళ్లవడం, పాప పుట్టడం.. ఆ తర్వాత వచ్చిన కుటుంబసమస్యలతో నా కాళ్ల మీద నేను నిలబడాలనే ఆలోచన కలిగింది’ అంటూ వివరించింది పాతికేళ్లు కూడా లేని మీనా. మిల్లెట్ లడ్డూల తయారీని సొంతంగా నేర్చుకుని, వాటిని మార్కెటింగ్ చేస్తోంది. మొదట ఇంటి చుట్టుపక్కల వాళ్లకే అమ్మేదని, తర్వాత్తర్వాత చిన్న చిన్న ఎగ్జిబిషన్స్‌లో పాల్గొనడం చేశాన’ని తెలియజేసింది. ‘‘కుటుంబాలను పోషించుకోవడానికే కాదు, మాకై మేం ఎదిగేందుకు, మాతో పాటు కొందరికి ఉపాధి ఇచ్చేందుకు మేం ఎంచుకున్న ఈ మార్గంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వెళుతుంటాం..’’ అని వివరించారు దేవి, అరుణ. మిగతావారూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ‘ఈ పనిలో మా కుటుంబసభ్యులందరినీ పాల్గొనేలా చేస్తున్నాం. పనితో పాటు నెలకు సరిపడా ఆదాయం లభిస్తుంది. మా స్వశక్తితో మేం ఎదుగుతున్నాం అన్న ఆనందం కలుగుతుంది. మొదట్లో మాకెవ్వరికీ ఒకరికొకరం పరిచయం లేదు. మహిళా ఉపాధి కార్యక్రమాల్లో భాగంగా కలుసుకున్నవాళ్లమే. మంచి స్నేహితులమయ్యాం. ఒకరి ఉత్పత్తులను మరొకరం ఆర్డర్ల మీద తెచ్చుకొని, మా ప్రాంతాలలో వాటినీ అమ్ముతుంటాం. ఎవరికి వారుగా వచ్చినా, ఈ ఏడాదిగా ఒకరికొకరం అన్నట్టుగా ఉన్నాం. మా వ్యాపారాలను పెంచుకునేందుకు, ఇక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాం’ అని వివరించారు. మొదటి అడుగు ఎప్పుడూ కీలకమైనదే. కష్టం నుంచో, ఎదగాలన్న తపన నుంచో పుట్టుకు వచ్చేదే. తమ ఎదుగుదలకు మద్దతుగా నిలిచే అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. మరెన్నో అడుగులు వేయడానికి సిద్ధమవుతున్న వీరిని మనసారా అభినందిద్దాం. – నిర్మలారెడ్డి ఫొటోలు: గడిగె బాలస్వామి -
సోల్ ట్రేడ్..: ఉత్తమ అత్తాకోడళ్లు
చెన్నైలోని ఎస్ఆర్యం యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చేస్తున్న రోజుల్లో సురభి సొంత వ్యాపారం గురించి కల కనేది. నిజానికి ఆమెది వ్యాపారనేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ, తన ఆలోచనకు కుటుంబసభ్యులు పెద్దగా మద్దతు ప్రకటించలేదు. ‘ఉద్యోగం చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు. కాలం కలిసొస్తే అమెరికా వెళ్లి స్థిరపడిపోవచ్చు. వ్యాపారం చేయడమనేది పెద్ద రిస్క్. అందరికీ అది సాధ్యం కాదు’ అంటుండేవారు. అంతమాత్రాన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు సురభి. నిర్మాణ్ షాతో వివాహం అయిన తరువాత ఆమె ఇండోర్ (మధ్యప్రదేశ్)కు వెళ్లింది. అక్కడ అత్త రూపంలో తనకొక ‘అదృష్టం’ పరిచయం అయింది. అత్త చేత్న షా తనతో ఒక స్నేహితురాలిలా ఉండేది. అత్తగారితో తన ఆలోచన పంచుకుంది సురభి. ‘ఎందుకమ్మా రిస్క్’ అని అత్తగారు అనలేదు. కోడలి ఉత్సాహానికి మరింత ప్రోత్సాహం ఇచ్చింది. అలా ‘కారాగ్రీన్’స్టార్టప్‌కు అంకురార్పణ జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల జరిగే నష్టాల గురించి పుస్తకాల్లో చదవడమే కాదు, ఆ విషాదాన్ని కళ్లతో చూసింది సురభి. ‘ఎవరికి వారు ఇది నా సమస్య కాదు. ఎవరో వస్తారు. ఏదో చేస్తారు అనుకుంటే సమస్య మరింత పెరుగుతుంది తప్ప తగ్గదు. అందుకే నా వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచనలో నుంచి వచ్చిందే కారాగ్రీన్’ అంటుంది సురభి. ‘కారాగ్రీన్’ అనేది బయోడిగ్రేడబుల్ అంకుర సంస్థ. పర్యావరణహితమైన