తోటపల్లిగూడూరు/వాకాడు, న్యూస్‌లైన్ : కొత్త సంవత్సరం ప్రారంభం నాడే జిల్లాలోని తీరప్రాంతం విషాదకరమైన ఘటనలకు వేదికైంది. తోటపల్లిగూడూరులోని కోడూరు బీచ్‌లో ఒకరు మృతి చెందడంతో పాటు ఇద్దరు గల్లంతవడంతో విషాదచాయలు అలుముకున్నాయి. స్థానికుల కథనం మేరకు..చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన లిఖిత్‌రెడ్డి(17), సతీష్(18) నెల్లూరు దర్గామిట్టలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు కళాశాల నిర్వాహకుల అనుమతితో లఖిత్‌రెడ్డి, సతీష్‌తో పాటు దినేష్, శివచైతన్య, జశ్వంత్, అనిల్, జశ్వంత్ మంగళవారం కళాశాలలో నుంచి బయటకు వచ్చారు. మంగళవారమంతా నెల్లూరులో సరదాగా గడిపిన వీరు బుధవారం కోడూరు బీచ్‌కు వచ్చారు. సముద్రంలో దిగి స్నానం చేస్తుండగా అలల తాకిడికి గల్లంతయ్యారు. స్థానికులు గమనించి రక్షించే ప్రయత్నం చేసి లిఖిత్‌రెడ్డిని బయటకు తీశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న లిఖిత్‌రెడ్డిని 108 అంబులెన్స్‌లో నెల్లూరుకు సమీపంలోని నారాయణ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వైద్యశాలకు చేరుకున్న తల్లిదండ్రులు వెంటనే మృతదేహాన్ని మదనపల్లికి తీసుకెళ్లిపోయారు. మరోవైపు సతీష్‌రెడ్డి ఆచూకీ కోసం రాత్రి వరకు గాలింపు చర్యలు కొనసాగాయి. బీచ్‌కు చేరుకున్న కళాశాల ప్రతినిధులు స్థానిక మత్స్యకారుల సహకారంతో మూడు బోట్లలో తీరంలో గాలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
సాయంత్రం మరొకరు
విద్యార్థి సతీష్‌రెడ్డి కోసం గాలింపు జరుగుతుండగానే మరొక యువకుడు గల్లంతయ్యాడు. నెల్లూరు రూరల్ మండలం మాదరాజుగూడూరుకు చెందిన జల్లి వేణు(18) తాపీపని చేస్తాడు. ఆయన తన స్నేహితులతో కలిసి బుధవారం మధ్యాహ్నం బీచ్‌కు చేరుకున్నాడు. సముద్రంలో మునుగుతుండగా అలల తాకిడికి గల్లంతయ్యాడు. చీకటి పడే వరకు వేణు ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగాయి.
తూపిలిపాళెంలో ఇద్దరు మృతి
వాకాడు: చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన పలువురు విహారయాత్రగా తూపిలిపాళెం బీచ్‌కు వచ్చారు. వీరిలో రేణిగుంట ప్రాంతానికి చెందిన నూరిళ్లు బాబు(28) అలల్లో కొట్టుకుపోతుండగా పక్కనే స్నానం చేస్తున్న శ్రీకాళహస్తి అగ్రహారానికి చెందిన మునిశేఖర్(25) కాపాడే ప్రయత్నం చేస్తూ మునిగిపోయాడు. వీరి కోసం స్నేహితులు గాలిస్తుండగా కొద్దిసేపటి తర్వాత ఇద్దరి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మునిశేఖర్ అవివాహితుడు కాగా బాబు ఏడాది క్రితమే పెళ్లయింది.
ఈ ఘటన తో వారి వెంట వచ్చిన స్నేహితులు షాక్‌కు గురయ్యారు. వెంటనే మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు బాలిరెడ్డిపాళెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు చనిపోయిన ప్రాంతంలోనే గతంలో పలువురు మునిగి ప్రాణాలు కోల్పోయారు. విహారయాత్రల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కొత్త వారు ఈ విషయం తెలియక సముద్రంలో మునిగిపోతున్నారు. ఎటువంటి రక్షణ ఏర్పాట్లు చేయని అధికారుల నిర్లక్ష్యం కారణంగా పలు ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విహారంలో విషాదం
Published Thu, Jan 2 2014 3:16 AM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM
Advertisement
Advertisement