Intermediate second year
-
12 నుంచి ఇంటర్ సెకండియర్ ఆన్లైన్ తరగతులు
సాక్షి, అమరావతి: ఏపీలో ఇంటర్ సెకండియర్ ఆన్లైన్ తరగతులు ఈ నెల 12 నుంచి ఆరంభం కానున్నాయి. ఇంటర్ సెకండియర్ 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది. ఏపీలోని అన్ని కాలేజీలకు ఈ మేరకు సమాచారాన్ని పంపింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 213 పని దినాలు ఉండనున్నాయి. ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బంది ఈ నెల 12 నుంచి కాలేజీలకు హాజరు కావాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అకడమిక్ క్యాలెండర్ వివరాలు.. ► ఈ నెల 12 నుంచి అక్టోబర్ 16 వరకు అకడమిక్ ఇయర్ ఫస్ట్ టర్మ్ ► ఆగస్టులో మొదటి యూనిట్ టెస్టు ► సెప్టెంబర్‌లో రెండో యూనిట్ టెస్టు అక్టోబర్ 1 నుంచి 8 వరకు అర్థ సంవత్సర పరీక్షలు ► అక్టోబర్ 9 నుంచి 17 వరకు ఫస్ట్ టర్మ్ సెలవులు ► అక్టోబర్ 18 నుంచి కాలేజీల పునఃప్రారంభం ► అక్టోబర్ 18 నుంచి 2022 ఏప్రిల్ 23 వరకు అకడమిక్ ఇయర్ సెకండ్ టర్మ్ ► నవంబర్‌లో 3వ యూనిట్ టెస్టు ► డిసెంబర్లో 4వ యూనిట్ టెస్టు ► 2022 జనవరి 8 నుంచి 16 వరకు సెకండ్ టర్మ్ సెలవులు ► జనవరి 17న కాలేజీల పునఃప్రారంభం ► ఫిబ్రవరి మొదటి వారంలో ప్రీ ఫైనల్ పరీక్షలు ► ఫిబ్రవరి చివరి వారం నుంచి ప్రాక్టికల్స్ ► మార్చి మొదటి వారంలో థియరీ పరీక్షలు ఆరంభం ఏప్రిల్ 23వ తేదీ చివరి పనిదినం ► ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ► మే చివరిలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ► జూన్ 1 నుంచి 2022–23 విద్యా సంవత్సరానికి కాలేజీల పునఃప్రారంభం ► అన్ని ఆదివారాలు, రెండో శనివారాలు సెలవు దినాలు. -
ఇంప్రూవ్‌మెంట్‌లో ఫెయిలైతే అంతే!
అంతకు ముందు పాస్ అయినా పరిగణనలోకి తీసుకోరు: ఇంటర్ బోర్డు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో తక్కువ మార్కులు వచ్చాయని ఇంప్రూవ్‌మెంట్‌కు వెళ్లేవారు ఇకపై జాగ్రత్త పడాలి. వార్షిక పరీక్షలో వచ్చిన మార్కుల కంటే ఎక్కువ మార్కుల కోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఇంప్రూవ్మెంట్ రాస్తే, వచ్చిన ఫలితాలే పరిగణనలోకి తీసుకుంటారు. ఫెయిల్ అయితే ఫెయిల్ కిందే లెక్క. వార్షిక పరీక్షల్లో వచ్చిన మార్కులను లెక్కలోకి తీసుకోరు. వార్షిక పరీక్షలు, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాటినే పరిగణనలోకి తీసుకునే విధానం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికే పరిమితమని, ద్వితీయ సంవత్సరంలో అలా ఉండదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్‌లో వార్షిక పరీక్షలే లెక్క ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ తుది ర్యాంకుల ఖరారులో (జేఈఈ స్కోర్‌కు 60 శాతం, ఇంటర్ మార్కులకు 40 శాతం) ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మార్కులను పరిగణలోకి తీసుకోరు. ఈ విషయాన్ని ఇటీవల తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తెలియజేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకులు సాధించిన వారు ఇకపై ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలంటే రాష్ట్ర బోర్డు నుంచి హాజరైన విద్యార్థుల్లో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి. లేదా బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు సాధించాలి. ఈ నిబంధనను ఈసారి ఐఐటీ ప్రవేశాల్లో అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఇంప్రూవ్మెంట్ కోసం రాసే విద్యార్థుల సంఖ్య తగ్గనుంది. ఎంసెట్‌లో రెండూ.. ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ తుది ర్యాంకును ఖరారు చేస్తారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయి, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో పాస్ అయితే ఆ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. వాటి ఆధారంగా విద్యార్థి ఎంసెట్ తుది ర్యాంకును ఖరారు చేస్తారు. -
నేటి నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు
జిల్లాలో166 కేంద్రాలు 32,285 మంది విద్యార్థులు నాలుగు విడ తలుగా పరీక్షలు నాలుగు ఫ్ల్లయింగ్ స్క్వాడ్ బృందాలు విశాఖపట్నం : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రయోగ పరీక్షలు గురువారం ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 166 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అర్బన్‌లో 91, రూరల్‌లో 58, ఏజెన్సీలో 17 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాలుగు విడతలుగా జరిగే ఈ పరీక్షలకు తొలి విడత 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరగనున్నాయి. 18 నుంచి 22 వరకు రెండో విడత, 23 నుంచి 27 వరకు మూడో విడత, 28 నుంచి మార్చి 4 వరకు నాల్గో విడత పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలుంటాయి. ఈ పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా 32,285 మంది హాజరుకానున్నారు. ఎంపీసీ 25,647 మంది, బైపీసీ 6,638 మంది విద్యార్థులు ప్రయోగ పరీక్షల్లో పాల్గొంటున్నారు. ప్రాక్టికల్స్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, ఆర్ఐవో, డీవీఈవో, ఆర్జేడీ, రెవెన్యూ బృందాలు పరీక్షలను పర్యవేక్షిస్తాయి. మాల్ ప్రాక్టీస్ జరగకుండా ప్రత్యేక చర్యలు ప్రాక్టికల్స్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలో పరీక్షలు నిర్వహిస్తున్న 166 కేంద్రాల్లో వీడియో రికార్డ్ చేయనున్నారు. ఏ కళాశాల విద్యార్థులకు అదే కళాశాలలో పరీక్ష నిర్వహించడం వల్ల ఈ పద్ధతి ప్రవేశపెట్టారు. తమ కళాశాల ఉత్తీర్ణత శాతం మెరుగుపరచడానికి, ఎక్కువ మార్కుల సాధనకు కొన్ని కళాశాలలు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నాయి. అందుకే పరీక్ష గదుల్లో వీడియో రికార్డ్ ద్వారా విద్యార్థులు ప్రయోగాలు ఏ విధంగా చేస్తున్నారో తెలుసుకుంటారు. ఏజెన్సీలో మాల్ ప్రాక్టీస్ జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. -
సీనియర్ ఇంటర్లోనూఅమ్మాయిలదే జోరు
జిల్లాలో 55 శాతం మంది విద్యార్థుల ఉత్తీర్ణత 2013 ఫలితాలతో పోలిస్తే ఒక శాతం తక్కువ రాష్ట్రస్థాయిలో 19, తెలంగాణలో నాలుగో స్థానం విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియట్ సెకండియర్ వార్షిక పరీక్ష ఫలితాల్లోనూ బాలికల హవానే కొనసాగింది. ఈ ఏడాది మార్చిలో ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఫస్టియర్ పరీక్షల ఫలితాలు విడుదల కాగా... ఉత్తీర్ణతలో బాలుర కంటే బాలికలు పైచేయి సాధించారు. జిల్లాలో శనివారం విడుదలైన సెకండియర్ ఫలితాల్లోనూ ఇదే పునరావృతమైంది. సీనియర్ ఇంటర్ జనరల్ విభాగంలో మొత్తం 55 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో మొత్తం 43,267 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా... 23,814 మంది ఉత్తీర్ణులయ్యూరు. 21,665 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా... 11,070 మంది (51 శాతం) పాసయ్యూరు. 21,602 మంది బాలికలు పరీక్షలు రాయగా... 12,744 మంది (59 శాతం) ఉత్తీర్ణులయ్యూరు. ఉత్తీర్ణత శాతంలో బాలుర కంటే బాలికలే పైచేయిగా నిలిచారు. ఒక్క శాతం తగ్గింది... గత ఏడాది ఇంటర్ సెకండియర్ వార్షిక పరీక్షల్లో 56 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా... ఈ ఏడాది 55 శాతం మంది పాస్ అయ్యూరు. గత ఏడాది కంటే ఒక శాతం ఉత్తీర్ణత తగ్గింది. ఉత్తీర్ణత శాతంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా 19వ స్థానంలో నిలవగా... తెలంగాణలో నాలుగో స్థానంలో నిలిచింది. ప్రభుత్వ కళాశాలల్లో 58 శాతం ఉత్తీర్ణత జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. 4,366 మంది విద్యార్థులు సెకండియర్ పరీక్షలకు హాజరయ్యూరు. ఇందులో 2,529 మంది విద్యార్థులు (58 శాతం) ఉత్తీర్ణులయ్యూ రు. పరీక్షలకు 2,094 మంది బాలురు హాజరు కాగా... 1134 మంది (54.15 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 2,272 మంది బాలికలు పరీక్షలు రాయగా... 1395 మంది (61.40 శాతం) పాసయ్యూరు. తాడ్వాయి జూనియర్ కళాశాల 92.31 శాతం ఉత్తర్ణత సాధించి జిల్లాలో టాప్‌గా నిలిచింది. కొడకండ్ల జూనియర్ కళాశాల 92.04 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. అత్యల్పంగా రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల 15.53 శాతం ఉత్తీర్ణత సాధించింది. 50 శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించిన కళాశాలలు జిల్లాలో 26 వరకు ఉన్నాయి. హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 30.70 శాతం మంది, పింగిళి కళాశాలలో 23.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యూరు. ఒకేషనల్‌లో 46 శాతం ఉత్తీర్ణత సెకండియర్ ఒకేషనల్ పరీక్షల ఫలితాల్లో 46 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 4,781 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 2,223 మంది ఉత్తీర్ణులయ్యారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు గడువు 9 ఈనెల 25 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు సెకండియర్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు ఈ నెల తొమ్మిదో తేదీలోపు ఫీజు చెల్లించాలని ఇంటర్ విద్య ఆర్ఐఓ మలహల్రావు సూచించారు. టాపర్లు వీరే.. ఇంటర్ సెకండియర్ వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లాలో ప్రైవేటు కళాశాలల విద్యార్థులు హవా కొనసాగించా రు. హన్మకొండలోని ఎస్ఆర్ కాలేజీ విద్యార్థినులు డి.వైష్ణవి, ఎ.శిరీష ఎంపీసీలో 987 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచారు. బీపీసీలో 984 మార్కులతో ఎస్వీఎస్ కాలేజీకి చెందిన ఎం.నాగశ్రీ, సీఈసీ లో శివానీ జూనియర్ కాలేజీ విద్యార్థి ఎస్.ప్రశాంత్ 958 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారు. వాగ్దేవి జూనియర్ కళాశాల ఎంఈసీ విద్యార్థి డి.భావన 973 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచారు. -
విహారంలో విషాదం
తోటపల్లిగూడూరు/వాకాడు, న్యూస్‌లైన్ : కొత్త సంవత్సరం ప్రారంభం నాడే జిల్లాలోని తీరప్రాంతం విషాదకరమైన ఘటనలకు వేదికైంది. తోటపల్లిగూడూరులోని కోడూరు బీచ్‌లో ఒకరు మృతి చెందడంతో పాటు ఇద్దరు గల్లంతవడంతో విషాదచాయలు అలుముకున్నాయి. స్థానికుల కథనం మేరకు..చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన లిఖిత్‌రెడ్డి(17), సతీష్(18) నెల్లూరు దర్గామిట్టలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు కళాశాల నిర్వాహకుల అనుమతితో లఖిత్రెడ్డి, సతీష్‌తో పాటు దినేష్, శివచైతన్య, జశ్వంత్, అనిల్, జశ్వంత్ మంగళవారం కళాశాలలో నుంచి బయటకు వచ్చారు. మంగళవారమంతా నెల్లూరులో సరదాగా గడిపిన వీరు బుధవారం కోడూరు బీచ్‌కు వచ్చారు. సముద్రంలో దిగి స్నానం చేస్తుండగా అలల తాకిడికి గల్లంతయ్యారు. స్థానికులు గమనించి రక్షించే ప్రయత్నం చేసి లిఖిత్‌రెడ్డిని బయటకు తీశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న లిఖిత్‌రెడ్డిని 108 అంబులెన్స్‌లో నెల్లూరుకు సమీపంలోని నారాయణ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వైద్యశాలకు చేరుకున్న తల్లిదండ్రులు వెంటనే మృతదేహాన్ని మదనపల్లికి తీసుకెళ్లిపోయారు. మరోవైపు సతీష్‌రెడ్డి ఆచూకీ కోసం రాత్రి వరకు గాలింపు చర్యలు కొనసాగాయి. బీచ్‌కు చేరుకున్న కళాశాల ప్రతినిధులు స్థానిక మత్స్యకారుల సహకారంతో మూడు బోట్లలో తీరంలో గాలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. సాయంత్రం మరొకరు విద్యార్థి సతీష్‌రెడ్డి కోసం గాలింపు జరుగుతుండగానే మరొక యువకుడు గల్లంతయ్యాడు. నెల్లూరు రూరల్ మండలం మాదరాజుగూడూరుకు చెందిన జల్లి వేణు(18) తాపీపని చేస్తాడు. ఆయన తన స్నేహితులతో కలిసి బుధవారం మధ్యాహ్నం బీచ్‌కు చేరుకున్నాడు. సముద్రంలో మునుగుతుండగా అలల తాకిడికి గల్లంతయ్యాడు. చీకటి పడే వరకు వేణు ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగాయి. తూపిలిపాళెంలో ఇద్దరు మృతి వాకాడు: చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన పలువురు విహారయాత్రగా తూపిలిపాళెం బీచ్‌కు వచ్చారు. వీరిలో రేణిగుంట ప్రాంతానికి చెందిన నూరిళ్లు బాబు(28) అలల్లో కొట్టుకుపోతుండగా పక్కనే స్నానం చేస్తున్న శ్రీకాళహస్తి అగ్రహారానికి చెందిన మునిశేఖర్(25) కాపాడే ప్రయత్నం చేస్తూ మునిగిపోయాడు. వీరి కోసం స్నేహితులు గాలిస్తుండగా కొద్దిసేపటి తర్వాత ఇద్దరి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మునిశేఖర్ అవివాహితుడు కాగా బాబు ఏడాది క్రితమే పెళ్లయింది. ఈ ఘటన తో వారి వెంట వచ్చిన స్నేహితులు షాక్‌కు గురయ్యారు. వెంటనే మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు బాలిరెడ్డిపాళెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు చనిపోయిన ప్రాంతంలోనే గతంలో పలువురు మునిగి ప్రాణాలు కోల్పోయారు. విహారయాత్రల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కొత్త వారు ఈ విషయం తెలియక సముద్రంలో మునిగిపోతున్నారు. ఎటువంటి రక్షణ ఏర్పాట్లు చేయని అధికారుల నిర్లక్ష్యం కారణంగా పలు ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.