పెన్నులు, పెన్సిల్స్, సీడ్ పేపర్ డైరీలు, క్యాలెండర్లతో పాటు ప్యాకింగ్ సామాగ్రిని తయారు చేస్తారు. ఊహల్లో ఉన్న ప్రాజెక్ట్ కాగితం మీదికి రావడానికి, అక్కడి నుంచి వాస్తవరూపం దాల్చడానికి మధ్యలో సందేహాలు, సమస్యలు, అవాంతరాలు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో కోడలికి అండగా నిలిచి ముందుకు నడిపించింది చేత్న షా. ‘వ్యాపారంలో మన కుటుంబసభ్యుల అండ అనేది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది’ అంటుంది సురభి. కట్ చేస్తే... షార్క్ ట్యాంక్ ఇండియా (బిజినెస్ రియాలిటీ టెలివిజన్ సిరీస్)లో ‘కారాగ్రీన్’ 50 లక్షల ఫండింగ్ ఆఫర్‌ను గెలుచుకుంది. -
వారి ఆలోచనల్లో నుంచి పుట్టిందే ఆరా హెల్త్‌టెక్
ఒకరికి ‘సమస్య’ పరిచయం అయింది. ఒకరికి ‘ఉత్సాహం’ తోడైంది. ఒకరికి ‘ఓటమి’ ఎదురైంది. ఒకరికి తన అనుభవమే పాఠం అయింది. ‘సమస్య’ ‘ఉత్సాహం’ ‘ఓటమి’ ‘పాఠం’... ఈ నాలుగు పదాల ప్రయోగశాలలో పుట్టిందే ఆరా హెల్త్‌కేర్. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన అహిల్య మెహతా, మల్లిక సాహ్ని, ప్రగ్యా సాబు, నవ్యనందా ఈ స్టార్టప్ కంపెనీకి సూత్రధారులు. ‘ఆరా’ అనే ఉమెన్–సెంట్రిక్ హెల్త్‌టెక్ కంపెనీ ద్వారా నాణ్యమైన హెల్త్‌కేర్–ప్రొడక్ట్స్, సేవలను మహిళలకు చేరువ చేస్తున్నారు.... సమాచారం తక్కువైతే జరిగే నష్టం మాట ఎలా ఉన్నా, అతి అయితే మాత్రం గందరగోళం ఏర్పడుతుంది. ‘ఏది వాస్తవం?’ ‘ఏది అవాస్తవం?’ అని తేల్చుకోవడానికే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. ఈ సమస్యతో పాటు స్త్రీలు ఎదుర్కొంటున్న రకరకాల ఆరోగ్య సమస్యల గురించి గత సంవత్సరం లాక్డౌన్ సమయంలో ముంబైలో చర్చించుకున్నారు అహిల్య మెహతా, మల్లిక సాహ్ని, ప్రగ్యా సాబు, నవ్య నందా. వారి ఆలోచనల్లో నుంచి పుట్టిందే ఆరా హెల్త్‌టెక్ కంపెనీ. శాన్ఫ్రాన్సిస్కో(యూఎస్)లో ఐటీ కన్సల్టెంట్‌గా పనిచేసిన అహిల్య మెహతా స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఆన్లైన్ పర్సనల్ స్టైలింగ్ ప్లాట్‌ఫామ్ ‘స్టైల్‌క్రాకర్’లో అసోసియేట్ ప్రొడక్ట్స్ మేనేజర్‌గా పనిచేసింది. ఒక స్వచ్ఛందసేవా సంస్థతో కలిసి రాజస్థాన్‌లోని ట్రైబల్ విలేజ్ కొట్రాలో పని చేస్తున్నప్పుడు మహిళలు ఎదుర్కొంటున్న రకరకాల ఆరోగ్యసమస్యలను దగ్గర నుంచి తెలుసుకునే అవకాశం వచ్చింది. యూఎస్‌లో బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన మల్లిక సాహ్నికి ఎంటర్ ప్రెన్యూర్షిప్ అంటే అనురక్తి. ఎంటర్ ప్రెన్యూర్‌గా విజయబావుటా ఎగరేయాలనే ఆమె కలకు ‘ఆరా’తో అంకురార్పణ జరిగింది. ‘తరగతి గదిలో బిజినెస్ పాఠాలు వినడం వేరు, ఆచరణ వేరు’ అంటున్న మల్లిక ‘ఆరా’ స్టార్టప్ ద్వారా కొత్త విషయాలెన్నో నేర్చుకుంది. ఇంజనీరింగ్ చేసిన ప్రగ్యా సాబు హెల్త్ ఇన్సురెన్స్ కంపెనీ ‘ఆస్కార్ హెల్త్’లో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేసింది. ఆ తరువాత కొన్ని స్టార్టప్ కంపెనీలు మొదలుపెట్టింది కాని అవేమీ సత్ఫలితాలు ఇవ్వలేదు. అయితే ‘మళ్లీ ప్రయత్నిద్దాం’ అనే పట్టుదల తప్ప నిరాశను ఎక్కడా దరి చేరనివ్వలేదు. ‘మన హెల్త్‌కేర్ సిస్టమ్‌ను అర్థం చేసుకోవడానికి ఒకప్పటి నా ఉద్యోగం ఉపకరించింది’ అంటుంది ప్రగ్యా. ఈ బృందంలో అందరికంటే చిన్నవయసు ఉన్న అమ్మాయి నవ్య నందా. నటదిగ్గజం అమితాబ్ బచ్చన్ మనవరాలు ఈ నవ్య. డిజిటల్ టెక్నాలజీలో పట్టా పుచ్చుకుంది. ‘ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ, ఎంత ఉన్నత చదువులు చదివినప్పటికీ గర్భనిరోధకం, లైంగిక ఆరోగ్యం... మొదలైన విషయాలు మాట్లాడుకోవడానికి, సమస్య గురించి చర్చించడానికి సంకోచించే వారు, ఇబ్బందికి గురయ్యేవారు మన సమాజంలో చాలామంది ఉన్నారు. అలాంటి వారు తమ సమస్యను చెప్పుకోవడానికి, పరిష్కారానికి ఆరా ఒక ఆత్మీయనేస్తంలా ఉండాలనుకున్నాం’ అంటుంది నందా. ఒకప్పుడు నందా కొన్ని మానసిక సమస్యలకు గురైంది. వాటి నుంచి త్వరగానే బయటపడింది. తన అనుభవాలనే పాఠాలుగా ఉపయోగించుకుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘ఆరా’లో వైద్యనిపుణులు ధృవీకరించిన సమాచారం ఉంటుంది. మహిళలు తమకు సంబంధించిన ఆరోగ్యసమస్యల గురించి స్వేచ్ఛాయుతంగా చర్చించుకోవడానికి, వైద్యసలహాల కోసం వాట్సాప్, టెలిగ్రామ్, జూమ్...వేదికల ద్వారా కమ్యూనిటీ మీటప్స్ నిర్వహిస్తున్న ఆరా ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్’ అనే అరోగ్యసూత్రాన్ని ఆచరణ లో చూపడానికి ప్రయత్నిస్తుంది. ప్రతివారం సమాచారాన్ని అప్డేట్ చేస్తుంటారు. ‘షాప్’ విభాగంలో తమ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 140మంది నిపుణులు, సంస్థలతో కలిసి పనిచేస్తోంది ఈ స్టార్టప్. కాస్త సరదాగా ‘కరోనా మాకు మేలే చేసింది’ అంటున్నారు నలుగురు మిత్రులు. ‘అదెలా?’ అంటే – ‘కరోనా వల్లే లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వల్లే మేము సమావేశం అయ్యాం. దీనివల్లే ‘ఆరా’కు అంకురార్పణ జరిగింది’ అంటున్నారు! -
స్విగ్గీ.. జొమాటోకు షాక్.!
న్యూఢిల్లీ: జొమాటో.. స్విగ్గీ.. పట్టణ ప్రజలకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేనివి. కరోనా వచ్చిన తర్వాత ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల సేవలు మరింతగా విస్తరించాయి. వైరస్ కారణంగా ఎక్కువ మంది ఆహారం కోసం బయటకు వెళ్లకుండా ఇంటి నుంచే ఆర్డర్ చేసి తెప్పించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే వీటి ప్రాచుర్యం మరింత పెరిగిపోయింది. ఈ పరిస్థితులను గమనించిన కొన్ని పెద్ద రెస్టారెంట్లు మనమే సొంతంగా ఎందుకు డెలివరీ చేయకూడదు? జొమాటో, స్విగ్గీలపై ఎంతకాలం ఆధారపడడం? అన్న ఆలోచనలకు వస్తున్నాయి. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏఐ)లో సభ్యత్వం కలిగిన కొన్ని రెస్టారెంట్లు డాట్పే, థ్రైవ్ వంటి టెక్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని సొంతంగా ఆన్లైన్ ఆర్డర్ ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. గూగుల్ సెర్చింజన్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపైనా ఆయా రెస్టారెంట్లు తమ ఆన్లైన్ ఆర్డర్ల లింక్‌లకు ప్రచారం కల్పించే మార్కెటింగ్ వ్యూహాలను కూడా అమలు చేస్తున్నాయి. జొమాటో, స్విగ్గీలకు రెస్టారెంట్లు ప్రతీ ఆర్డర్‌పై ఇంత చొప్పున కమీషన్ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఈ కమీషన్ 30 శాతం వరకు ఉంటుందని రెస్టారెంట్లు చెబుతున్నాయి. తామే సొంతంగా జొమాటో, స్విగ్గీ మాదిరిగా కస్టమర్లను చేరుకునే మార్గాలు తెలుసుకుంటే ఈ మేర కమీషన్‌ను ఆదా చేసుకోవచ్చని భావిస్తున్నాయి. ఎక్కువ మందిని చేరుకోవచ్చు.. ‘‘సాధారణంగా 7–10 కిలోమీటర్ల పరిధిలోనే