‘నా భార్య నాకు అండగా నిలిచిన తీరు ఏ పెద్ద వాళ్లు చెప్పిన అప్పగింతలోనూ లేదు. బతుకు నావ ఒడిదొడుకులకు లోనయినప్పుడు తనకు తానుగా నాకు తోడు వచ్చింది. నేను ఈ రోజు ఇలా నవ్వుతూ ఉన్నానంటే కారణం మా సంధ్య ప్రోత్సాహం, సహకారమే’ అని ఓ భర్త తన భార్యను ప్రశంసల్లో ముంచెత్తాడు. భార్య గొప్పతనాన్ని చెప్పడానికి ఇష్టపడని మగ ప్రపంచంలో ఈ భర్త మాటలు వినడానికి మగవాళ్లకు ఎలా ఉందో కానీ ఆడవాళ్లు వినసొంపుగా ఆస్వాదిస్తున్నారు. ఆ భర్త కేరళ రాష్ట్రం, పాలక్కాడ్‌లోని శివకుమార్.
నోరూరించే ఉపాధి
ఓ పదహారేళ్ల కిందట... శివకుమార్ బీపీఎల్ లో ఉద్యోగం చేసేవాడు. ఆ బీపీఎల్ మూతపడడంతో అతడి ఉద్యోగం పోయింది. కొత్త ఉద్యోగం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఇంటిని నడపాల్సిన తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమవుతున్నానేమోననే ఆందోళనను అతడి భార్య సంధ్య పసిగట్టేసింది. ‘ఇల్లు గడవాలంటే ఉద్యోగమే చేయాలా? సొంతంగా మనకు వచ్చిన పని ఏదైనా చేయవచ్చు కదా’ అన్నదామె. శివకుమార్ ముఖంలో ప్రశ్నార్థకానికి బదులుగా ఆమె ‘చిరుతిండ్లు బాగా చేస్తాను. ఆ పనే మనకు అన్నం పెడుతుంది’ అన్నది.
‘మార్కెట్‌లో కొత్తరకాల స్వీట్లు ఎన్ని రకాలున్నప్పటికీ బాల్యంలో తిన్న రుచి కనిపిస్తే ఎవరికైనా నోరూరుతుంది. అదే మనకు బతుకుదెరువవుతుందని కూడా ఆమె భర్తకు భరోసానిచ్చింది. ప్రయోగాత్మంగా కొన్నింటిని చేసి బంధువులకు, స్నేహితులకు రుచి చూపించారు. వాళ్లు పాస్ మార్కులు వేయడంతో 2005లో అమృత ఫుడ్స్ పేరుతో చిరుతిళ్లను తయారు చేసే పరిశ్రమ మొదలైంది. పదిహేనేళ్లు గడిచేసరికి ఇప్పుడా దంపతులు ఏడాదికి పది లక్షల ఆదాయాన్ని చూడగలుగుతున్నారు. పదిమందికి పైగా ఉద్యోగం కల్పించారు. తమ ఆహార ఉత్పత్తులకు ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ గుర్తింపు కూడా వచ్చింది.
వ్యక్తి వికాస పాఠం
ఈ ఆధునిక యుగంలో నెలకు లక్షల జీతం తీసుకుంటున్న భార్యాభర్తలు ఎక్కువగానే ఉన్నారు. అంత సౌకర్యవంతమైన జీవితంలో కూడా నాలుగు నెలల పాటు ఉద్యోగంలో మాంద్యం ఏర్పడితే ఆ జీవితాలు తలకిందులవుతున్నాయి. మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. శివకుమార్, సంధ్య దంపతుల జీవితం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం అనే చెప్పాలి. ఉన్నత చదువు చదివిన భర్తతో ‘నాకు తెలిసిన పని, తక్కువ పెట్టుబడితో మన చేతుల శ్రమతో కొత్త వృత్తిని చేపడదా’మని చెప్పడంలో ఓ చొరవ ఉంది. తన చదువుకు తగిన ఉద్యోగం అని బేషజాలకు పోకుండా భార్య ప్రతిపాదనను గౌరవించడంలో అతడి పరిణతి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment