సాక్షి, హైదరాబాద్: ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయి, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కానున్న ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల కోసం మూడువారాల పాటు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియంశ్రీహరి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఫెయిల్ అయిన సబ్జెక్టుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జనరల్, వొకేషనల్‌లో కలిపి ద్వితీయ సంవత్సరంలో 2,29,478 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, ఇంటర్ ప్రథమ సంవత్సరంలోనూ మరో 2 లక్షల మంది వరకు విద్యార్థులు ఫెయిల్ అయ్యారని తెలిపారు.
ఈ నేపథ్యంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకోసం ఇంగ్లిషు, సైన్స్, గణితం తదితర సబ్జెక్టుల్లో నిఫుణులైన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్లతో మూడు వారాల ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మే 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ ప్రత్యేక శిక్షణను చేపట్టనున్నట్లు చెప్పారు.
పట్టణాల్లో ఈ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నందున బాల బాలికలకు ఉచితంగా వసతిని కూడా కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. జిల్లాల్లో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, అయితే విద్యార్థుల నుంచి వచ్చే దరఖాస్తులను బట్టి కేంద్రాల సంఖ్యను పెంచుతామని చెప్పారు. ఈ అవకాశం ప్రభుత్వం కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులకు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
4నుంచి ‘అడ్వాన్స్‌డ్’ విద్యార్థులకు శిక్షణ
Published Tue, Apr 28 2015 3:56 AM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM
Advertisement