అగ్రిగేటర్లు (స్విగ్గీ, జొమాటో తదితర) సేవలు అందించగలవు. సొంతంగా నెట్‌వర్క్‌ను కలిగి ఉంటే లేదా లాజిస్టిక్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటే ఇంతకుమించిన దూరంలో ఉన్న కస్టమర్లను కూడా చేరుకునేందుకు వీలుంటుంది’’ అని దేవిదయాళ్ వివరించారు. హంగర్ హాస్పిటాలిటీ సైతం 80% ఆర్డర్లను సొంత ఆన్లైన్ ఆర్డర్ ప్లాట్‌ఫామ్ నుంచే సమకూర్చుకుంటోంది. ఈ సంస్థకు బాంబే క్యాంటీన్, ఓ పెడ్రో, బాంబే స్వీట్‌షాప్ తదితర బ్రాండ్లున్నాయి. థ్రైవ్ సాయంతో సొంతంగా ఆర్డర్లను స్వీకరించే టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను ఈ సంస్థ ఏర్పాటు చేసుకుంది. సొంత డెలివరీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని కస్టమర్లను చేరుకుంటోంది. ఈ సంస్థ ఇటీవలే రెండు ప్రత్యేకమైన బ్రాండ్లను ఆవిష్కరించింది. ఇవి స్విగ్గీ, జొమాటో ప్లాట్‌ఫామ్‌లపై అందుబాటులో ఉండవు. సొంత ప్లాట్‌ఫామ్‌పైనే వీటిని ఆఫర్ చేస్తోంది. ‘‘మార్కెటింగ్‌కు ఇన్‌స్ట్రాగామ్ సేవలను వినియోగిస్తున్నాం. దీర్ఘకాలం కోసం బ్రాండ్లను ఏర్పాటు చేసుకున్నాం కనుక మార్కెటింగ్ ఖర్చులు సహేతుకంగానే అనిపిస్తున్నాయి’’ అని సంస్థ వ్యవస్థాపకుడు యాష్ బనాజే చెప్పారు. ఢిల్లీకి చెందిన బిగ్ చిల్ కేఫ్ సైతం సొంతంగానే ఆన్ లైన్ ఆర్డర్ల స్వీకరణ, డెలివరీ సేవలను అందిస్తోంది. కస్టమర్లు కోరుకున్న రుచులు రెస్టారెంట్లు సొంతంగానే ఆర్డర్లు తీసుకోవడం వల్ల కస్టమర్లకు ఇష్టమైన రుచులను అందించేందుకు వీలుంటుందని ఫుడ్మ్యాటర్స్ ఇండియా పార్ట్నర్ గౌరీదేవిదయాళ్ పేర్కొన్నారు. కస్టమర్లు కోరుకున్న ప్రత్యేకమైన రెసిపీలను తయారు చేసి డెలివరీ చేసేందుకు వీలుంటుందన్నారు. అదే జొమాటో, స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌లపై ఇందుకు పరిమిత అవకాశమే ఉంటుందన్నది ఆయన విశ్లేషణ. -
అమృత సంధ్య ఇదీ జీవితం
‘నా భార్య నాకు అండగా నిలిచిన తీరు ఏ పెద్ద వాళ్లు చెప్పిన అప్పగింతలోనూ లేదు. బతుకు నావ ఒడిదొడుకులకు లోనయినప్పుడు తనకు తానుగా నాకు తోడు వచ్చింది. నేను ఈ రోజు ఇలా నవ్వుతూ ఉన్నానంటే కారణం మా సంధ్య ప్రోత్సాహం, సహకారమే’ అని ఓ భర్త తన భార్యను ప్రశంసల్లో ముంచెత్తాడు. భార్య గొప్పతనాన్ని చెప్పడానికి ఇష్టపడని మగ ప్రపంచంలో ఈ భర్త మాటలు వినడానికి మగవాళ్లకు ఎలా ఉందో కానీ ఆడవాళ్లు వినసొంపుగా ఆస్వాదిస్తున్నారు. ఆ భర్త కేరళ రాష్ట్రం, పాలక్కాడ్‌లోని శివకుమార్. నోరూరించే ఉపాధి ఓ పదహారేళ్ల కిందట... శివకుమార్ బీపీఎల్ లో ఉద్యోగం చేసేవాడు. ఆ బీపీఎల్ మూతపడడంతో అతడి ఉద్యోగం పోయింది. కొత్త ఉద్యోగం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఇంటిని నడపాల్సిన తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమవుతున్నానేమోననే ఆందోళనను అతడి భార్య సంధ్య పసిగట్టేసింది. ‘ఇల్లు గడవాలంటే ఉద్యోగమే చేయాలా? సొంతంగా మనకు వచ్చిన పని ఏదైనా చేయవచ్చు కదా’ అన్నదామె. శివకుమార్ ముఖంలో ప్రశ్నార్థకానికి బదులుగా ఆమె ‘చిరుతిండ్లు బాగా చేస్తాను. ఆ పనే మనకు అన్నం పెడుతుంది’ అన్నది. ‘మార్కెట్లో కొత్తరకాల స్వీట్లు ఎన్ని రకాలున్నప్పటికీ బాల్యంలో తిన్న రుచి కనిపిస్తే ఎవరికైనా నోరూరుతుంది. అదే మనకు బతుకుదెరువవుతుందని కూడా ఆమె భర్తకు భరోసానిచ్చింది. ప్రయోగాత్మంగా కొన్నింటిని చేసి