కాలేజీల్లో లంచ్‌..   | Midday Meals For College Students | Sakshi
Sakshi News home page

కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

Published Mon, Jul 30 2018 12:01 PM | Last Updated on Wed, Aug 29 2018 7:54 PM

Midday Meals For  College Students - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

విద్యారణ్యపురి: కళాశాల విద్యార్థులకు ఇక లంచ్‌ కష్టాలు తీరనున్నాయి. ప్రభు త్వ జూనియర్, డిగ్రీ, పాలీటెక్నిక్, డైట్, బీఎడ్, మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరంలో మధ్యాహ్న భోజ నం ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడంతో ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో చాలా మంది ఉద యం భోజనం లేదా టిఫిన్‌ చేసి కళాశాలకు వచ్చేస్తుండగా, కొందరు మాత్రం ఇంటి నుంచి లంచ్‌ బాక్స్‌లు తెచ్చుకుంటున్నారు.

తెచ్చుకున్న లంచ్‌ బాక్స్‌ను విప్పి తినేందుకు ప్రభుత్వ కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు భోజనం తెచ్చుకునేందుకు కూడా వెనుకాడుతున్నారు. దీంతో ఆకలి తీర్చుకునేందుకు చాయ్, సమోసాలను ఆశ్రయిస్తున్నారు. విద్యార్థులు మధ్యాహ్న భోజ నం చేసేందుకు ఇంటికో, అద్దె రూమ్‌కో వెళ్లిపోతుండడం వల్ల కళాశాలల్లో తరగతులు ఒక పూటే నిర్వహించాల్సి వస్తోంది.

మధ్యాహ్నం తర్వాత క్లాస్‌లు ఉన్నా విద్యార్థులు కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతోపాటు తరగతులు రెండు పూటలా జరిగే అవకాశముందని ఆయా కళాశాలల అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. 

ఇంటర్‌లో 12 వేల మందికి లబ్ధి.. 

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో గత మూడేళ్లుగా ఇంటర్‌లో ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా పూర్తి స్థాయిలో ఉచిత విద్యను ప్రభుత్వం అందిస్తోంది. అంతేగాక విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందిస్తున్నారు. రెండేళ్ల క్రితమే విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఉచిత విద్యతోపాటు అడ్మిషన్ల పెరుగుదలకు మధ్యాహ్న భోజనం కూడా అమలు చేస్తామని ప్రకటించారు.

కానీ ఏ కారణంగానో ఇప్పటి వరకు ఆ హామీ అమలుకు నోచుకోలేదు. ఈ పథకం అమలుతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 44 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న సుమారు 12 వేల మందికిపైగా ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్‌ విద్యార్థుల ఆకలి తీరనుంది. 

7,900 మంది డిగ్రీ విద్యార్థులకు ప్రయోజనం.. 

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొత్తం 14 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా, అందులో 7,900 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో హన్మకొండలోని ఒక్క కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే 3,618 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాలలో 1600 మంది విద్యార్థినులు, ఏటూరునాగారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 718 మంది విద్యార్థులు, జనగామ డిగ్రీ కళాశాలలో సుమారు 1500 మంది, నర్సంపేట డిగ్రీ కళాశాలలో 213 మంది, మహదేవపూర్‌ డిగ్రీ కళాశాలలో 192 మంది విద్యార్థులు చదువుతుండగా మిగతా డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగానే ఉంది.

పరీక్షల సమయానికి రెండు నెలల ముందు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో దాతల సహకారంతోనైనా మధ్యాహ్న భోజనం పెట్టాలని ఉన్నత విద్యా కమిషనర్‌ మూడేళ్ల క్రితం ఆదేశాలు జారీ చేశారు. దీంతో హన్మకొండలోని పింగిళి డిగ్రీ కళాశాల, మహబాబూబాద్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు కొంత నిధులు వేసుకుని, దాతల సహకారంతో మధ్యాహ్న భోజనం అమలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వమే మధ్యాహ్న భోజనం అందించబోతుండడంతో అధ్యాపకులకు కొంత శ్రమ తప్పినట్లయ్యింది. 

డైట్, బీఎడ్‌ విద్యార్థులకు ఊరట... 

హన్మకొండలో ఒకే ప్రభుత్వ డైట్‌ కళాశాల ఉంది. అందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మీడియం కలిపి 230 మంది చదువుకుంటున్నారు. అలాగే హన్మకొండలోని ప్రభుత్వ బీఎడ్‌ కళాశాలలో రెండు వందల సీట్లు ఉండగా అందులో ప్రస్తుతం 130 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ రెండు కళాశాలల విద్యార్థులకు హాస్టల్‌ సౌకర్యం లేదు. దీంతో వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నవారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వారికి కూడా మధ్యాహ్న భోజనం వర్తింపజేయడంతో కొంత ఊరట కలగనుంది. 

నాలుగు పాలిటెక్నిక్‌ కళాశాల్లో 3,240 మంది విద్యార్థులు.. 

వరంగల్‌ ప్రభుత్వ పాలీటెక్నిక్‌ కళాశాల(కోఎడ్యుకేషన్‌)లో సుమారు 1600 మంది విద్యార్థులు, వరంగల్‌ ప్రభుత్వ మహిళా పాలీటెక్నిక్‌ కళాశాలలో 800 మంది విద్యార్థినులు, పరకాల పాలీటెక్నిక్‌ కళాశాలలో 360 మంది, స్టేషన్‌ ఘన్‌పూర్‌ పాలీటెక్నిక్‌ కళాశాలలో 480 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మధ్యాహ్న భోజనం వర్తింపజేయబోతుండడంతో వారిలో ఆశలు చిగురుస్తున్నాయి.  

మోడల్‌ స్కూళ్లలోనూ.. 

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 30 మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి. అందులో 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థులు ఉన్నారు. ఒక్కో మోడల్‌స్కూల్‌లో బాలికలకు కొన్ని క్లాస్‌ల వరకు వంద మందికి మాత్రమే హాస్టల్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. మిగతా వారంతా లంచ్‌ బాక్స్‌లతో వెళ్తున్నారు. ఒక్కో స్కూల్‌లో 750 నుంచి 800  మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికి మ«ధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పిస్తే ప్రయోజనం చేకూరనుంది.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న వారంతా పేదవర్గాలకు చెందినవారే ఉంటున్నారు. మధ్యాహ్న భోజనం  అమలు నిర్ణయాన్ని ఆయా వర్గాలు స్వాగతిస్తున్నాయి. ప్రభుత్వం అందజేసే భోజనంలో నాణ్యత పాటించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పథకం అమలును అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు అప్పగించాలని మంత్రివర్గం ప్రాథమికంగా నిర్ణయించడం వల్ల త్వరలోనే ఈ పథకం అమలు కాబోతుందని విద్యార్థులు ఆశిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement