9.81 లక్షల మంది విద్యార్థుల కోసం 1,855 కేంద్రాల్లో ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈనెల 25 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ తెలిపారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. 1,855 కేంద్రాల్లో 9,81,545 మంది పరీక్ష రాయనున్నారు. వారిలో ప్రథమ సంవత్సర పరీక్షలకు 6,47,280 మంది, ద్వితీయ సంవత్సరానికి 2,81,775 మంది, ఇక వొకేషనల్ కోర్సుల్లో ప్రథమ సంవత్సర పరీక్షలకు 22,177 మంది, ద్వితీయ సంవత్సరానికి 30,313 మంది హాజరుకానున్నారు.
ప్రథమ సంవత్సర పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, ద్వితీయ సంవత్సర పరీక్షలను మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహించనున్నారు. ద్వితీయ భాష పేపరు-1లో పాత, కొత్త సిలబస్ ఉందని, పరిశీలించి ప్రశ్నపత్రం తీసుకోవాలని కార్యదర్శి సూచించారు.