బంధువులకు, స్నేహితులకు రుచి చూపించారు. వాళ్లు పాస్ మార్కులు వేయడంతో 2005లో అమృత ఫుడ్స్ పేరుతో చిరుతిళ్లను తయారు చేసే పరిశ్రమ మొదలైంది. పదిహేనేళ్లు గడిచేసరికి ఇప్పుడా దంపతులు ఏడాదికి పది లక్షల ఆదాయాన్ని చూడగలుగుతున్నారు. పదిమందికి పైగా ఉద్యోగం కల్పించారు. తమ ఆహార ఉత్పత్తులకు ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ గుర్తింపు కూడా వచ్చింది. వ్యక్తి వికాస పాఠం ఈ ఆధునిక యుగంలో నెలకు లక్షల జీతం తీసుకుంటున్న భార్యాభర్తలు ఎక్కువగానే ఉన్నారు. అంత సౌకర్యవంతమైన జీవితంలో కూడా నాలుగు నెలల పాటు ఉద్యోగంలో మాంద్యం ఏర్పడితే ఆ జీవితాలు తలకిందులవుతున్నాయి. మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. శివకుమార్, సంధ్య దంపతుల జీవితం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం అనే చెప్పాలి. ఉన్నత చదువు చదివిన భర్తతో ‘నాకు తెలిసిన పని, తక్కువ పెట్టుబడితో మన చేతుల శ్రమతో కొత్త వృత్తిని చేపడదా’మని చెప్పడంలో ఓ చొరవ ఉంది. తన చదువుకు తగిన ఉద్యోగం అని బేషజాలకు పోకుండా భార్య ప్రతిపాదనను గౌరవించడంలో అతడి పరిణతి ఉంది. -
క్రికెటర్స్.. ‘గేమ్’చేంజర్స్..!
కొన్నాళ్ల క్రితం దాకా ఎక్కువగా ఫుడ్ బిజినెస్ వైపు మొగ్గు చూపిన క్రికెటర్లు ప్రస్తుతం ఇతరత్రా రంగాలపై దృష్టి పెడుతున్నారు. ఫ్యాషన్, ఫిట్నెస్, గ్రూమింగ్ ఉత్పత్తులు మొదలైన వాటిపై ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా కోచ్ రవి శాస్త్రి కూడా ఈ జాబితాలో చేరాడు. 23 యార్డ్స్ పేరిట పురుషుల సౌందర్య సాధనాల శ్రేణిని ప్రవేశపెట్టాడు. ఇందుకోసం ఆదూర్ మల్టీప్రొడక్ట్స్ సంస్థతో జట్టు కట్టాడు. 23 యార్డ్స్ బ్రాండ్‌తో బాడీ వాష్, షేవింగ్ జెల్, డియోడరెంట్, శానిటైజర్ వంటి ఉత్పత్తులు లభిస్తాయి. ప్రస్తుతానికి ఆన్లైన్ మాధ్యమంలోనే వీటిని విక్రయిస్తున్నారు. దేశీయంగా పురుషుల గ్రూమింగ్ ఉత్పత్తుల మార్కెట్ దాదాపు రూ. 5,000 కోట్ల పైచిలుకు ఉంటుందని అంచనా. కోహ్లి అండ్ కో..: ఇప్పటికే చాలా మంది మాజీ, ప్రస్తుత క్రికెటర్లు.. ఇలాంటి వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఫ్యాషన్ లేబుల్ రాంగ్, ఇండియన్ సూపర్ లీగ్ టీమ్ ఎఫ్‌సీ గోవాలో వాటాలు ఉన్నాయి. అలాగే జిమ్ చెయిన్ చిజెల్, స్టార్టప్ సంస్థలు స్పోర్ట్ కన్వో, స్టెపథ్లాన్ కిడ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేశాడు. అటు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఫిట్నెస్ క్లబ్ స్పోర్ట్స్‌ఫిట్, ఫిట్నెస్.. లైఫ్‌స్టైల్ బ్రాండ్ సెవెన్, ఐఎస్ఎల్ టీమ్ చెన్నయిన్ ఎఫ్‌సీలో పెట్టుబడులు పెట్టాడు. అదే బాటలో మరో క్రికెటర్ కేఎల్ రాహుల్ గతేడాది గల్లీ బ్రాండ్ పేరుతో దుస్తుల విభాగంలోకి అడుగుపెట్టాడు. ఇందుకోసం జెకో ఆన్లైన్ అనే రిటైల్ సంస్థతో జట్టు కట్టాడు. తాజా ఐపీఎల్ సీజన్లో రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌లతో చేతులు కలిపాడు. గల్లీ బ్రాండ్‌తో ఆన్లైన్ గేమింగ్ వ్యాపార విభాగంలోకి కూడా అడుగుపెట్టడంపై రాహుల్ దృష్టి పెడుతున్నాడు. ఇక, 2019 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు యజువేంద్ర చహల్ తన సొంత లైఫ్‌స్టయిల్ బ్రాండ్ చెక్‌మేట్‌ను ప్రవేశపెట్టాడు. గతంలో యువరాజ్ సింగ్ కూడా హెల్తియన్స్, వ్యోమో, కారటిసన్, జెట్‌సెట్‌గో