advanced supplementary
-
నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
సాక్షి, అమరావతి: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2023–24 విద్యా సంవత్సరంలో ఫెయిలైన మొత్తం 1,61,877 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నట్టు పదో తరగతి పరీక్షల విభాగం ప్రకటించింది. వీరిలో 96,938 మంది బాలురు కాగా.. 64,939 మంది బాలికలు ఉన్నారు. శుక్రవారం నుంచి జూన్ 3వ తేదీ వరకు మొత్తం 9 రోజులపాటు జరిగే పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 685 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. రెగ్యులర్ పరీక్షల మాదిరగానే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు.పర్యవేక్షణకు 685 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 685 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 6,900 మంది ఇని్వజిలేటర్లతో పాటు 86 ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను నియమించామన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలను ‘నో ఫోన్ జోన్’గా ప్రకటించామని, ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని ప్రకటించారు. డీఈవోల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షలు ముగిసేవరకు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షల డైరెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, పరీక్షలపై ఎలాంటి సందేహాలున్నా 0866–2974540 నంబర్లో సంప్రదించాలని దేవానందరెడ్డి సూచించారు.పరీక్షల షెడ్యూల్ ఇదీ.. 24–5–2024 తెలుగు 25–5–2024 హిందీ 27–5–2024 ఇంగ్లిష్ 28–5–2024 లెక్కలు 29–5–2024 ఫిజికల్ సైన్స్ 30–5–2024 బయలాజికల్ సైన్స్ 31–5–2024 సోషల్ స్టడీస్ 01–6–2024 ఓఎస్ఎస్సీ పేపర్–1 03–6–2024 ఓఎస్ఎస్సీ పేపర్–2 -
ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారా.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో తాజా ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటారు. విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఫెయిలైతే అంతకుముందుకు ఆ సబ్జెక్టులో పాసైనా కూడా ఫెయిల్ అయినట్లే పరిగణిస్తారు. ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు. ప్రథమ సంవత్సర విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఉతీర్ణులైన వారు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. సాధారణ ఫీజుతో పాటు ప్రతి పేపర్‌కు రూ.150 చొప్పున చెల్లించాలి. ద్వితీయ సంవత్సర విద్యార్థులు.. 2016 తర్వాత ఇంటర్ ఉత్తీర్ణులైన వారు రెండేళ్లలో రెండు సార్లు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. ద్వితీయ సంవత్సర పేపర్లను, ప్రాక్టికల్స్ రాసినా, ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పేపర్లలో ఇంప్రూవ్మెంట్ రాస్తే.. గతంలో వచ్చిన మార్కులనైనా ఉంచుకోవచ్చు. తాజా మార్కులనైనా ఎంచుకోవచ్చు. కానీ ఒక సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వచ్చాయని వాటిని పరిగణనలోకి తీసుకోవడం కుదరదు. జేఈఈ మెయిన్‌లో వార్షిక పరీక్షలే లెక్క ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తుది ర్యాంకుల ఖరారులో (జేఈఈ స్కోర్‌కు 60 శాతం, ఇంటర్మీడియట్ మార్కులకు 40 శాతం కలిపి) ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. ఇక ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలంటే రాష్ట్ర బోర్డు నుంచి పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో టాప్–20 పర్సంటైల్‌లో ఉండాలి. లేదా బోర్డులో 75 శాతం మార్కులు (జనరల్ విద్యార్థులు) సాధించి ఉంటే చాలు. -
ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలు ప్రారంభం
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభం అయాయి. జూన్ 1 వరకూ ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలు పకడ్బందీగా జరిగేలా ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ప్రథమ సంవత్సర పరీక్షలు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతాయి. అరగంట ముందే పరీక్ష హాల్లోకి రావాలని, నిర్ణీత సమయం తరువాత అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షలకు ప్రథమ సంవత్సర విద్యార్థులు 3,14,505 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 1,73,331 మంది హాజరు కానున్నారు. ప్రాక్టికల్స్ జూన్ 4 నుంచి 7 వరకు జరుగుతాయి. ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష 8న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష 9న ఉంటాయి. వొకేషనల్ విద్యార్థులకూ ఇవే వర్తిస్తాయి. -
రేపటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈనెల 25 నుంచి వచ్చే నెల 1 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి డా.అశోక్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ప్రథమ సంవత్సర పరీక్షలు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలు ఉంటాయన్నారు. అరగంట ముందే పరీక్ష హాల్లోకి రావాలని, నిర్ణీత సమయం తరువాత అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్షలకు ప్రథమ సంవత్సర విద్యార్థులు 3,14,505 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 1,73,331 మంది హాజరుకానున్నారు. ప్రాక్టికల్స్ జూన్ 4 నుంచి 7 వరకు జరుగుతాయి. ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష 8న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష 9న ఉంటాయి. వొకేషనల్ విద్యార్థులకూ ఇవే వర్తిస్తాయి. -
జూన్ 18 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
27లోగా స్కూళ్లకు మార్కుల మెమోలు సాక్షి, హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను వచ్చే నెల 18 నుంచి జూలై 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజు చెల్లింపు గడువు పెంచేది లేదని స్పష్టం చేశారు. ఈ పరీక్షలకు సమయం తక్కువగా ఉందని, ఫెయిల్ అయిన విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే అవి తేలే వరకు వేచి చూడొద్దని, ముందుగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించాలని సూచించారు. విద్యార్థుల మార్కుల మెమోలు, నామినల్ రోల్స్ అన్నీ ఈ నెల 27వ తేదీలోగా సంబంధిత పాఠశాలలకు పంపిస్తామని చెప్పారు. పాఠశాలల నుంచి పూర్తి సమాచారం అందని కారణంగా కొంతమంది విద్యార్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టినట్లు పేర్కొన్నారు. వాటిని త్వరలోనే ప్రకటించేందుకు చర్యలు చేపడతామన్నారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు 12 రోజుల గడువు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం విద్యార్థులు 12 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ. 500 చొప్పున ‘సెక్రటరీ టు ది కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, హైదరాబాద్, తెలంగాణ’ పేరున ఎస్బీహెచ్ లేదా ఎస్బీఐలో డీడీ తీసి అభ్యర్థన పత్రంతో దరఖాస్తు చేసుకోవాలి. ఇక రీ వెరిఫికేషన్ కోసం జిల్లాల్లోని డీఈవో కార్యాలయాల్లో వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కో సబ్జెక్టుకు రూ. 1000 చొప్పున చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారాన్ని www.bsetelangana.org వెబ్సైట్లో పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారంపై సంబంధిత ప్రధానోపాధ్యాయుడితో ధ్రువీకరణ సంతకం చేయించి, హాల్‌టికెట్ జిరాక్స్ కాపీని జత చేసి, డీఈవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో అందజేయాలి. పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపించే దరఖాస్తులను స్వీకరించరు. రీ వెరిఫికేషన్‌లో గ్రేడ్ మారితేనే సవరించిన ధ్రువీకరణ పత్రాలను అందజేస్తారు. దీని కోసం దరఖాస్తు చేసిన వారు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. -
ఇంప్రూవ్‌మెంట్‌లో ఫెయిలైతే అంతే!
