అంతకు ముందు పాస్ అయినా పరిగణనలోకి తీసుకోరు: ఇంటర్ బోర్డు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో తక్కువ మార్కులు వచ్చాయని ఇంప్రూవ్‌మెంట్‌కు వెళ్లేవారు ఇకపై జాగ్రత్త పడాలి. వార్షిక పరీక్షలో వచ్చిన మార్కుల కంటే ఎక్కువ మార్కుల కోసం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో ఇంప్రూవ్‌మెంట్ రాస్తే, వచ్చిన ఫలితాలే పరిగణనలోకి తీసుకుంటారు. ఫెయిల్ అయితే ఫెయిల్ కిందే లెక్క. వార్షిక పరీక్షల్లో వచ్చిన మార్కులను లెక్కలోకి తీసుకోరు.
వార్షిక పరీక్షలు, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాటినే పరిగణనలోకి తీసుకునే విధానం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికే పరిమితమని, ద్వితీయ సంవత్సరంలో అలా ఉండదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
జేఈఈ మెయిన్‌లో వార్షిక పరీక్షలే లెక్క
ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ తుది ర్యాంకుల ఖరారులో (జేఈఈ స్కోర్‌కు 60 శాతం, ఇంటర్ మార్కులకు 40 శాతం) ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటారు. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ మార్కులను పరిగణలోకి తీసుకోరు. ఈ విషయాన్ని ఇటీవల తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) తెలియజేసింది.
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకులు సాధించిన వారు ఇకపై ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలంటే రాష్ట్ర బోర్డు నుంచి హాజరైన విద్యార్థుల్లో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి. లేదా బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు సాధించాలి. ఈ నిబంధనను ఈసారి ఐఐటీ ప్రవేశాల్లో అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఇంప్రూవ్‌మెంట్ కోసం రాసే విద్యార్థుల సంఖ్య తగ్గనుంది.
ఎంసెట్‌లో రెండూ..
ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ తుది ర్యాంకును ఖరారు చేస్తారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయి, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో పాస్ అయితే ఆ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. వాటి ఆధారంగా విద్యార్థి ఎంసెట్ తుది ర్యాంకును ఖరారు చేస్తారు.
ఇంప్రూవ్‌మెంట్‌లో ఫెయిలైతే అంతే!
Published Tue, Apr 28 2015 3:58 AM | Last Updated on Tue, Jun 4 2019 6:36 PM
Advertisement
Advertisement