వంటి సంస్థల్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్ చేస్తే సరిపోదు .. సాధారణంగా క్రికెటర్లు ఏదైనా వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తే దానికి బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా వ్యవహరిస్తుంటారు. ఇందుకు గాను సదరు వ్యాపారంలో ఎంతో కొంత వాటాలు తీసుకోవడం ద్వారా ఇన్వెస్టరుగా మారుతుంటారు. అంతే తప్ప ప్రత్యేకంగా డబ్బులు ఇన్వెస్ట్ చేసే క్రీడాకారులు చాలా తక్కువగా ఉంటారని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అయితే, దీర్ఘకాలంలో చూస్తే కేవలం బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం వల్ల ఉపయోగం లేదని బ్రాండింగ్ ప్రొఫెషనల్స్ అభిప్రాయపడ్డారు. సదరు వ్యాపారంలో వారు కూడా చురుగ్గా పాలుపంచుకుంటేనే ఉపయోగం ఉంటుందని వారు పేర్కొన్నారు. ఉదాహరణకు కేఎల్ రాహుల్‌ను చూస్తే.. గల్లీ బ్రాండ్‌కి సంబంధించి డిజైన్ నుంచి రంగుల ఎంపిక దాకా అన్ని విషయాల్లోనూ చురుగ్గా పాలుపంచుకుంటాడు. ఇన్వెస్టర్లుగా మారిన క్రీడాకారులు ఆయా వ్యాపారాల్లో చురుగ్గా పాలుపంచుకుంటేనే ప్రయోజనాలు ఉంటాయనేది విశ్లేషకుల అంచనా. లాభదాయకమేనా.. క్రికెటర్లు పెట్టుబడులు పెట్టిన వ్యాపారాలు .. లాభాలు ఆర్జించడంలో మిశ్రమ ఫలితాలు కనపరుస్తున్నాయి. కోహ్లికి చెందిన రాంగ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేసే యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్ (యూఎస్‌పీఎల్) వేల్యుయేషన్ ప్రస్తుతం రూ. 1,200 కోట్ల పైగా ఉంటుంది. కానీ ఇది ఇంకా లాభాల్లోకి మళ్లాల్సి ఉంది. యాక్సెల్, అల్టీరియా క్యాపిటల్ వంటి ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. కోహ్లి ఇటీవలే మరో రూ. 13.2 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు. యూఎస్‌పీఎల్ ఏర్పాటైన తొలినాళ్లలో సచిన్ టెండూల్కర్ కూడా ఇన్వెస్ట్ చేశాడు. అటు ధోనీకి చెందిన సెవెన్ బ్రాండ్ సైతం చెప్పుకోతగ్గ స్థాయిలో ప్రాచుర్యం పొందలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 2016లో ప్రవేశపెట్టిన ఈ బ్రాండ్ దుస్తులు.. అన్ని ఈ–కామర్స్ సైట్లలోనూ కనిపిస్తున్నప్పటికీ కేవలం ధోనీ ఆకర్షణ శక్తి మీదే వీటి అమ్మకాలు ఎక్కువగా ఆధారపడి ఉంటున్నాయని వివరించాయి. -
భారత్‌లో అంతే..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని వయోజనుల్లో కేవలం 5 శాతం మందే సొంత వ్యాపారాలకు మొగ్గుచూపుతున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే 5 శాతం ఎంట్రప్రెన్యూర్ రేట్ అతితక్కువ కావడం గమనార్హం. ఇక వ్యాపారాన్ని అర్థంతరంగా నిలిపివేయడం భారత్‌లో 26.4 శాతంగా నమోదైంది. దేశంలో వ్యాపార కార్యకలాపాలను అంచనా వేసేందుకు 18 నుంచి 64 ఏళ్ల మధ్య వయస్కులను దాదాపు 3,400 మందిని పైగా ఈ సర్వే పలుకరించింది. దేశంలో 11శాతం మంది తమ తొలినాళ్లలోనే సొంత వ్యాపార కార్యకలాపాల్లో అడుగుపెడుతున్నారని ఎంట్రెప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఈడీఐ)కు చెందిన గ్లోబల్ ఎంట్రెప్రెన్యూర్‌షిప్ మానిటర్ (జెమ్) నివేదికలో పేర్కొంది. వీరిలో ఏడు శాతం మంది వ్యాపారవేత్తలు మూడున్నర ఏళ్ల కిందటి నుంచి వ్యాపారాలను నడిపిస్తున్నారు. నాలుగు శాతం మంది యజమానులుగా లేదా సహ యజమానులుగా ఇటీవల వ్యాపారాలను చేపట్టారని నివేదిక తెలిపింది. ఇక సొంత వ్యాపారం చేపట్టి 42 నెలలుగా స్ధిరంగా కొనసాగిస్తున్న వారు కేవలం 5 శాతమేనని, మిగిలిన ప్రపంచంతో పోలిస్తే ఇది అత్యల్పమని నివేదిక పేర్కొంది. బ్రిక్స దేశాల్లో సొంతంగా వ్యాపారాలు చేపట్టే వారి సంఖ్య అత్యధికంగా 17 శాతం కాగా, దక్షణాప్రియా 3 శాతంతో అత్యల్ప స్ధానం దక్కించుకుంది. భారత్, రష్యా 5 శాతం ఎంటర్‌ప్రెప్యూర్ల జాబితాలో సంయుక్తంగా నిలిచాయి. -
గమ్మత్తు
అనంతపురం క్రైం : జిల్లాలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారు. కొంత మంది సిబ్బందితో పనులు చక్కబెట్టిస్తూ జిల్లా కేంద్రాన్ని వీడటం లేదు. సొంత వ్యాపారాలు, ఆట పాటల్లో మునిగి తేలుతూ నిర్లక్ష్యపు మత్తులో జోగుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వానికి మంచి ఆదాయం చేకూర్చే వాటిలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ఒకటి. ప్రభుత్వం ఈ శాఖపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మద్యం అమ్మకాలను పెంచాలని ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తోంది. ఈ మేరకు అధికారులు బ్రాందీ షాపుల యాజమాన్యాలకు లక్ష్యాలు పెట్టి మరీ అమ్మకాలు చేయిస్తున్నారు. బెల్టుషాపులు ఎత్తేశామని బయటకు చెబుతూనే.. లోలోన అమ్మిస్తున్నారు. ఇంత చేస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో లక్ష్యాలు చేరడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం నాటుసారా, అక్రమ మద్యమే. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పల్లెల్లో నాటుసారా, కర్ణాటక మద్యం ఏరులై పారుతోంది. కొందరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ల తీరు వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్లు విమర్శలున్నాయి. వీరు వివిధ వ్యాపకాలతో స్టేషన్లకు రెగ్యులర్‌గా వెళ్లడం మానేశారు. చుట్టపుచూపుగా వారానికోసారో, రెండుసార్లో వెళ్తున్నారు. దీంతో వారి సిబ్బంది కూడా ‘ఆడిందే ఆట పాడిందే పాట’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే మకాం జిల్లా వ్యాప్తంగా 18 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. అనంతపురం ఈఎస్ పరిధిలో అనంతపురం, శింగనమల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ, కణేకల్, రాయదుర్గం. పెనుకొండ ఈఎస్ పరిధిలో పెనుకొండ, హిందూపురం, కదిరి, తనకల్లు, పుట్టపర్తి, చెన్నేకొత్తపల్లి, మడకశిర, కళ్యాణదుర్గం, కంబదూరు, ధర్మవరంలో స్టేషన్లు ఉన్నాయి. వీరిలో కనేకల్లు, రాయదుర్గం, తాడిపత్రి, శింగనమల, గుత్తి, మడకశిర, పుట్టపర్తి, కదిరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు జిల్లా కేంద్రంలోనే నివాసం ఉంటున్నారు. రాయదుర్గం, మడకశిర, కదిరి తదితర ప్రాంతాలకు పోయి రావాలంటే దాదాపు సాయంత్రం అవుతుంది. అక్కడికి వెళ్లి వారి పరిధిలోని అక్రమ మద్యం, నాటుసారా తయారి తదితర వాటిని అరికట్టే చర్యలు ఎప్పుడు చేపడతారని కింది స్థాయి ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు వీరు పని చేస్తున్న ప్రాంతాలకు వెళ్లే ముందుగా కొందరు సమాచారం చేరవేస్తే.. ఆ సమయానికి సిబ్బంది అక్కడికి వెళ్లి సిద్ధంగా ఉంటారు తప్ప మామూలుగా ఆవైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్స్పెక్టర్లు రాకపోవడంతో సిబ్బంది కూడా స్టేషన్ దాటి బయటకు