అంతకు ముందు పాస్ అయినా పరిగణనలోకి తీసుకోరు: ఇంటర్ బోర్డు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో తక్కువ మార్కులు వచ్చాయని ఇంప్రూవ్‌మెంట్‌కు వెళ్లేవారు ఇకపై జాగ్రత్త పడాలి. వార్షిక పరీక్షలో వచ్చిన మార్కుల కంటే ఎక్కువ మార్కుల కోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఇంప్రూవ్మెంట్ రాస్తే, వచ్చిన ఫలితాలే పరిగణనలోకి తీసుకుంటారు. ఫెయిల్ అయితే ఫెయిల్ కిందే లెక్క. వార్షిక పరీక్షల్లో వచ్చిన మార్కులను లెక్కలోకి తీసుకోరు. వార్షిక పరీక్షలు, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాటినే పరిగణనలోకి తీసుకునే విధానం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికే పరిమితమని, ద్వితీయ సంవత్సరంలో అలా ఉండదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్‌లో వార్షిక పరీక్షలే లెక్క ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ తుది ర్యాంకుల ఖరారులో (జేఈఈ స్కోర్‌కు 60 శాతం, ఇంటర్ మార్కులకు 40 శాతం) ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మార్కులను పరిగణలోకి తీసుకోరు. ఈ విషయాన్ని ఇటీవల తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తెలియజేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకులు సాధించిన వారు ఇకపై ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలంటే రాష్ట్ర బోర్డు నుంచి హాజరైన విద్యార్థుల్లో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి. లేదా బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు సాధించాలి. ఈ నిబంధనను ఈసారి ఐఐటీ ప్రవేశాల్లో అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఇంప్రూవ్మెంట్ కోసం రాసే విద్యార్థుల సంఖ్య తగ్గనుంది. ఎంసెట్‌లో రెండూ.. ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ తుది ర్యాంకును ఖరారు చేస్తారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయి, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో పాస్ అయితే ఆ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. వాటి ఆధారంగా విద్యార్థి ఎంసెట్ తుది ర్యాంకును ఖరారు చేస్తారు. -
4నుంచి ‘అడ్వాన్స్డ్’ విద్యార్థులకు శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయి, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కానున్న ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల కోసం మూడువారాల పాటు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియంశ్రీహరి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఫెయిల్ అయిన సబ్జెక్టుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనరల్, వొకేషనల్‌లో కలిపి ద్వితీయ సంవత్సరంలో 2,29,478 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, ఇంటర్ ప్రథమ సంవత్సరంలోనూ మరో 2 లక్షల మంది వరకు విద్యార్థులు ఫెయిల్ అయ్యారని తెలిపారు. ఈ నేపథ్యంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకోసం ఇంగ్లిషు, సైన్స్, గణితం తదితర సబ్జెక్టుల్లో నిఫుణులైన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లతో మూడు వారాల ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మే 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ ప్రత్యేక శిక్షణను చేపట్టనున్నట్లు చెప్పారు. పట్టణాల్లో ఈ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నందున బాల బాలికలకు ఉచితంగా వసతిని కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. జిల్లాల్లో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, అయితే విద్యార్థుల నుంచి వచ్చే దరఖాస్తులను బట్టి కేంద్రాల సంఖ్యను పెంచుతామని చెప్పారు. ఈ అవకాశం ప్రభుత్వం కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులకు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. -
నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
9.81 లక్షల మంది విద్యార్థుల కోసం 1,855 కేంద్రాల్లో ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈనెల 25 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ తెలిపారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. 1,855 కేంద్రాల్లో 9,81,545 మంది పరీక్ష రాయనున్నారు. వారిలో ప్రథమ సంవత్సర పరీక్షలకు 6,47,280 మంది, ద్వితీయ సంవత్సరానికి 2,81,775 మంది, ఇక వొకేషనల్ కోర్సుల్లో ప్రథమ సంవత్సర పరీక్షలకు 22,177 మంది, ద్వితీయ సంవత్సరానికి 30,313 మంది హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సర పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, ద్వితీయ సంవత్సర పరీక్షలను మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహించనున్నారు. ద్వితీయ భాష పేపరు-1లో పాత, కొత్త సిలబస్ ఉందని, పరిశీలించి ప్రశ్నపత్రం తీసుకోవాలని కార్యదర్శి సూచించారు.