వెళ్లరు. ఇటీవల రాయదుర్గం, కంబదూరు, మడకశిర ప్రాంతాల్లో ఎక్సైజ్ ఉన్నతాధికారుల దాడుల్లో కర్ణాటక నుంచి మన జిల్లాకు తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. అక్రమ మద్యం వ్యాపారానికి ఈ ఘటన ముచ్చుతునక. ఎక్సైజ్ అధికారుల తనిఖీలు లేకపోవడంతో అక్రమ మద్యం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం, బ్రాంది షాపుల్లో భాగస్వామ్యం కొందరు సీఐలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మరిగినట్లు తెలుస్తోంది. మరి కొందరు కొన్ని బ్రాంది షాపుల్లో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. లక్షలాది రూపాయల సంపాదన ఉండడంతో ఉద్యోగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరి కొందరు పేకాటకు బానిసలవుతున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట లాడ్జిలో పేకాట ఆడుతూ అనంతపురంలో రెండు స్టేషన్లలో పోలీసులకు పట్టుబడ్డారు. కొందరిని డ్రాయర్లతో నిలబెట్టడం అప్పట్లో కలకలం రేకిత్తించింది. అమ్మకాలు జరపాలంటూ వ్యాపారుల మెడపై కత్తి గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ మద్యం ఏరులై పారుతుంటే ప్రభుత్వం మాత్రం బ్రాందీ షాపుల యాజమాన్యాల మెడపై కత్తి పెట్టి మరీ అమ్మకాలు చేయాలని చెబుతోంది. నాటుసారా, అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేస్తే అమ్మకాలు పెంచొచ్చని, వాటిపై చర్యలు తీసుకోకుండా అమ్మండంటూ తమపై ఒత్తిడి తెస్తే ఏం చేయాలంటూ యాజమానులు వాపోతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులే చేతులు కట్టుకుని కూర్చుంటే తామేమి చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్లకే పరిమితమవుతున్న వాహనాలు ప్రతి స్టేషన్‌కు తనిఖీల కోసం ప్రభుత్వం వాహనం ఏర్పాటు చేసింది. సీఐలు సక్రమంగా వెళ్లని కారణంగా కొన్ని జీపులు ఆయా స్టేషన్లకే పరిమితమవుతున్నాయి. దీనికితోడు విడపనకల్లు, డొనేకల్లు, ఓబుళాపురం, కొడికొండ, తూముకుంటలో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌పోస్టుల పనితీరు అంతంత మాత్రంగానే ఉందనే విమర్శలు ఉన్నాయి. ఇక బార్డర్ మొబైల్ పార్టీలు దాదాపు పని చేయడం లేదు. కళ్యాణదుర్గం, మడకశిర, ఉరవకొండలో ఈ బార్డర్ మొబైల్ పార్టీలు పని చేస్తున్నాయి. ఈ పార్టీలు తనిఖీలు చేసేందుకు ప్రస్తుతం వాహనాలు కూడా లేవని తెలిసింది. మొత్తం మీద కొందరు సీఐల పనితీరు ప్రశ్నార్థకంగా మారడం జిల్లాలో ఆ శాఖ ఉన్నతికి అడ్డంకిగా మారిందనడంలో సందేహం లేదని ఆ శాఖ ఉద్యోగులు వాపోతున్నారు. విధులకు డుమ్మా వాస్తవమే : కొందరు సీఐలు స్టేషన్లకు సరిగా వెళ్లడం లేదనేది వాస్తవమే. ఖచ్చితంగా అంగీకరించాల్సిన అంశమే. యూనిట్ ఆఫీసర్లు (సూపరింటెండెంట్లు) పట్టించుకోవడం లేదు. వారు తరచూ తనిఖీలు చేసి లేని వారిపై రిపోర్టులు ఇస్తే ఎందుకు చర్యలు తీసుకోం? ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. ఖచ్చితంగా స్థానికంగా ఉంటూ అక్రమ మద్యం, నాటుసారా తయారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. యూనిట్ ఆఫీసర్లు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి అందుబాటులో ఉండని అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిఫార్సులు చేసేలా సూచిస్తాం. - జీవన్‌సింగ్, ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్